డా.కేశవరెడ్డి యొక్క "చివరి గుడిసె" నవల ని నిన్న నే ముగించాను.ఒక విలక్షణమైన పద్ధతి చెప్పే తీరు లో.కొన్ని సార్లు మాండలికాలు చికాకు పుట్టిస్తాయి.కాని దాని లో జీవం ఉండి ఇలా చెప్పితే మటుకే బావుంటుంది.. అన్న ఇది ని కలిగించినపుడు అది పండుతుంది. చదువుతున్నంత సేపు ఒక మాండలికం లోకి పోయినట్లుగా గాక ఆ ఊరి లోకి జోరబడి ఆ సన్నివేశాల్ని చూసిన అనుభూతి కలుగుతుంది.నిజమైన గొప్పదనం ఒక రచన కి ఎప్పుడు కలుగుతుంది అంటే ఎవరో దాన్ని రాసినట్లు గా గాకుండా దానంతట అది జరుగుతున్నట్లు గా అనిపించాలి. మనుషుల కదలికలు మాత్రమే గాక ప్రకృతి యొక్క సూక్ష్మ కదలికలు చక్క గా పరిశీలించి రాయడం ఒక అందాన్ని చేకూర్చింది.ఉదాహరణకి మనుషులు ..మన్నె గాడు,బైరాగి,కుర్రాడు ముగ్గురు మాట్లాడేప్పుడు వాళ్ళని గమనిస్తూ కుక్క చేసే భావ ప్రకటనలు,కళ్ళ తో,తోక తో ఇలా ఎన్నో రకాలు గా చేసే దాని వ్యక్తీకరణ.. !
ఎలుకలు పట్టే దాని లో గల మెళుకువలు..వాటికి ఉపయోగించే పనిముట్లు..యానాది వారి జీవనం లో ని ఒడి దుడుకులు..కృత్రిమత్వం లేకుండా అదే సమయం లో బోరు అనిపించకుండా చెప్పడం బాగున్నది.చేసే పనినుంచే దానికి సంబందించిన వ్యక్తీకరణ లు బయటకి వస్తాయి.శ్రమ సంస్కృతి ని గౌరవించక పోవడమూ, కించపరచడమూ,అమానవీయం గా చూసి అవమానించడమూ ఇవి భారతీయ ధర్మం లో అంతర్లీనం గా అల్లుకు పోయాయి.కొన్ని వందల ఏళ్ళ నుంచి దేశం లోకి వచ్చిన ప్రతి విదేశీ జాతి కి బానిసలు గా ఎందుకున్నాము..మూల కారణం ఇదే.ఎవరూ ఎవరికీ సహకరించని స్థితి.
జరిగిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొనుటా ఉండదు.ఈ నవల లోని కధ స్వాతంత్ర్యం రాక ముందు జరుగుతూంటుంది.ఏ మాటకి ఆ మాట బ్రిటీష్ అధికారు లే మన లోని అణగారిన వర్గాలకి గాని స్త్రీ లకి గాని మొట్ట మొదట విద్య ని,సంస్కృతి ని అందించినది అనిపిస్తుంది.దీని లో ని జార్జ్ దొర పాత్ర నూటి కి నూరు పాళ్ళు సరియేనదే.అతను యానాది వారికి ఏర్పాటు చేసిన సాగు భూమి ని ఏ విధంగా స్థానిక భూస్వామ్య అధిపత్య వర్గాలు వశపరచుకున్నాయి అన్నది కేశవరెడ్డి చక్క గా చూపించినాడని చెప్పాలి.
నవల మొత్తం గొప్ప భీభత్స రసం తో ముందుకు సాగుతుంది.కింద న కరుణ రసం తొణికిసలాడుతూంటుంది.ప్రధాన పాత్రలు అన్నీ కుక్క తో సహా చంపబడతాయి.ఏ పాత్ర నేల విడిచి సాము చేయదు..ఒక మాట తక్కువ గాని ఎక్కువ గాని మాట్లాడదు.చదివిన తరువాత దృశ్య మాలికలు మన ముందు పరచుకోవడం మొదలు పెడతాయి.