Showing posts with label "చత్తీస్ ఘడ్ స్కూటర్ యాత్ర" పుస్తకం గూర్చి. Show all posts
Showing posts with label "చత్తీస్ ఘడ్ స్కూటర్ యాత్ర" పుస్తకం గూర్చి. Show all posts

Saturday, 30 May 2015

"చత్తీస్ ఘడ్ స్కూటర్ యాత్ర" పుస్తకం గూర్చి రెండు మాటలు


పరవస్తు లోకేశ్వర్ గారి ఈ యాత్రానుభవాల మాలికని మొన్న ఈ మధ్య ఎమెస్కో  లో కొని చదివాను.ఏది ఎప్పుడు మన చేతికి రావాలో అదీ ఓ ప్రకృతి వ్యూహం లో భాగమే.గతం లో సిల్క్ రూట్ ,సలాం హైద్రాబాద్ లు చదివి వాటి మీద నాకు తోచిన అభిప్రాయాలు రాశాను గదా.ఈ సారికి ఇది.మొత్తం పంతొమ్మిది వందల నలభై మూడు కిలో మీటర్ల ప్రయాణం.పది రోజుల్లో స్కూటర్ మీద చుట్టివచ్చారు.అదీ 2009 లో.భద్రాచలం అనే ముఖద్వారం నుంచి సాగి కుంట,సుక్మా,దంతెవాడ,బస్తర్,జగదల్ పూర్,కొండగావ్,నారాయణ్ పూర్, కాంఖేడ్,రాయ్ పూర్,ధల్లీ రాజ్పుర  దాకా సాగి పోయి మళ్ళీ వచ్చేప్పుడు భూపాలపట్నం,సిరివొంచ,గడిచిరోలి మీదుగా కరీం నగర్ జిల్లా లోకి ప్రవేశించి అటునుంచి హైద్రబాద్ కి చేరుకున్నారు.అదీ విషయం.ఈ మధ్య కాలం లో ఎదురైన అనుభవాలను పూసగుచ్చినట్లుగా ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నంత చక్కగా రాశారు.అందులో మళ్ళీ ఉర్దూ ,తెలుగు గీతాలు ,వేదాంత ధోరణులు,లౌక్య విధానం లో నడిచే లోకం పోకడలు,అచటి ఆదివాసీ ల జీవిత చిత్రణ,స్థానిక పరిస్థితులు ,శాంతి భద్రతలు విలసిల్లుతున్న తీరు,అక్కడి ప్రవాసుల ధోరణులు,నాశనం కాని అటవీ సంపద,శంకర్ గుహ నియోగి వంటి త్యాగుల చరిత్ర ,ఆయన అనుయాయుల నుంచి తెలుసుకోవడం,కుటుంబ్సర్ ప్రాచీన గుహల వర్ణనలు ఇంకా ఎన్నో ఎన్నో సంగతులు చూసి చెప్పడం ..ఆ చెప్పినది ఎంతో హాయిగా మనం కూడ ఆస్వాదించే తీరు గా ఉండటం ఈ పుస్తకం లోని ప్రత్యేకత.


ఈ పుస్తకాన్ని ఆంగ్లం లో గనక తర్జూమా చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది.దీనిలోని విషయ సంపద,అనుభవాల సారం,సంభావ్యత ప్రతి ఒక్కరి ని ఆకర్షిస్తాయి.ఈ మధ్య కాలం లో కొన్ని ట్రావెలోగ్ లు ఇతర రాష్ట్రాల వారు ఇంగ్లీష్ లో రాసినవి చదివాను.బాగున్నాయి.కాదనను.కాని అందరు ఒకేలాంటి ప్రసిద్ది చెందిన నగరాల్నే సందర్శించడం,ఇంచు మించు చెప్పినదే చెప్పడం ఒక మూస గా అనిపించాయి.నిజానికి మన తెలుగు వాళ్ళకి మన లొని గొప్ప రచనల్ని ఇంగ్లీష్ లోకి తీసుకు వెళ్ళి ప్రమోట్ చేసుకునే విధానం ఎందుకనో ఇష్టం ఉండదనుకుంటాను.లేదా ఒక సంధిగ్ధతా..ఏమో..!  అసలు ఇండియా లో ఉన్నంత జీవన వైవిధ్యం ఎక్కడుందని..ఓపిక ఉండి చిన్న పల్లెల్ని,చిన్న పట్టణాల్ని అంతగా పేరు బయటకి రాని ఊళ్ళని ప్రతి రాష్ట్రం లోను ఒక్కసారి చుట్టి రండి.దేశం పట్ల మన ప్రేమ రెట్టింపు అవుతుంది.ఇది నేను ఎక్కడో చదివి వల్లె వేయడం లేదు.నా అనుభవం లోనుంచి చెప్తున్నా.మీరు అనవచ్చు..అవన్నీ రాయవచ్చు గా అని.అనుకుంటాం గాని ఏ మనిషికైనా భగవంతుడు కొన్నిట్లని చేయడానికేరా అన్నట్టు పుట్టిస్తాడు.దాంట్లోనే మనకి బలం ఉంటుంది.మిగతావి ఏదో  అలా చేసేస్తుంటాం.లోకేశ్వర్ గారి ప్రయాణాలు చదివినాక నేను ఇంతకంటే రాసినా ఏం ఉంటుంది అనిపించింది. అందుకే ఆ ప్రయత్నం చేట్లేదు. 

 అసలు విద్య లో కూడా ప్రయాణాలు ఓ భాగంగా కావాలి.ఎంతసేపు పుస్తకాలు అని కాకుండా ..కళ్ళతో చూసి ..కష్ట నష్టాలు భరించి..ఈ లోకం లో ఎన్నెన్ని ఒంపులు ,కుట్రలు,దారులు ఉన్నాయి..ఎలా మెలగాలి,ఎలా ఉండాలి ఇలాంటివి కళాశాల ప్రాయం నుంచి తెలియాలంటే దూర ప్రయాణాలు చాలా అవసరం.ఒంటరి గా రక్షణ లేకుండా ప్రయాణాలు చేస్తూంటే  వచ్చే అనుభవాలు చాలా అమూల్యమైనవి.మానవుని లోని ఎన్నో కోణాలు ఆవిష్కరిస్తుందది.అవి నోటి తో చెప్పేవి కావు.తెలుసుకునేవే తప్ప.