Friday 23 March 2018

నేను శివ ని(నవల) Post no:27

నేను శివ ని(నవల) Post no:27

చాప్టర్-8

" వావ్..రాం కి ప్రియాక అని  ఇంకో పేరు ఉందా..అది నాకు తెలీదే..!ముద్దు పేరా అది? ఈ రోజు నేను చెబుతున్నది సరిగా వినకుండా పరధ్యానంగా ఉండానికి అదా కారణం..ఆ యావ లో ఉన్నావా ఆ ప్రియాంక తో" దెయ్యం లా నవ్వాడు వరుణ్.ఆ తర్వాత నా జుట్టు గట్టిగా పట్టుకున్నాడు.

" నన్ను వదులు" నా జుట్టు విడిపించుకోడానికి ప్రయత్నిస్తున్నాను.

" నేను ముందే చెప్పాను..నాతో అబద్ధం ఆడితే దానికి అనుభవిస్తావు అని.నా వార్నింగ్ సీరియస్ గా తీసుకోలేదు గదూ ..దానికి గాను మూల్యం చెల్లించవలసిందే..." లోపల దడదడ లాడసాగింది.చావగొడితేనో..!

"అంటే నా క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే దొరికాడా నీకు ఈ సారి అఫైర్ పెట్టుకోడానికి...నువు పెద్ద బోకు వి అని తెలుసు ..కానీ ఈ స్థాయి లో అని ఊహించలేదు" అలా అంటూ నా జుట్టు పట్టుకుని రూం లోకి లాక్కొచ్చాడు.

" ప్లీజ్ వరుణ్..వదిలి పెట్టు జుట్టు ని ...నొప్పి గా ఉంది" అన్నాను.

" అలాగే ఉంటుంది ప్రియతమా..నేను అనుభవిస్తున్న నొప్పి తో పోల్చితే ఇదెంతా..?నేను అనుభవించినంత నువూ అనుభవించాలిగా నొప్పి" బెడ్ మీదకి తోశాడు నన్ను.

" రాం కి నాకు మధ్య ఏమీ లేదు.అదంతా నువు ఊహించుకుంటున్నావు.మేము మంచి స్నేహితులము మాత్రమే...కావాలంటే నువే అతడిని అడుగు " కన్నీళ్ళతో చెప్పాను.

" నేను పిచ్చొడిలా కనిపిస్తున్నానా..ఆ మాత్రం తేడా తెలియదనుకుంటున్నావా..నీ నంగనాచి కబుర్లు కి పడిపోతానా" నా భుజాలు పట్టుకుని చెప్పాడు.

" దయచేసి నన్ను నమ్ము.నేను నిన్ను ప్రేమించే నీ పార్వతిని" చెప్పాను.

" నువు నా పార్వతి వి కావు.నువు ఒక బజారు సరుకు వి..నన్ను వెధవని చేస్తున్నావా ..నిన్ను పూర్తిగా పరిశీలించకుండానే నీ వల లో ఇంచుమించు పడిపోయాను.లోపలకంటా వెళ్ళి చూస్తే నీ నిజరూపం ఇదన్నమాట.పూర్వం లా నేను ఎందుకు లవ్ చేయడం లేదో తెలుసా,దానికి కారణం నీ పనికిమాలిన ప్రవర్తనే ..దానికి రుజువులు కావాలా..నీ స్కూల్ డేస్ లోనే ఇద్దరి తో పోయావు..నీ మొత్తం జాతకం అంతా ఆ గుణ కే తెలుసు ,నువ్వు ఒక దేవతవి ..అది నేను నమ్మాలి ,వింటే నవ్వొస్తున్నది"ఆ రూం లో తిరుగుతూ వాగుతున్నాడు వరుణ్.
    " నీకొక సేల్స్ టెక్నిక్ చెప్పనా...అదే నీ సీక్రెట్ లవర్ ప్రియాంక చెప్పిందిలే...కష్టమర్ ఏదైనా కొనాలని  వచ్చినపుడు సేల్స్ మేన్ ఏమని చెబుతాడో తెలుసా... చెక్ ఇస్తారా కేష్ ఇస్తారా అని.అంటే ప్రొడక్ట్ ని అతను ఆల్రెడీ కొన్నట్లు గా ఊహిస్తాడన్నమాట.అంటే కొనకుండా ఉండానికి ఆస్కారం లేదక్కడ.అదో టెక్నిక్ లే.వండర్ఫుల్ గా ఉంది గదూ" వరుణ్ చెప్పాడు.

" ఇది నాకెందుకు చెబుతున్నావు ఇప్పుడు" నేను అడిగాను.

" నీ మీద అదే టెక్నిక్ ప్రయొగించబోతున్నా.నువు ఎలా చావ బోతున్నావు..ఎలా అయితే నీ కిష్టం...నీ గొంతు కోసి చంపాలా లేదా ఊపిరాడకుండా చేసి చంపాలా ...నువు ఆల్రెడీ చనిపోయావు అంతే...చాయిస్ నువు చెప్పు ఎలా చస్తావో" అతని ముఖం లో మళ్ళీ  ఆ దెయ్యపు నవ్వు.

"వరుణ్.."  నేను రోదించసాగాను.చావడానికి భయపడి కాదు.నేను ప్రేమించిన వాడి చేతిలోనే చావవలసి  వస్తోందే అని.

" నీకు ఎవరైనా చెప్పారో లేదో...ఏడ్చినప్పుడే చాలా బాగుంటావు నువు" అలా అంటూ తన బ్యాగ్ వైపు నడిచాడు.

" ఆప్షన్ ఒకటా లేదా రెండా ..చెప్పు " అలా అంటూ పదునైన కత్తి ని తీశాడు బ్యాగ్ లోనుంచి.

నేను దేవుణ్ణి ప్రార్దిస్తూ ఏడవసాగాను.ఈ రూం లో నుంచి బయటపడాలి ఎలాగైనా...తప్పించుకుని ..జీవించాలి..!

" ఏయ్ ..ఎవరు ఆ తలుపు కొట్టేది " అని అంటూ తలుపు దగ్గరకెళ్ళి వాటిని తీశాడు వరుణ్.

" గుణా..నువ్వా ..సరైనా సమయానికి వచ్చావ్...లేకపోతే యామిని బతికుండగా చూసే చాన్స్ మిస్ అయ్యేవాడివి..అఫ్కోర్స్..ఆమె చావడానికి అర్హురాలు ..ఇలాంటి చెడు ప్రవర్తనని మనలాంటి దైవాంశ సంభూతులు సహించరు గదా  " అంటూ మాట్లాడసాగాడు.

విచిత్రం ఏమిటంటే రూం లో మేమిద్దరం తప్ప ఎవరూ లేరు.వరుణ్ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు.పరిస్థితి అర్ధమయింది.పర్సు తీసుకుని మెల్లిగా తలుపు కి దగ్గరగా వచ్చి బతుకు జీవుడా అని దౌడు తీశాను.ఆ విధంగా దేవుడు నా మొరని ఆలకించాడనుకున్నాను. మొత్తానికి ఆటో లో కూలబడి ఏర్ పోర్ట్ కి వచ్చాను.

*   *   *    *
ఆగస్ట్ 20,2013
క్లాస్ లో ప్రొఫెసర్ చెప్పే పాఠం బుర్ర లోకి ఎక్కడం లేదు.క్లాస్ లోనే ఉన్నప్పటికి.ఆ గోవా ట్రిప్ ఇప్పటికీ భయంకరంగా అనిపిస్తోంది.నా బాయ్ ఫ్రెండ్ చేతి లోనే మర్డర్ కావాలసినదాన్ని ..ఏదో దైవం రక్షించి ఉండకబోతే..! నిజానికి వరుణ్ తో బంధం బలపడుతుందనే వెళ్ళా ..కాని అతను ఎలా ప్రవర్తించాడు...చంపేదాకా పోయాడు.ఏది ఏమైనా గాని ఇకమీదట అతడిని అసలు కలవకూడదు.ఓర్పు కి కూడా ఓ హద్దు ఉంటుంది.

క్లాస్ లోనుంచి అంతా బయటకి వస్తున్నారు.క్లాస్ అయిపోవడం తో..!చాలా అలసిపోయాను అన్ని రకాలుగా.ఇదంతా మరిచిపోవాలని జీవితం లో ముందుకెళ్ళాలని నిశ్చయించుకున్నాను.

" హాయ్.." అనే పిలుపు వినబడింది.నేను కూర్చున్న బెంచ్ మీదనుంచే తల తిప్పి చూస్తే ప్రవీణ్.నా క్లాస్ మేట్.

" హాయ్ ప్రవీణ్" నవ్వడానికి ప్రయత్నించాను.

" వారం ట్రిప్ అని చెప్పావు.ఏమిటి ఒక రోజు కే వెనక్కి వచ్చావ్" అడిగాడు.

" అదెందుకులే డ్యూడ్"

" తను నన్ను చక్కగా ట్రీట్ చేయలేదు అని వెయ్యవసారి మాత్రం చెప్పకు"

" ప్లీజ్ ప్రవీణ్..నన్ను ఆటపట్టించకు..రెస్ట్ తీసుకోనీ కొద్దిగా,ఒంటరి గా వదులు నన్ను  "

" నిన్ను నీ మానాన బాధపడేట్లు చెయ్యడం..అది నా వల్ల కాదు.నీ బాధ లో నన్ను పాలుపంచుకోనీ ..కొద్దిగా కూర్చోనీ"

" కూర్చో.కాని ట్రిప్ గురించి ఏమీ అడగకు.ఆ ఒక్కటీ చేయగలవా"

" నిన్ను డిస్టర్బ్ చేయను.హామీ ఇస్తున్నా.నువు మాట్లాడు అనేంత దాకా నేను మాట్లాడను..సరేనా" బెంచ్ పక్కనే కూర్చుంటూ అన్నాడు ప్రవీణ్.అలా పావు గంట గడిచింది.గత ఎనిమిది నెలలు గా నా గాధలన్నీ మాటాడకుండా వింటూ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటున్నాడు.ఎలాంటి సొల్యూషన్ కూడా ఇవ్వడు..అది నాకు నచ్చిన అంశం.

" థాంక్స్" అన్నాను నేను కొద్దిగా ఉన్నతర్వాత. ( సశేషం)     

నేను శివ ని(నవల),Post no:26

నేను శివ ని(నవల),Post no:26

" పారు ...నువు నన్ను చూసి భయపడుతున్నావా,నీ గొంతు లో ఆ వణుకు ఎందుకు "

" అబ్బే..అదేం లేదు"

"నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు...నేను నిన్ను బాధించను..తెలిసిందా..?మహా అయితే ఒకటి రెండు చెంప దెబ్బలు కొడతా..అంతే " అలా అని నవ్వసాగాడు.

" నన్ను ఎందుకు కొడతావు..నేను ఏం చేశానని " అడిగాను నేను.

"నువు నాతో మాటాడే విధానం అదేనా..మనం దైవాంశ కలిగిన వ్యక్తులం..ఆ ఇదే లేదు నీకు..!నేను సూర్య గురించి చెప్పినపుడు స్పందించే పద్ధతి అదేనా..?ఆ కారణాలు చాలవా ..ఇంకా ఏమైనా చెప్పాలా..?ఓ పదైనా చెప్పగలను నీ పొరపాట్ల గురించి"

" ఇప్పుడు చెప్పినవి చాల్లే"

" బాగా చెప్పావు..ఏది నీ ఫేస్ కొద్దిగా తిప్పుకో ఇటు...మొదటి దెబ్బ పడబోతోంది"

" వరుణ్"

"సరదాగా అన్నాను పారు.నువు నన్ను వరుణ్ అని పిలవకూడదు.శివ అని పిలవాలి.నేను శివ ని"

నా కడుపు లో దేవినట్లుగా అవుతోంది.రెస్ట్ రూం కి పోవాలనిపించింది.

" నేను రెస్ట్ రూం కి వెళ్ళాలి" అలా అని పైకి లేచాను.

" ఎందుకు..రెస్ట్ తీసుకోడానికా" ఇకిలించాడు వరుణ్.

" ఇప్పుడే వస్తా" అని బయలుదేరాను.

యూరినల్స్ అవీ అయినాక మొహం కడుక్కున్నాను.జరిగినదంతా తలుచుకుంటే కన్నీళ్ళు వచ్చాయి. లోపల బాధ అంతా అలా రిలీవ్ చేసుకొని మొహం కడుక్కున్నాను.ఈ ట్రిప్ ని ఇంతటితో ముగించి  ఇతణ్ణి ఇక కలవడం చేయకూడదని నిర్ణయించుకున్నాను.ఈ మెంటల్ హెరాస్మెంట్ ని తట్టుకునే ఓర్పు నాకు లేదు.

" ఓహ్ థాంక్స్.ఒక గుడ్ న్యూస్ పార్వతి కి.నాలాగే ఆమె సంతోషిస్తుంది ఇది వింటే.." అలా తనలో తనే మాటాడుకుంటున్నాడు వరుణ్ నేను తిరిగి వచ్చేసరికి.

" ఒక మంచి వార్త నీకు.." చెప్పాడు తను.

" ఏమిటది" కూర్చుని అడిగాను.

" ఇప్పుడే మా తాతయ్య తో మాట్లాడాను ,నీతో ఒక మాట చెప్పమన్నాడు.."

" ఇక్కడెవరూ లేరే"

" నీకు కనబడరు డార్లింగ్.ఆయన చనిపోయాడు" చాలా తాపీగా చెప్పాడు.చచ్చిన వాళ్ళతో మాటాడ్డం కామన్ అన్నట్లుగా చెప్పుకుపోతున్నాడు.నాలో అసహనం రేగుతోంది.

" ఏమిటి నువు అంటున్నది.." అడిగాను.

" ఆ వాయిస్ ని నేను వినగలుగుతాను.నీవు ఇంకా ఆ స్థాయికి చేరలేదు.నీకు ఒక విషయం చెప్పమన్నాడు మా తాతయ్య" చెప్పాడు తను.

" ఏమిటది"

"నీకు ముప్ఫై అయిదేళ్ళు వయసు తర్వాత కూడా  ఏమి కాదు.ఆ జ్యోతిషుడెవడో చెప్పాడన్నావు గా.వాడెవడో గాని పనిష్మెంట్ ఇవ్వాల్సిందే"

" ప్లీజ్ వరుణ్..అలాంటి పని చేయకు"

" నీ జీవితం గురించి అంత అబద్ధం చెప్పినవాణ్ణి ఏమీ చేయవద్దా ...డబ్బులు కోసం ఎలా అంటే అలా చెప్తారా...మిగతా జనాల్నయినా వాడినుంచి కాపాడాలి.అది మంచిది కాదా"

" ఆ జ్యోతిష్యాల్ని నేను నమ్మను..దాన్ని పెద్ద విషయం గా తీసుకోకు"

" జ్యోతిష్యం గుప్త విద్యే అయినా  చాలా విలువైనది.మన రుషులు కనిపెట్టిన విలువైన విజ్ఞానం..దాన్ని పాడు చేస్తున్న వీళ్ళని ఏమీ అనవద్దా..?"

" తొందరగా ఆ రెండు బీర్లు లాగించు..నేను మళ్ళి రెస్ట్ రూం కి వెళ్ళి రావాలి"

" నువు ఎక్కడకి పోవడానికి వీల్లేదు.ఎక్కడున్నావో అక్కడే కూర్చో.నన్ను అగౌరవపర్చడానికి ఎంత ధైర్యం" అతను సహనాన్ని కోల్పోయాడు.

" సర్లే..ఉంటాను" నాలో భయం మొదలయింది.

" నాతో మా తాతయ్య మాటాడిన అంశం నువు సీక్రెట్ గా ఉంచాలి.మనలాంటి దైవాంశ సంభూతులే అలాంటి వాటికి అర్హులు.ఎవరకీ చెప్పకు..లేకపోతే నువు చిక్కుల్లో పడతావు..అర్ధమయిందా"

" ఎవరకీ చెప్పనులే "  
  " అది మంచిది.నీ ఫేస్ లో కొద్దిగా కూడా ఆశ్చర్యం అనేది లేదేమిటి...నువు చనిపోవు ఆ జ్యొతిష్యుడు చెప్పినట్లు అని నేను చెప్పానా...కనీసం హేపీ గా అయినా ఫీలయ్యావా..నా కోసమైనా..!ప్రతిదీ నేనే నేర్పాలా"

" వరుణ్ ..సారీ..శివ"

" అది... ఇప్పుడు దార్లోకి వచ్చావ్...నా అసలు పేరు పెట్టి పిలిచావ్...ఇప్పటికి ఒక మంచి పని చేశావ్...నీకో బహుమతి ఇవ్వాలి..అదేమిటో తెలుసా నీకు"

" ఏమిటి"

" నిన్ను ప్రేమిస్తున్నా పార్వతి .. ఈ ప్రయాణం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది.చాలా కష్టపడ్డావ్ దీని కోసం...మనం రూం కి పోయి శృంగారం లో తేలియాడాలి"

ఏమి చెప్పాలో అర్ధం కాలేదు నాకు.ఈ సైకోపాత్ తో ఆ ఘనకార్యమా ఇప్పుడు..వీలే లేదు.

వరుణ్ తనలో తాను ఏదో గొణొక్కోసాగాడు. అదేమిటో అర్ధం కావడం లేదు.జిబ్బరిష్ గా ఉంది.పోనిలే నాతో అయితే కాదు మాట్లాడేది... సంతోషం.

బీర్లు అయిపోయాయి.బిల్ పే చేశాను.రూం కి వెళ్ళాలంటేనే భయం గా ఉంది.అక్కడ ఏ రాద్ధాంతం జరుగుతుందో.చెప్పిన విషయం మీద అసలు నిలబడట్లేదు ఈ మనిషి.ఇతనితో ఈ పరిస్థితి లో శృంగారం అంటే అది ఒక టార్చరే.మొత్తానికి రూం కి చేరాము.నా ఫోన్ మోగసాగింది.అది చేసింది రాం.హమ్మయ్యా అనుకున్నాను.ఒక తిక్క లేని మనిషి తో మాటాడబోతున్నాను , హాయిగా అనిపించింది.బాత్ రూం లో దూరి తలుపు వేసుకొని మాట్లాడసాగాను.

" హాయ్..ఏమైనా మంచి వార్త ఉందా" అడిగాడు రాం.

" ఈ ట్రిప్ చాలా చండాలం గా అయింది డ్యూడ్ " బయటకి వినబడకుండా చిన్నగా చెప్పాను .

" ఏమి జరిగింది..వరుణ్ తాగాడా ఏమిటి"

" తాగింది లెక్క కాదు.అతని మాటలు,చేష్టలు అన్ని పరమ చికాకు గా ఉన్నాయి"

" కొంత సమయం ఇవ్వు యామిని.నేను చెప్పానుగా కొంత అసాధారణ ప్రవర్తన ఉంటుందని...అతను బాగయ్యేదాకా కొద్దిగా ఓర్పు వహించు"

" అసాధారణం కాదు...సైకోపాత్ లా ఉంది తన యవ్వారం..."

" కొద్దిగా టైం తీసుకుంటుంది.."

" ఈ వ్యవహారాన్ని నేను భరించలేను.తిరుచ్చి కి వచ్చేయాలని అనుకుంటున్నాను. అసలు ఎంత ఇదిగా నా పట్ల ప్రవర్తిస్తున్నాడంటే నమ్మలేవు"

వరుణ్ బాత్ రూం తలుపు మీద చేతి తో దబ దబ కొట్టసాగాడు.

" సరే..ఇక ఉంటా" అలా ఫోన్ లో చెప్పేసి తలుపు తెరిచాను.

" ఎవరి తో మాటాడుతున్నావ్" అనుమానంగా అడిగాడు.

" ప్రియాంక అని మా ఫ్రెండ్" నవ్వాను చెబుతూ.

" ఏదో తప్పు జరుగుతోంది ఇక్కడ" అంటూ దగ్గరగా వచ్చాడు.

" అంటే ఏమిటి నీ అర్ధం " మళ్ళీ నవ్వుతూ అన్నాను.

" గత మూడు గంటల్లో ..ఒక్క చిరునవ్వు చిందించని దానివి ..ఇప్పుడు ఇంత నవ్వు నవ్వావు ఏదో ప్రొఫెషనల్ కెమేరా మెన్ కి పోజ్ ఇస్తున్నట్లు ..చెప్పు ఎవరి తో మాట్లాడావు .."

" ప్రియాంక"

" ఎవరాళ్ళు.." నా చేతి లోనుంచి ఫోన్ లాక్కున్నాడు.ఎవరకి కాల్ చేశానో అని కాల్ లాగ్ లోకి వెళ్ళి చూస్తున్నాడు.నాకు ఊపిరి ఆగినంత పని అయింది.(సశేషం)    

Wednesday 21 March 2018

నేను శివ ని (నవల) Post no:25

నేను శివ ని (నవల) Post no:25

"సర్లే" కళ్ళు తుడుచుకున్నాను.

"నువు మాట్లాడు ఇపుడు..ఒక ముప్ఫై సెకండ్లు..నీ వంతు" వరుణ్ చెప్పాడు.

" నేనేం మాట్లాడాలి"

" పోనీ నాకు కాంప్లిమెంట్ ఇవ్వు"

" నువు ఒక.." నా నోటిలోనుంచి మాట రాబోతుంది ,ఇంతలో తను అందుకున్నాడు.

" కానీ పార్వతి..నోటిలోంచి ధారగా మాట్లాడు"

" ఏమి చెప్పాలో తెలియడం లేదు"

" అంటే నా గురించి పొగడటానికి ఏమీ లేదా..అసలు గుణ నా గురించి ఏమని అంటుంటాడో నీకు తెలుసా "

"ఏమంటాడేం"

"నేను ఓ గొప్ప మనిషినని...కారణ జన్ముడినని..అలా...ఆ లెక్కన నువు కూడా గొప్పదానివేగదా "

" ఆ..అంతే"

" విధి చాలా బలీయమైనది.కదా..!నా కోసం నువు..నీ కోసం నేను ..వెయిట్ చేయడం...ఈ జన్మలో ఇలా కలుసుకోవడం ..చాలా గొప్ప విషయం"

" గ్రేట్"

" ఏమిటి ..మళ్ళీ ఆ పొడి పొడి గా మాట్లాడటం" కోపం ధ్వనించింది అతని లో.

" ఓ విషయం గురుంచి మనం చక్కగా మాట్లాడుకోలేమా.." వరుణ్ అన్నాడు మళ్ళీ.ఇపుడు తను గంజాయి మత్తు లో లేడు,కాని విచిత్రం గా మాటాడుతున్నాడు.అంటే దాని ప్రభావం ఎప్పటికీ మనిషి లో అలా ఉంటుందా ..? ఇక నా గతి ఇంతేనా అనిపించింది.

" ఇవ్వాళ అంతా నేనే మాట్లాడుతున్నా...ఒక చేంజ్ కోసం..నువు మాటాడు నా బదులు " అన్నాడు వరుణ్.

" నా గురించి ఏమనుకుంటున్నావో ..అవన్నీ నువు చెప్పు" అన్నాను.ఆ విధంగా అయినా కొన్ని మంచి మాటలు నా గురించి మాటాడతాడని.

" నువు నా అవసరం.కాని నేను నిన్ను కోరడం లేదు.వినడానికి కష్టం గా ఉందా..? అదే విశ్వ రహస్యం.నా జీవితం లో నువు ఓ భాగం.కొన్నిటిని మనం కలిసి చేయాలి.మనం ఏం చేయాలనేది గుణ ఎప్పటికపుడు చెబుతాడు.ఈ లోపులో అంతా నువు అర్ధం చేసుకోవాలి.ఈ లవ్వు గివ్వు కంటే మించిన బాధ్యతలు నాకున్నాయని "

" నీ అర్ధం... గతం లో నువ్వు  నా గురించి చెప్పినదంతా ఉట్టిదేనా "

"నేను ఎంతో చెప్పాను జీవితం గురించి ..నీకు అర్ధం కావడం లేదు. ఇవన్నీ అర్ధం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నీకు...కొన్ని బీర్లు తాగుతూ మాటాడుకుందాం ..పద"

" ఈ సారి ట్రిప్ లో అలాంటి వేమి వద్దనుకున్నాం గదా...ప్రామిస్ చేశావ్ కూడా ..!నా కోసం కంట్రోల్ చేసుకో ఈ సారికి,నీ బెటర్ ఆఫ్ గా చెబుతున్నా "

"వావ్..ఇన్ని మాటలు ఎక్కడ నేర్చుకున్నావ్...బాగుంది...ఒకే ఒక్క బీర్..అంతే ..!కనీసం ఈ ఒక్కదాన్ని ఆమోదించలేవా ?"

" దయచేసి విను.నువు ఆల్కాహాల్ కి దూరం గా ఉండు.నువు అడిగింది ఏదైనా చేస్తా..నీ మంచికోసం చెప్తున్నా"

" నా మంచి ఏమిటి అనేది గుణ కి మాత్రమే తెలుసు.మీ ఈగోలు అన్నీ నాకు అసహ్యం. మీ అందరి కంటే గుణ కొన్ని వందల రెట్లు  తెలివైన వాడు ఇంకా అనుభవం ఉన్నవాడు.ఆల్కాహాల్ గాని డోప్ గాని ముట్టవద్దని అతను ఎప్పడు చెప్పలేదు.అలాంటిది నువ్వు ఎవరవి చెప్పడానికి..? " కోపంగా చూశాడు వరుణ్.

నాకు ఇప్పుడు ఒకటే తోచింది.టాపిక్ మళ్ళించడం మంచిదని.

" సరే..అసలు ఆ గుణ అనే వ్యక్తి ఎవరు,నాతో చెప్పకూడదా తన గురించి" అడిగాను.

" ఓహ్..గుణ నా...నా గత జన్మని జీవించాడు తను .నాకు గైడెన్స్ ఇచ్చేది తనే..ఈ జన్మ లో నేనేమి చేయాలనేది అతనికి మాత్రమే తెలుసు..ఎందుచేత నా జీవితాన్ని జీవించాడు గనక గతం లో..!తను ఒక మార్మిక వ్యక్తి.క్రమ క్రమంగా అంచెలు ప్రకారం నేనేం చేయాలో చెబుతుంటాడు.ఒకేసారి చెప్పాడే అనుకో ఈ సిస్టం తట్టుకోలేదు ఓవర్ లోడయి పొయి " హిస్టీరిక్ గా నవ్వుతూ చెప్పాడు వరుణ్..!
 ఈ రోజు కూడా అతని కోసమే వేచి చూస్తున్నా...మరి ఈ గోవా లోకి వస్తాడో,రాడో ..అంతా అతని దయ.నాకు కనిపిస్తే మటుకు నీకు తప్పకుండా పరిచయం చేస్తా.." నవ్వి చెప్పాడు వరుణ్.

" అతణ్ణి ఓసారి చూడాలని నాకు చాలా ఇది గా ఉంది" అన్నాను.వరుణ్ చెప్పేది తలతిక్కగా ఉన్నా నేను కావాలనే అన్నాను.

" నా ఈ జీవితం లో శివ గా నా పాత్ర నేను చక్కగా పోషించాను..ముఖ్యంగా నా ప్రధమ కర్తవ్యం నిర్వర్తించాను.ఒక దుష్ట శక్తిని అంతమొందించాను " గర్వంగా చెప్పాడు వరుణ్.

" కంగ్రాట్స్"

" నిజంగా నా"

"ఒక కధ చెపుతా విను.ఒకానొకప్పుడు సూర్య అని చెప్పి ఒకడుండేవాడు.భూత కాలం లో ఎందుకు చెపుతున్నానంటే వాడు ఇప్పుడు లేడు.సర్వ దుష్ట గుణాలూ ఉన్న వ్యక్తి.అమాయకులైన విద్యార్తుల యొక్క పర్సులు,మొబైల్స్ కొల్లగొట్టేవాడు.అంతేగాక మొబైల్స్ లో ఉన్న అమ్మాయిల ఫోటోల్ని పోర్నో సైట్ లకి అమ్మేసేవాడు.డబ్బు సంపాదించే పద్ధతుల్లో నీచమైన వి గదా అవి...అందుకే తనని నేను క్షమించలేకపోయాను" వరుణ్ లో ఉద్రేకం తొంగి చూసింది.

" అప్పుడు ఏమయింది" ఆత్రుత గా అడిగాను.

" నా స్థానం లో నువ్వే ఉంటే ఏమి చేస్తావు"

" నాకు తెలీదు.."

" ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే వాడి జీవితాన్ని ముగించాను.వాడు ఉండాల్సింది నరకం లో..అక్కడికే పోయాడు"

" ఏమిటి..నువు చెప్పేది నిజమేనా " నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను.అసలు ఇలాంటి సీరియస్ సంగతి ని అలవోకగా చెప్పేసేడేంటి.తనకి ఏమి కాకూడదు అనేది నా కోరిక.ఇదే గనక నిజమైతే పోలీస్ కేసు అయ్యి అతని జీవితం నాశనం అవుతుంది.
" వాడు అంత ఈజీ గా దొరికాడా ...కనిపెట్టలేనని అనుకున్నాడు.నాలోని దైవ శక్తే వాడి అనుపానులను గురించి చెప్పింది.సీక్రెట్ ప్లేస్ లో నక్కాడు వెధవ..ఆరు సార్లు కత్తి తో పొడిచా.ఆ విధంగా గుణ నాతో మొదటి పనిని నెరవేర్చాడు.తర్వాత పని ఏమిటో..దాని కోసమే ఎదురు చూస్తున్నాను "

అదే గనక నిజమైతే..దాని పర్యవసానాలు ఏమిటో తను ఆలోచిస్తున్నట్లుగా లేదు.నాకిప్పుడు వెంటనే తిరుచ్చి వెళ్ళిపోవాలని అనిపిస్తోంది.అసలు గోవా కి తన తో వచ్చిఉండకుండా ఉంటే బాగుండేది.

" నా గొప్ప పనిని ఒక బీర్ తో సెలెబ్రేట్ చేసుకుందామా"  అడిగాడు వరుణ్.

" ఇంకో బీచ్ కి పోదాం పద.."

" చాలా చికాకు గా ఉంది.ఓ బీర్ పడాల్సిందే..పారూ..ప్లీజ్ ..ప్లీజ్ "

"బైక్ లో పోతుంటే హాయి గా ఉంటుంది..పద"

"ఎలాంటి వైఫ్ వి నువు.."

" నీ మంచి కోసం ఆలోచించే తరహా "

" అదే నిజమైతే ఒక బీర్ ని తాగనివ్వాలి.నా లో వచ్చే ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలంటే,నిద్ర పోవాలంటే ఓ బీర్ ఉండాలి"

" సరే..ఒకే బీర్ ..!" అన్నాను.నాకిక చాయిస్ లేదు.వేరే ఏమి చేయడానికైనా..!నేను ఇప్పుడు ఉన్నది ఒక సైకోపాత్ కిల్లర్ తో...నా క్షేమం నేను చూసుకోక తప్పదు.

" సరే..బ్రిట్టో స్ కి పోదామా"

" సరే"

పావు గంట లో అక్కడికి చేరుకున్నాము.అక్కడ మేము డిన్నర్ చేశాము గతం లో వచ్చినపుడు ..అప్పటికి ఇప్పటికి ఎంత తేడా జీవితాల్లో.అప్పుడు స్వర్గం అనుకుంటే ఇప్పుడు నరకం అనుకోవాలి.నేను గమ్మున ఉండి తననే మాటాడనిస్తున్నాను.నాకు ఏమి తట్టలేదు అతని తో ఏది..ఎలా మాటాడాలో..!బీర్లు సర్వ్ చేయబడ్డాయి.

" నీకు సరదాగా ఉందా.. నాకైతే చాలా బాగుంది " బీర్ ని సిప్ చేస్తూ అన్నాడు వరుణ్.

" నాకూ బాగుంది" ఏదో అనాలని అన్నాను.నిజానికి ఇంకా షాక్ లోనే ఉన్నాను. (సశేషం)  

Friday 16 March 2018

నేను శివ ని (నవల)Post no:24

నేను శివ ని (నవల)Post no:24

పార్ట్-3, యామిని వైపు నుంచి

చాప్టర్ 7

ఆగస్ట్ 19,2013

మళ్ళీ మేము ఇద్దరం గోవా కి వచ్చాము.మధుర క్షణాలు ప్రోది చేసుకోవడానికి.ఇది నేను వరుణ్ కోసం బాకీ ఉన్నదే.వరుణ్ తో ఇక నా రోజులు ముగిసినట్లే అనుకున్నాను.భగ్న హృదయిని గా మిగలాలని ఉన్నదేమో అనుకున్నాను.వరుణ్ తో నా జీవితం ఎలా ఉండాలి అనేది ఈ సారి అనుభవం తో తేలిపోతుంది.ఇంకా ఎక్కువ పొరబాట్లని భరించే ఇది నాకు లేదు.తిరుచ్చి నుంచి గోవా వచ్చే ఫ్లైట్ లో అతను చాలా ఉద్వేగంగా ఫీలయినట్లు అనిపించింది.తాను శివుని అవతారంగా చెప్పుకుంటూ నన్ను పార్వతి గా పిలుస్తున్నాడు.

నేను దానికి అడ్డు చెప్పడం లేదు.ఆ సలహా రాం ఇచ్చినదే.వరుణ్ గంజాయి కి దూరం అయితే తను పాత వ్యక్తి అయినట్లే.ఒక లక్ష్యంతో,ప్రేమ తో చదువు పట్ల అనురక్తి తో తిరిగి పాత వ్యక్తి కావడానికి నా పాత్ర నేను పోషిస్తున్నాను.మేము హసియేండా అనే హోటల్ లో దిగాము.ఈ సారి పబ్ లకి కాకుండా బీచ్ లకి తిరగాలని చెప్పాను.ఆ విధంగా ప్లాన్ చేశాము.

" ఏ బీచ్ తిరగాలని నీ కోరిక" వరుణ్ నన్ను అడిగాడు,ఒక సిగరెట్ ఇస్తూ.

" కలంగూట్ అయితే ఎలా ఉంటుంది..?"

" తప్పక అక్కడకే పోదాము"

" లెట్స్ గో బేబీ " అన్నాను అతని బుగ్గని ముద్దిడుతూ.

ఆ బీచ్ కేసి సాగిపోతున్నాము.నేను చేతులు పైకెత్తి ఆనందిస్తున్నాను.సరైన సమయం లో,సరైన చోట సరైన వ్యక్తి తో ఉన్నాను.వరుణ్ కూడా అలా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నా.అయితే అతను తన లోకం లో నే విహరిస్తున్నట్లు అనిపించింది.తనలో తనే ఏదో గొణుగుకుంటున్నాడు.అది అర్ధం కావట్లేదు.బీచ్ కి పది నిమిషాల్లో వచ్చాము.

" నువు నన్ను నమ్ముతున్నావా" ఉనట్టుండు నన్ను అడిగాడు.బండి పార్క్ చేస్తూ.

" ఏమిటది"

" నేను అడిగింది..నువ్వు నమ్ముతున్నావా" నా చేతిని పట్టుకుని ,సముద్రం వేపు నడుస్తూ అడిగాడు.

" అంటే నీలో నాకు నమ్మకముందా..లేదా అనా" అడిగాను.

వరుణ్ ఉన్నట్టుండి నవ్వసాగాడు.నాకు చికాకు గా అనిపించింది.

" పార్వతి..నువ్వు దైవ స్వభావి లా కనిపించడం లేదు.ఒక సాధారణ మనిషి లా నే బిహేవ్ చేస్తున్నావ్.నేను గాడ్ ని అని చెప్పినపుడు నువు నమ్మావా లేదా ..? నీ నోరు ఒకటి చెప్పుతోంది నీ ముఖం ఇంకొకటి చెప్పుతోంది."

" వరుణ్ ..నువు దేవుడివే..నమ్ముతున్నా పూర్తిగా ..నువు నన్ను నమ్మాలి "

" నా వెనుక ఇంకోలా చెప్పడం లేదుగా ...నాకు మతి పోయిందని..ఇంకేదో అయిందని"

" ఎంతమాత్రం లేదు స్వీటీ "

" సరే..చిన్న మైండ్ రీడింగ్ గేం ఆడదాం...అలా నా నిజ స్వరూపం నీకు తెలుస్తుంది.ఒకటి నుంచి అయిదు లోపు ఓ సంఖ్య అనుకో లోపల...ఆ సంఖ్య ని నేను  చెపుతా... రెడీనా..? "

" ఇప్పుడంత అవసరం ఉందా "

" ముందు చెపుతావా...లేదా...లేకపోతే ..మామూలుగా తగలవ్..." గట్టిగా అరుస్తూ చెయ్యి ఎత్తాడు.నాకు భయమేసింది.వరుణ్ ఆ విధంగా బిహేవ్ చేయగా నేను ఎప్పుడూ చూడలేదు.
" నేను అనుకున్నట్లు నీ సమాధానం ఉంటే రివార్డ్ ఉంటుంది లేదా దానికి మూల్యం చెల్లించాలి.బఠాణి అంత ఉన్న నీ బ్రెయిన్ కిది ముందే తెలియాలి. నా భార్య తో ఇలా అనకూడదు.నాకు తెలుసు గాని నువు చిన్న పిల్ల లా వ్యవహరిస్తున్నావు " వరుణ్ బాధ నిండిన గొంతు తో అన్నాడు.నేను నా తలని భయం తో ఊపాను.నేను సెన్సిటివ్ అని నాతో అలా బిహేవ్ చేయకూడదని తనకి తెలియదా...!

" ఏమిటి ..ఏమి చేయాలి" నేను అడిగాను.

" ఒకటి నుంచి అయిదు లోపు ఓ అంకె చెప్పు"

"అదీ..అదీ"

" మూడు..అంతేనా"

" ఔను..అదే"

"నేను అనుకున్నదే..! సరే ఇప్పుడు ఒకటి నుంచి పది లోపు ఓ అంకె చెప్పు"

" సరే"

"ఏడు..అంతేనా"

" వావ్..ఈసారీ నువు బాగా ఊహించావ్"

" సరే..ఈసారి ఒకటి నుంచి ఇరవై లోపు ఓ అంకె ని ఊహించు"

"ఆ..ఊహించాను"

"పదమూడు..అంతేనా"

"ఔను" చెప్పాను.మూడు సార్లు తను బాగానే గెస్ చేశాడు.అదేలా..?

"నా పవర్స్ ని ఇపుడు నమ్ముతున్నావా"

" నమ్ముతున్నా" ఇకనైనా ఈ గేం కి తెర పడుతుందా అనుకోసాగాను.

"అంటే ఇంతకు ముందు నమ్మలేదనేగా...అబద్ధం చెబుతున్నావ్.." 
" నేను.." 

"చివరి గా విను.నువు నాతో ఏ చిన్న విషయం లో అయినా అబద్ధమాడావో దానికి బాధ పడతావు ..మామూలు గా కాదు.నువు మంచి అమ్మాయి లా ప్రవర్తించావో ఈ లోకాన్ని ఏలవచ్చు.నీ మట్టి బుర్రలోకి ఇది బాగా ఎక్కించుకో..." అసలు నా పట్ల ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు ..తనకి నేనేం చేశాను..మిగతా అతని ఫ్రెండ్స్ తో ఇలా ఐయితే బిహేవ్ చేయడు.

" ఇంకోటి..అజయ్ ని నేను చాలా మిస్ అవుతున్నాను..అదే బ్రహ్మ ..! నన్ను అర్ధం చేసుకున్నది తను ఒక్కడే.స్నేహానికి నిజమైన అర్ధం ...నిన్ను తనకి పరిచయం చేయాలి...ఫెంటాస్టిక్ గయ్ అనుకో" మళ్ళీ అన్నాడు.

" గొప్పవాడే కావచ్చును" 

" ఒకటి తెలుసా..అతని జీవిత లక్ష్యం ఏమిటో తెలుసా ..ఈ ప్రపంచం లో సాధ్యమైనంత ఎక్కువమంది తో గంజాయి తాగించడం...ఎంత స్వార్దరాహిత్యం.గొప్ప మనిషి..విష్ణు కూడా మంచివాడే..అయితే మానుంచి కొద్దిగా దూరమవుతున్నాడు.గుణ కి ఒక్కసారి తనని పరిచయం చేయాలి ..అప్పుడు గాని మారడు" 

" ఓహ్.." 

" గుణ గురించి నీకు చెప్పానా..?" 

" లేదు.." 

" అసలు ఏమిటి నీ ఇది..పొడి పొడి గా ఒక్కమాట లో జవాబు  చెబుతున్నావ్" స్వరం పెంచి భయపెడుతున్నట్లు అన్నాడు వరుణ్.

" నా లోని ఓర్పు అంతా కరిగిపోసాగింది.నిశ్శబ్దం గా ఏడవసాగాను.నా మొహం ని చేతులతో మూసుకున్నాను.అసలు ఇతనేనా వరుణ్ ..లేదా ఇతనిలో ఏదైనా దెయ్యం పూనిందా..!

" పార్వతి.. చిన్న పిల్ల లా ఏడవకు.నువు బలం గా ఉండాలి.ఈ జన్మ లో నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి.ఇలా అయితే అవన్నీ ఎలా చేస్తావ్..నువు ఎలా వ్యవహరించాలో నేను చెప్పాల్సిన అవసరం ఉంది..చిన్న చిన్న జవాబులు చెప్పడం అంటే నన్ను అవమానించడమే,నా సమ ఉజ్జీ గా నువు ఉండాలి  " నా భుజాల్ని తాటిస్తూ చెప్పాడు. (సశేషం)  

Tuesday 13 March 2018

నేను శివ ని (నవల) Post no:23

నేను శివ ని (నవల) Post no:23

"ఓ.కె రాం...ఇప్పుడు నేను చెప్పబోయేది శ్రద్ధ గా విను.చాలా గొప్ప విషయం ఇది" వరుణ్ గంజాయి పొగ వదులుతూ చెప్పాడు.

" తప్పకుండా.."

" అజయ్...నువ్వేమైనా .." వరుణ్ అడిగాడు

" ఓ.కె.,కాని ఎక్కడనుంచి మొదలెట్టాలి" అజయ్ అడిగాడు

" మొదటనుంచి చెప్పు" వరుణ్ సమాధానం.

"వరుణ్ యొక్క కొత్త మిత్రుడు ...అదే గుణ అని ...ఒక బాబా లాంటి మనిషి అనుకో ..గుర్తుందా

గతం లో చెప్పినట్టున్నా" అజయ్ అడిగాడు నన్ను.

" తెలుసు..ఏమిటి అతని విశేషాలు"

" నేను చెప్పేది నువ్వు నమ్మడం కష్టమే...వరుణ్ చెప్పినపుడు మొదట్లో నాకు మాటరాలేదు.నేను చెప్పేది విని జాగ్రత్త గా జీర్ణించుకో.." అజయ్ అన్నాడు.

" సరే చెప్పు" అన్నాను.

" కొన్ని తేడాలు వదిలిపెడితే..వరుణ్ ఇంకా గుణ ఒక్కరే. గుణ వరుణ్ యొక్క గత జన్మ ని జీవిస్తున్నాడు.అలాగే వరుణ్ గుణ యొక్క రాబోయే జన్మ ని జీవిస్తున్నాడు.ఐనిస్టీన్ గాని ఇది వింటే ఒకసారి కాదు రెండు మూడుసార్లు మరణిస్తాడు." అజయ్ ఇలాంటి పైత్యపు మాటలు చెపుతాడని ఊహించా గాని మరీ ఈ రేంజ్ లో కి వెళ్ళిపోతాడని ఊహించలేదు.

" నమ్మేట్టుగా లేదుగదా "వరుణ్ అడిగాడు.

" అలాగే ఉంది" యామిని గురించి చెప్పడానికి అదును కోసం చూస్తున్నాను.దానికోసమే ఈ చెత్తంతా భరించుతున్నది.

"ఇప్పుడు అసలైన పార్ట్ ఉంది" అజయ్ ఊరించాడు.

" ఏంటది" అడిగాను.

" అది వింటే అదిరిపోతావ్.
" ఇది వింటే మతి పోతుంది" చెప్పాడు అజయ్. నాకు ఆల్రెడీ మతి పోయింది.అది వాడికి తెలీదు.

" ఆ సోది మొత్తం తొందర గా చెప్పవయ్యా" నాకు చికాకు లేచి అన్నాను.

" గుణ ఎవరో కాదు.శివుని అవతారం.అలా అంటే నమ్మగలవా.." అజయ్ గొప్ప గా చెప్పాడు.

" నమ్ముతున్నా" వస్తున్న నవ్వు ని ఆపుకున్నాను.

" గుణ వల్లనే వరుణ్ ఇలా ఉన్నాడు " అజయ్ ఉవాచ.

" ఆ లెక్కన వరుణ్ కూడా శివ యేనా ?" అడిగాను

" బింగో" వరుణ్ సమాధానం

" ఇప్పుడు వరుణ్ వాళ్ళ తాతాయ్య గురుంచి చెప్పుకుందామా...మనం  ముగ్గురం త్రిమూర్తులు లాగా అని చెప్పేవాడాయాన.నువు విష్ణు,నేను బ్రహమ ,మనం గొప్ప పనులు చెయ్యాలి,ఈ ప్రపంచాన్ని ఏలాలి "  అజయ్ అన్నాడు.

" మనం త్రిమూర్తులం" గొప్పగా చెప్పాడు వరుణ్

" వావ్" అన్నాను.నేనే గనక అజయ్ స్థానం లో ఉంటే వరుణ్ ని  బాగుచేయడానికి ప్రయత్నించేవాణ్ణి.కొద్దిగా మతి ఉండే మాటలు చెప్పేవాణ్ణి.

" ఆ విష్ణు..ఇప్పుడు ఎలా ఉంది...నీకు నీవే స్పెషల్ గా అనిపించడం లే...బాధ్యత గా అనిపించడం లే" వరుణ్ నన్ను అడిగాడు.

" అవును డ్యూడ్"

" నన్ను డ్యూడ్ అనకు...శివ అని పిలువు ..నేను శివ ని" వరుణ్ ఇకిలిస్తూ చెప్పాడు.
" నువు శివ అయితే మరి పార్వతి ఎవరు..." అడిగాను వరుణ్ ని. 
" నేను అనుకోవడం ..యామిని" కాసేపు యోచించి చెప్పాడు వరుణ్.

"మరి నీ అర్ధాంగి తో కొంత సమయం గడిపేది లేదా...ఈ దైవిక విషయం ఆమె కి చెప్పవా మరి" అడిగాను.

" ఆ పని చేయాలి" 

" మీరిద్దరూ ఒక లాంగ్ ట్రిప్ వేయండి.అప్పటి గోవా ట్రిప్ లాగే.ఏమంటావు" 

" మా బాగా చెప్పావు.నా పార్వతి ని కలిసి ఆ ఏర్పాట్లు చేయాలి.థాక్స్ విష్ణు" అన్నాడు వరుణ్.

" గ్రేట్ శివ" షేక్ హేండ్ ఇచ్చి చెప్పాను.

" దానికి ముందు ఒకటి చేయాలి నేను" 

" ఏవిటది" అజయ్ అడిగాడు.

" సమయం వచ్చినపుడు నీకు తెలుస్తుంది.చాల ప్రాధాన్యత గల అంశం అది" 

" కూల్ బ్రో" అజయ్ ఓదార్చాడు.

" సరే..దైవాంశ సంభూతులారా ..మరి వస్తా" అలా చెప్పి వరుణ్ బయటికి వెళ్ళిపోయాడు.

" కాని ఆ సత్యం ఆనందకరమైన అంశం గదా" అజయ్ నాతో అన్నాడు,వరుణ్ వెళ్ళిన తరువాత.

"ఔనవును..ఇప్పుడు మాటాడుకుందామా" అడిగాను.

" స్యూర్ ..అలాగే" 

" అయ్యా..లార్డ్ బ్రహ్మ ..అసలు నీ ఎజెండా ఏమిటి" 

" అంటే అది గుణ వరుణ్ కిచ్చే ఆదేశాల మీద ఆధారపడి ఉంది" 

" లోకాన్నంతటిని ఏలాలనా నీ ఇది" 

" ఎవరు కోరుకోరు దాన్ని" 

" నేను ఒకటి చెప్పనా బ్రహ్మ.."  

" దాందేముంది" 

" ఆ వరుణ్ తలకాయ మొత్తాన్ని పాడుచేస్తున్నావు నువ్వు...ఒకటి గంజాయి,రెండు నువ్వు ...మీరిద్దరూ అతణ్ణి నాశనం చేశారు..అర్ధమవుతోందా" 

" బ్రో..అతను బాగానే ఉన్నాడు.నువు మరీ ఎక్కువ చేయకు" 

" ఏయ్ నేను చెప్పేది బాగా విను..ఇకమీదట నువ్వు వరుణ్ కి గంజాయి ని తాగాటానికి ఇచ్చావో..నీ బుర్ర రామ కీర్తన పాడిస్తా.ప్రపంచాన్ని పాలించడం కాదు...అసలు నువు ఈ లోకం లో లేకుండా పోతావు.నేను చెప్పిన ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేశావో నీ జీవితాన్ని కౄరంగా నలుపుతా ..అది గుర్తు పెట్టుకో, అర్ధమయిందా బ్రహ్మ " అజయ్ కాలర్ పట్టుకొని వార్నింగ్ ఇచ్చాను.

" బ్రో..నన్ను బెదిరిస్తున్నావు" 

" ఈ విషయాన్ని గాని వరుణ్ కి చెప్పావో పదింతలు ఎక్కువ పనిష్మెంట్ ఇస్తా .." 

" ఫైన్..అతనితో తాగనులే" 

" అది బాగుంది.అతనితో ఆడుకోకు..ఓ.కె?" 

" సరే" 

" సరే..పో" అజయ్ ని విడిచిపెట్టాను.

మొత్తానికి వరుణ్ ని కాపాడగలిగాను.ఈ మేరకైనా.రూం కి వెళ్ళి మంచి సంగీతం వినాలి.నేను చేసిన తప్పును సరిదిద్దుకున్నాను.చాలు అనుకున్నాను.

యామిని తో ఈ ట్రిప్ తర్వాత వరుణ్ బాగుపడవచ్చును.ఏమో ..ఏం జరుగుతుందో..! (సశేషం)  

Saturday 10 March 2018

నేను శివ ని (నవల) Post no: 22

నేను శివ ని (నవల) Post no: 22

" నేను చేసింది పొరబాటే,క్షమించు"

"సరే..మంచి ఉద్దేశ్యం తోనే నాతో పోట్లాడమని తనతో చెప్పావే అనుకో..వరుణ్ కి ఆ మత్తు ఎందుకు నేర్పినట్లు..చదువు లో నీ కంటే ముందు ఉన్నందు కా "

"అతనికి ఉన్న నిజమైన మిత్రుణ్ణి నేను..అలా అంటే నువ్వు నమ్మకపోవచ్చు,ఏదో ఆనందిస్తాడని దాన్ని పరిచయం చేశా అంతే "

"నేను లేనట్లుగా నే తను బిహేవ్ చేస్తున్నాడు.పది సార్లు కాల్ చేస్తే అప్పుడు ఎత్తుతున్నాడు ..అదీ నా మీద అరవడానికే...అతనిప్పుడు ఎలా ఉన్నాడో..అసలతని ఫ్యూచర్ ఏమవుతుందో ఊహకందని విషయం"

"నాదగ్గర ఓ ప్లాన్ ఉంది..తను బాగుపడటానికి"

"చెప్పు"

" అజయ్..తో కలిసి ఏమాత్రం తెరిపి లేకుండా రోజంతా మత్తు లోనే ఉంటున్నాడు.చాలా వింత గా ప్రవర్తిస్తున్నాడు.ఏదో పరలోక విషయాల గురించి,దెయ్యాల గురించి,రాయబొయే పుస్తకం గురించి ఏవో మాటాడుతున్నాడు.నేను అనుకోవడం అది గంజాయి ప్రభావం.ఒక వారం రోజులు ఆ మత్తుకి దూరం ఉంచితే తను మళ్ళీ బాగుపడతాడు.అది నీ చేతుల్లోనే ఉంది"

" దానికి నేనేం చేయాలి"

" అతని తో కలిసి ఏదైనా దూరం ట్రిప్ వెళ్ళు.అలా అజయ్ కి దూరం అయితే ..క్రమేణా అతని లో మార్పు వస్తుంది."

" నా కాల్ నే ఎత్తడం లేదు..అలాంటిది ట్రిప్ వెళ్ళడమా...?"

" ఏదో విధంగా నేను వర్కవుట్ అయ్యేలా చేస్తా...నీ ప్రయత్నం లో నువ్వు ఉండు.అయితే ఒకటి గుర్తుంచుకో..నోటికి తోచిన ఏదో మాటలు మాటాడుతుంటాడు.నువ్వు విభేదించకు.ఓ వారం రోజుల్లో బాగుపడతాడు.గేరంటీ."

" నువు చెప్పినది జరుగుతుందా"

" నూరు శాతం"

" ఇప్పుడు రిలీఫ్ గా ఉంది.మాకు హెల్ప్ చేస్తున్నందుకు థాంక్స్"

" నీ సహకారానికి సంతోషం.మరి ట్రిప్ ఓకే గా"

" తప్పక సాకారమవుతుంది"

ఆగస్ట్ 18,2013

ఒక వారం పాటు అజయ్ రూం కి వెళ్ళడం బంద్ చేశాను.నాకు ఉన్న ఇతర ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతున్నాను.వాళ్ళు చదువు పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు.ఈ లైఫ్ బాగుంది.గంజాయి ని ముట్టదలచలేదు.ఎప్పుడైన ఆల్కాహాల్ ..అంతే.మానాన్న కి కూడా సంతోషం కలిగే సంగతే ఇది.ప్రకృతి నాకు సహకరిస్తోది.

ఇప్పుడు వరుణ్ ఎక్కువగా అజయ్ తోనే గడుపుతున్నాడు.అతని రూం లోకి తన సామాన్లు షిఫ్ట్ చేసుకున్నాడు.అతను నాతో ఒక విషయం షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.బహుశా అది ఆ బుక్ గురించి కాదనుకుంటా.సరే ..అతను చెప్పేది విని అతడిని ఒక దరికి చేర్చాలనేది నా కోరిక.నా భయం అంతా అజయ్ తోనే..అతను వరుణ్ కి తప్పు గైడెన్స్ ఇస్తున్నాడు.యామిని తో అతను ట్రిప్ చేసేలా నా ప్రయత్నం నేను చేయాలి.అతను బాగుపడాలి.ఓ డైరీ ..అలా జరిగినపుడు..మొట్ట మొదట తెలుసుకునేది నువ్వే గా.సరే అంతదాకా సెలవు.

అజయ్ హాస్టల్ వైపు వెడుతున్నా.చాతి లో అలజడి గా ఉంది.ఇంకా ఏమేం వింత మాటలు వినాలో ఆ రూం లో.వరుణ్ కోసం కొంత త్యాగం చేద్దాం..!

" హాయ్ గైస్" అని పలకరించాను తలుపు తీయగానే.

"హాయ్ రాం..ఇన్నాళ్ళు పజిల్ లా మిస్ అయిన వ్యక్తి " అంటూ వరుణ్ పలకరించాడు.
" చూడబోతే రాం కి మనతో తిరగడం ఇష్టం లేదల్లే ఉంది.కొత్త ఫ్రెండ్స్ దొరికినట్లున్నారు" అజయ్ అన్నాడు,ఒక చేతిలో జాయింట్ పట్టుకుని.

"అదేం లేదు బ్రో.మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా." కూర్చుంటూ చెప్పాను.ఈ పిచ్చనాయళ్ళతో కొద్దిగా జాగ్రత్త గా ఉండటం ఎందుకైనా  మంచిదని.

" నీ నోరు చెప్పేది ఒకటి..మొహం చెప్పేది మరొకటి.మాతో ఉండే కంటే ఆ రూం లో ఉండి చదువుకోవడమే మంచిదని అనుకుంటున్నావు..కాదా?"

" బ్రో.." ఏదో అనబోయి ఆగిపోయాను.

" మేము కానివాళ్ళలాగా కనబడుతుంటే..మొక్కుబడిగా రావడం ఎందుకు...ఇక్కడకి రాకు.మంచి బాలుడిలా గా చదువు మీద దృష్టి పెట్టుకో.." నిష్టురంగా అన్నాడు అజయ్.ఏమీ జవాబివ్వకుండా ఉండిపోయాను.ఈ మాత్రం సంబంధాన్ని చెడగొట్టుకోకూడదని.

"ఏయ్ సరదాకి బ్రో...మాతో ఉండటం నీకు ఇష్టమనే సంగతి నాకు తెలియదా ఏంటి " మళ్ళీ తనే అన్నాడు.

" పాపం రాం మీద ఏంటి నీ జోకులు...అతను మళ్ళీ మనలో కలవబోతున్నాడు.. అవునా కాదా..బలే బ్రో...ఎందుకలా అతణ్ణి బాధిస్తావు వరుణ్ నవ్వుతూ అన్నాడు.

" నా లోపల గంజాయి ఉంది గా బ్రో"  అలా అంటూ దమ్ము నాకివ్వబోయాడు అజయ్.

" సరే..వస్తా నాకు పని ఉంది" అజయ్ చేతిని తోసేసి అన్నాను,

" తాగు బ్రో..నీకొక ముఖ్య మైన సంగతి చెప్తా." వరుణ్ చెప్పాడు.

" నన్ను వామప్ చేశావ్ బ్రో" అన్నాను.

" గంజాయి కొద్దిగా పీల్చుతాడులే తర్వాత.కొద్దిగా సేద తీరనీ.షార్ట్ బ్రేక్ తీసుకోనీ " అన్నాడు అజయ్.

" నువ్వు వినలేదా..నేను మానేద్దామని అనుకుంటున్నా.చెవులు పని చేయడం లేదా" నేను సహనం కోల్పోయాను.మొదటిసారిగా అజయ్ మీద చికాకు లేచింది.

" కూల్..కూల్.మనం మనుషులం కాదు.కాబట్టి మనుషుల్లా బిహేవ్ చేయకూడదు ..అర్ధమయిందా" అన్నాడు వరుణ్.అసలు ఏం మాటాడుతున్నాడు..వీడికి గాని మైండ్ దొబ్బిందా అనిపించింది.

" మన మధ్యన ఉన్న అపార్ధాలు మనమే తొలగించుకోవాలి,ఏకం కావాలి మళ్ళీ" తనే అన్నాడు.

" తప్పకుండా బ్రో..ఏమంటావు రాం..అంతేగదా " అడిగాడు అజయ్. (సశేషం) 

Wednesday 7 March 2018

నేను శివ ని (నవల) Post no:21

నేను శివ ని (నవల) Post no:21

" చూడబోతే రాం కి ఇదంతా నచ్చుతున్నట్లు లేదు" వరుణ్ అన్నాడు.

"నాకు సంతోషమే డ్యూడ్" అన్నాను.

" హ్మ్..సంతోషం..అంతకన్నా గొప్ప పదమే దొరకలేదా"

" ఇంకా చెప్పాలంటే మహదానందంగా..మబ్బుల్లో తేలుతున్నట్లుగా ఉంది" అన్నాను.

" గంజాయి సంపాయించడం కష్టం గా మారింది బ్రో...ఒక షాకింగ్ న్యూస్ విన్నాను గత రాత్రి"  అజయ్ చెప్పాడు వరుణ్ తో.

" విన్నదేమిటో చెప్పు ముందు...అది షాకింగ్ న్యూసో కాదో నేను తర్వాత చెపుతా" అలా అని నేను అండం తో వరుణ్ నాకేసి ఇష్టం లేనట్లుగా చూపు చూశాడు.

"సూర్య అని చెప్పి లోకల్ రౌడి ఒకడున్నాడు.రాత్రి పూట మన స్టూడెంట్స్ గంజాయి కోసం వెళ్ళే స్పాట్ లో నక్కి ,మన వాళ్ళ పర్స్ లు,మొబైల్స్ అన్నిటిని దొంగిలించాడు.అంతేకాదు మొబైల్స్ లో ఉన్న అమ్మాయిల ఫోటొస్ ని పోర్న్ సైట్ లకి అమ్ముకున్నాడు.మన బోటి వాళ్ళందరి మధ్య ఇదే పెద్ద టాపిక్ అయిపోయింది" చెప్పాడు అజయ్.

" ఓర్నీ.." అన్నాడు వరుణ్.

" ఎస్ బ్రో...మనం కూడా గంజాయి తెచ్చుకోడానికి రాత్రి పూట పోకుండా ఉండడం మంచిది.దానికంటే ఇప్పుడు..పగలు పోదాం పదా"అజయ్ చెప్పాడు.

"అమ్మాయిల ఫోటోల్ని అంత నీచంగా వాడాడు ..అంటే తప్పకుండా వాడికి తగిన శిక్ష పడాల్సిందే" వరుణ్ ఆవేశం గా అన్నాడు.

"వాడు దుర్మార్గుడు..అలాంటి వాళ్ళకి త్వరగా కాలం రాదు" అజయ్ అభిప్రాయం అది.

" తగిన సమయం వచ్చినపుడు అదే జరుగుతుంది." వరుణ్ ఎగబీలుస్తూ అన్నాడు.ఈ విషయాల్లో నాకు ఆసక్తి ఏమాత్రం లేదు.ఇలాంటి వారి తో కంటే కాస్త మామూలు లోకం లో ఉన్న వారిని కలిస్తే బెటర్ అనిపించింది.

" సూర్య గాడు..మనం మామూలు గా వెళ్ళే ఆ స్పాట్ లో కలుస్తాడా " వరుణ్ ప్రశ్నించాడు.

" నేను విన్నదాని ప్రకారం అయితే  ఆ ప్రదేశం లోనే దాక్కుని ఉంటాడు... అమాయిక విధ్యార్థుల్ని దోచుకోడానికి" అజయ్ చెప్పాడు.

" ఓకె..పాయింట్ నోట్ చేసుకున్నా..థాంక్స్" వరుణ్ చెప్పాడు.

" సరే..రాం మేము గంజాయి తెచ్చుకోడానికి బయటకి పోతున్నాము.ఇక్కడ ఉంటావా ,మాతో వస్తున్నావా" అజయ్ అడిగాడు.

" లేదులే ..నేను రూం కి పోతున్నా" అన్నాను.

" సరే..పద వరుణ్ మనం పోదాం" అలా అని వాళ్ళు బయట పడ్డారు.

నేను నా రూం కి చేరుకున్నాను.దీనికి విరుగుడు ఏమిటి ..వరుణ్ ని ఎలా ఈ అలవాటు నుంచి మానిపించాలి..అజయ్ తన జాగ్రత్త తాను తీసుకుంటాడు.వీళ్ళిద్దరూ కలవకుండా ప్లాన్ చేయాలి.ఎలా..ఒక గొప్ప ఆలోచన తట్టింది.ఒరే రాం ..నువ్వు సూపర్ రా అనుకున్నా.

ఫోన్ లో యామిని నెంబర్ కోసం సెర్చ్ చేయసాగాను.వరుణ్ లేనప్పుడు అతని గూర్చి వాకబు చేయడానికి ఆమె ఓ సారి నాకు కాల్ చేసింది.అప్పుడు ఆ నెంబర్ ని సేవ్ చేశాను.అది మంచిదయింది.డయల్ చేశాను.

" రాం.." అంది యామిని అవతల నుంచి.

" ఎలా ఉన్నావు" అడిగాను.

" నీకు తెలియదా"

" తెలుసు"

" ఏం చేయాలని ఇప్పుడు..నాకు బాధ గా ఉంది"

" నా దగ్గర ఒక ఐడియా ఉంది.ఒక అరగంట నీతో మాటాడాలి"

" నీతో మాటాడాలని లేదు.నీవల్లనే గా వరుణ్ ఆ గంజాయి కి మరిగింది.

 " ఒప్పుకుంటున్నా. దానికి నాకూ బాధ గా నే ఉంది.వరుణ్ ఇంత ఇదిగా బానిస అవుతాడని అనుకోలా"

" చేయాల్సింది చేసి ..అపాలజీ కోరేవాళ్ళంటే నాకు గిట్టదు"

" హేయ్..దానికోసం కాదు..నిన్ను పిలుస్తుంటా...వరుణ్ ని ఆ దారి నుంచి మళ్ళించడానికి నేనొక పని చేస్తున్నా..దానికి కొద్దిగా నీ సహాయం కావాలి"   
" అసలేమిటి నీ ఐడియా" 

"ఒకసారి కలిసి మాట్లాడితే వివరంగా ఉంటుంది గా"

"నాకు ప్రామిస్ చెయ్..ఇకమీదట తను డ్రగ్స్ ముట్టడని" 

"అలాగే..చేస్తున్నా..!ఓ సారి కేంపస్ కేంటిన్ దగ్గర కి రారాదు" 

" ఒకే..నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నది..అదే గుర్తు పట్టడానికి" 

" బ్లాక్ టీ షర్ట్ ఇంకా జీన్స్" 

" ఒకే..బై..వస్తున్నా.." 

నేను పది నిమిషాల్లో యామిని ని కలవడానికి కేంటిన్ వైపు పరిగెట్టాను.కాఫీ చెప్పి,రాగానే  తాగుతూ ఉన్నా. 

" రాం నువ్వేనా" 

అడిగింది ఆమె.మొహం లో కంగారు ఉంది. 

" హాయ్.. యామిని..నేనే రాం ని" అన్నాను చేయి చాపుతూ.

"వాటికి ఇది టైం కాదు.ముందు చెప్పు నీ మనసు లో ఏముందో" నా ముందు కూర్చుంటూ అన్నది.

"దానికి ముందు ఒకటి చెప్పు...వరుణ్ కి నీకు మధ్య ఏం జరిగింది అసలు" 

" నేను అవన్నీ మర్చిపోవాలని అనుకుంటున్నా..ఎందుకు తవ్వుతావు.అవన్నీ బాధ తో కూడినవే"  

" అసలు సిట్యుయేషన్ అంచనా వేయడానికి...నా కోసం కాదు..అందరి మంచి కోసమే అడిగేది" 

" నీకు దానిలో భాగస్వామ్యం లేదు.. వర్రీ ఎందుకు నీకు" 

" వరుణ్ మళ్ళీ పాత మనిషి కావాలి.మంచి గా చదువుకోవాలి,నీతో మంచి గా ఉండాలి.అదే నా కోరిక..నీవు నమ్మకపోవచ్చు..నువ్వు ఎంత క్షేమం కోరుకుంటున్నావో వరుణ్ విషయం లో నేనూ అంతే.." 

" ఏదైనా కానీ" 

" నేనిప్పుడు ఇక్కడ ఉన్నాను,కావాలంటే అతనితో డ్రగ్స్ సేవిస్తూ అక్కడే ఉండేవాడినిగా ...నన్ను అసహ్యించుకుంటావు..తెలుసు నాకు...కాని జరిగింది చెప్పు ప్లీజ్" 

" సరే..నిన్ను నమ్ముతున్నా.మేము గోవా వెళ్ళివచ్చాక ఏం జరిగిందో చెబుతాను" 

" కానివ్వు" 

" ఏమో తెలీదు.నాలో ప్రతి దానికి తప్పులు వెదకడం మొదలెట్టాడు.నేను షాపింగ్ కి తీసుకెళితే ..తనకి ఏది కొనలేదని నేను సెల్ఫిష్ అని అనేవాడు.పోనీ కొనుక్కోమంటే అడిగిన తర్వాతనా అని అనేవాడు.అలా ఒకదాని మీద ఒకటి జరిగాయి." ఆమె విషాదం గా చెప్పింది యామిని.

" ఐయాం సారీ" 

" తాను డ్రగ్స్ తాగిన అనుభూతులు అన్నీ చెప్పి నన్ను సైతం ట్రై చేయమని అడిగాడు.నేను నిరాకరిస్తే మరీ పిల్లకాయ లా వ్యవహరిస్తున్నానని అనేవాడు.." 

" నువ్వు నన్ను క్షమించాలి.మీ బంధం గట్టిపడటానికి నన్ను కొన్ని టిప్స్ అడిగాడు తను.చిన్న చిన్న విషయాల్లో కోపపడినట్లు నటించమని నేనే చెప్పాను " నా తప్పు నేను ఒప్పుకున్నాను.

" అయితే అసలు ముసుగులోని దయ్యానివి నీవేనన్నమాట,ఎందుకలా చెప్పావ్ "

"  నువ్వు ప్రేమించినట్లుగా చెప్పలేదని ..నీ మనసు గెలుచుకోవాలని అతని ఇది" 

" దానికి దారి ఇదేనా..? మా గురించి ఏమి తెలుసునని ఆ సలహా ఇచ్చావు తనకి...ప్రేమ అనే పదం వాడనంత మాత్రాన నాలో ఏముందో నీకేమి తెలుసు..కమిట్ కావడానికి భయపడింది నిజం..దాని అర్ధం నేను తన పట్ల కేర్ తీసుకోలేదని కాదు"  (సశేషం)