Showing posts with label కొన్ని అనువాద రచనలు ఎందుకని అలా..?. Show all posts
Showing posts with label కొన్ని అనువాద రచనలు ఎందుకని అలా..?. Show all posts

Saturday 25 April 2020

కొన్ని అనువాద రచనలు ఎందుకని అలా..?

పేర్లు ఎందుకు లే గాని,మన వాళ్ళు అనువాదాలు చేసేప్పుడు మూల విధేయం గా ఉందా లేదా అన్న దానికి ఎక్కువ ప్రాధాన్యత ని ఇస్తుంటారు.అవును అది అవసరమే.అయితే  పదం నుంచి పదానికి మక్కీకి మక్కి అనువాదం చేయడం వల్ల తెలుగు పాఠకుని యొక్క ఓర్పు ని పరీక్ష చేసే విధంగా  గా ఉండకూడదు.నాలుగు పేజీలు చదవగానే ఆ డబ్బింగ్ భాష కి వెగటు కలిగి పుస్తకం మూసేయాలి అనిపించకూడదు.అప్పుడు అనువాదం యొక్క అసలు లక్ష్యమే దెబ్బ తింటుంది. ఆంగ్ల భాషకే సొంతమైన కొన్ని ప్రయోగాలు దానికున్నాయి.అలాగే మన కి కూడాను. దానిని బేలన్స్ చేస్తూ రీడబిలిటి కి పెద్ద పీట వేస్తూ అనువాదం సాగినపుడు అందగిస్తూంది.

ఉదాహరణకి He stopped for a while and assumed walking అని ఉన్నచోట దానికి ఒక అనువాదం ఇలా సాగింది.'అతను ఆగాడు కాసేపు మరియు నడవడం మొదలెట్టాడు '  అని అనువదించడం జరిగింది.ఆ ఇంగ్లిష్ వాక్యాన్ని పక్కనే పెట్టుకుని దీన్ని చూసి ఎస్ బాగా వచ్చింది తెలుగు అనువాదం అంటాడు ఒక అతి తెలివి గల వ్యక్తి.నిజమే బాగానే వచ్చింది.పదానికి పదానికి పక్క నే పెట్టి చూస్తే.కాని అక్కడ ధ్వంసం అయింది ఏమిటీ అంటే చదివించే గుణం.పాఠకుడు కొన్ని పేజీలు ఓపిక చేసుకుని చదివి బుర్ర తిక మక అయ్యి ఆ అనువాద పుస్తకాన్ని పక్కనే పారేస్తాడుఅనువాదం చేసేప్పుడు ఎంతో కొంత కృతక భాష దొర్లడం తప్పదులే గాని కేవలం ఆ కారణం వల్లనే ఓ అనువాద రచన పాఠకుని కి దూరం కారాదు.అది చాలా అపరాధం అనిపిస్తుంది. ఇంగ్లీష్ లో గొప్ప రచనలు గా పేరెన్నిక గని తీరా అవి తెలుగు లో కి అనువాదం అయినపుడు చదువుదాం అనుకుని కూర్చుని ఆ సార రహిత శైలి ని ఓర్చుకోలేక చాలా మంది పక్కన పడేస్తుంటారు.

 ఏమిటి ఇవి ఆ భాష లో అంత గొప్ప వి ఎలా అయ్యాయబ్బా అని అనుమానమూ వస్తుంది. దానికి కారణాలు ఇవే.అనువాదకుడు మూల భాష కి సంబందించిన సంస్కృతీ విశేషాలు సాధ్యమైనంత ఎక్కువ తెలుసుకుని ఉండాలి,అది చాలా మంచి చేస్తుంది.ఉదాహరణ కి He sold his soul to jezebel ఇలాంటివి తరచు ఇంగ్లీష్ రచనల్లో చూస్తుంటాము.ఇలాంటివి అన్నీ కూడా Biblical concepts, అంటే మన సాహిత్యం లో రామాయణ,మహా భారతాది గ్రంథాల నుండి ఎలా Inspire అయి రాస్తుంటామో అలాగే వాళ్ళూ బైబిల్ ఇంకా గ్రీక్,రోమన్ లకి చెందిన సాహిత్యాలనుంచి Inspire అవుతుంటారు.కాబట్టి వాటి వెనుక గల నేపధ్యం ని అర్ధం చెసుకున్నప్పుడు మక్కీ కి మక్కి అనువాదం చేయకుండా అదే అర్ధాన్ని ఎలా స్ఫురింపజేయాలో తెలుస్తుంది.ఒక వేళ అవసరం అయితే ఫుట్ నోట్స్ లో వివరించవచ్చు.అలాగే మన పాఠకులు కూడా అనువాద రచనలు చదివేటప్పుడు ఆ ఇంగ్లీష్ వాక్యాన్ని,ఈ తెలుగు వాక్యాన్ని పక్క పక్కనే పెట్టుకుని ఇదేమిటి ఇలా ఈ పదం వెనక్కి వచ్చింది,ముందుకి వచ్చింది అంటూ దబాయించకూడదు.అనువాదం లో గల వ్యూహం ఏ మేరకు చదివించేలా  చేసింది అనేది చూడాలి,అదీ భావాన్ని పోనివ్వకుండా..!

మూల రచన లోని పాత్రల పేర్లు ఎలా పలుకుతారో తెలియనప్పుడు వాటిని ఆ ఇంగ్లీష్ లోనే ఉంచేస్తే మరీ మంచిది.పాఠకులు వారి స్థాయి ని అనుసరించి చదువుకుంటారు. ఉదాహరణ కి కేథరిన్ అనే ఆవిడ పేరు ని వాళ్ళు కేథీ అని ముద్దు గా పిలుస్తారు.అయితే స్పెల్లింగ్ ని అనుసరించి అనువాదకుడు కాఠీ అని అనువాదం చేశాడు ఒక చోట.అలాంటివి ఎందుకు దొర్లుతాయి అంటే ఆ సంస్కృతీ విశేషాల్ని తెలుసుకోకపోవడం వల్ల అనుకుంటాను.ఇంకా ఇలా ఉన్నాయి...మళ్ళీ ఎప్పుడైనా ఇంకొన్ని.

      .