Monday 18 March 2024

నిజానికి ఆ గుబిలి వల్ల లాభమే తప్పా నష్టం ఏమీ లేదు.

 చాలామంది చెవిలో గుబిలి రావడం అనారోగ్య సూచకమని భావిస్తారు. అపరిశుభ్ర హేతువని అనుకుంటారు. నిజానికి ఆ గుబిలి వల్ల లాభమే తప్పా నష్టం ఏమీ లేదు.


బయట నుంచి వచ్చే సూక్ష్మమైన దుమ్ము,ధూళి కణాలను చెవి లోపలి భాగాల్లోకి పోకుండా ఈ గుబిలి అడ్డు పడుతుంది. అలా వెళ్ళినట్లయితే రకరకాల ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ విధం గా చెవి ని రక్షించే ఓ ఏర్పాటు అన్నమాట.


చెవిలోని గ్లాండ్స్ నుంచి ఈ గుబిలి అనేది వస్తుంది. 


గుబిలిని తీయాలంటే దాన్ని ముందు మెత్తబరచాలి. ఐ డ్రాప్స్ గాని,  బేబీ ఆయిల్ డ్రాప్స్ గాని లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ గాని వేయాలి.


ఒకటి రెండు రోజులకి మెత్తబడుతుంది. అప్పుడు రబ్బర్ బల్బ్ సిరంజీ తో గోరువెచ్చటి నీళ్ళని చెవి లోకి చిమ్మించడి. మొత్తం వచ్చింతర్వాత పొడిగా తుడవాలి. మీకు ఇబ్బంది ఉంటే చెవి స్పెషలిస్ట్ దగ్గరకి వెళ్ళడం మంచింది. 

Sunday 27 August 2023

"ద యోగి విచ్" ఈ మధ్య హార్పర్ కోలిన్స్ వాళ్ళు ముద్రించిన ఓ నవల


 "ద యోగి విచ్" ఈ మధ్య హార్పర్ కోలిన్స్ వాళ్ళు ముద్రించిన ఓ నవల ఇది. అసలు యోగి కి విచ్ కి సంబంధం ఏమిటి..? అనే అనుమానం తో ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెప్పించాను. చ్వాడికి  అదివాను. మొత్తం 339 పేజీలు. రాసిన వారు జోరియన్ క్రాస్ అని ఓ రచయిత.ఢిల్లీ సర్కిల్ లో థియటర్ ఆర్టిస్ట్ గా కూడా సుపరిచితులు. గమ్మత్తు నవల. వెస్ట్రన్ టైప్ విచ్ (మంత్రగత్తె) ,ఇండియన్ టైప్ యోగి వీళ్ళద్దరి కేరక్టర్ ని ఒక్క మనిషి లో ప్రవేశపెట్టి ఇదొక ప్రయోగాత్మక నవల గా రాశారు.

సినిమా గా, డ్రామా గా ఇలాంటి ఇతివృత్తాలు బాగుంటాయి తప్పా నిజం గా లోతుగా వెళ్ళి పరిశీలిస్తే అర్థం గాక తలగోక్కోవలసి వస్తుంది.మన తెలుగు వాతావరణానికైతే వాటికి కూడా డౌటే. కాని చదివించే గుణం ఉంది నవల లో.అంతర్లీనం గా LGBT హక్కులు అనే నేపథ్యం లో ఈ నవల సాగుతుంది. జై గిల్ ఒక గే లక్షణాలు ఉన్న యువకుడు.అతడు కొన్ని శక్తులు ఉన్న ఆడవాళ్ళ చే పెంచబడతాడు. వీళ్ళంతా ఢిల్లీ లో ఉంటారు. ఇక రజని సాబ్ కుటుంబం వీళ్ళది కేబల్ అనే సీక్రెట్ వ్యవస్థ.

ఈ రెండు కుటుంబాల మధ్య జరిగే వాస్తవిక,అధివాస్తవిక సన్నివేశాల హారమే ఈ నవల. క్లైమాక్స్ లో నైతే ఏ సినిమా కి తగ్గని మాయామంత్రాలు ఉంటాయి. అశ్లీల సన్నివేశాలూ ఉంటాయి.జుగుప్సాకరమైన మంత్ర ప్రయోగాలూ ఉంటాయి.యోగా నేపథ్యం లో ఇలాంటి ఓ నవల కూడా రాయచ్చా అనే అనుమానమూ వస్తుంది. ఒక నూతన అనుభవం కోసం చదవవచ్చు. అమెజాన్ లో ఉంది. వెల రూ.399.   

Monday 17 July 2023

ఈ బడాదీదీ అందరికీ ఆదర్శం

 జీవితం లోని అన్ని సమస్యల్ని పరిష్కరించగలిగేది విద్య,ఎంత చదివితే అంత తెలుస్తుంది.ఎంత తెలిస్తే అంత నేర్చుకుంటావు,అన్ని ప్రదేశాల్ని చూస్తావు అని చెప్పాడు డాక్టర్ సియోస్. బడా దీదీ అనే సంస్థ దీన్ని ఆదర్శంగా తీసుకుంది.2019 వ సంవత్సరం లో 20 మంది ఆదివాసీ మహిళలు మల్కాన్ గిరి జిల్లాలో ఈ సంస్థ ని స్థాపించారు. అక్కడి పిల్లల్లో ఉన్న మొబైల్ ఫోన్ ఎడిక్షన్ ని మానిపించి పుస్తకాల వైపు వారి దృష్టిని మళ్ళించడానికి దీన్ని నెలకొల్పారు.

అక్కడి పల్లెల్లో ఆరుబయట చదువుకునే లైబ్రరీల్ని స్థాపించారు.దాంట్లో కథల పుస్తకాలు,కార్టూన్ ఇంకా అనేక పుస్తకాలు ఉంటాయి.రకరకాల మేగజైన్ లు కూడా ఉంటాయి.పెద్దలు,పిన్నలు కూడా ఇక్కడికి వచ్చి చదువుతుంటారు.దీపావళి పర్వ దినాన 80 పుస్తకాలతో ఈ గ్రంథాలయాన్ని పెట్టారు.ఇంగ్లీష్,ఒడియా,హిందీ,బెంగాలీ పుస్తకాలు కూడా ఉన్నాయి.అవే కాక జి,కె.పుస్తకాలు,పోటీ పరీపరీక్షలకి పనికొచ్చే పుస్తకాలు కూడా ఉన్నాయి.


 రోజు పది నుంచి పదిహేను మంది దాకా పిల్లలు ఈ లైబ్రరీ కి వస్తుంటారు.పొద్దున్న,సాయంత్రం వారి వీలునుబట్టి వస్తుంటారు.ప్రతి పంచాయాత్ లోనూ ఈ తరహా కేంద్రాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు.పిల్లలే గాక పెద్దల్ని కూడా ఇవి ఆకర్షిస్తున్నాయి. అనేకమంది దాతలు కూడా ముందుకు వచ్చి పుస్తకాలు స్పాన్సర్ చేస్తున్నారు.ఇతర రాష్ట్రాలకి చెందిన పుస్తకప్రియులు సైతం ఈ బడదీదీ సంస్థ కి సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.  

  ఈ బడదీదీ కి మొత్తం 40 మంది వాలంటీర్లు ఉన్నారు.వీరు అంతా ఆదివాసీ పల్లెలలోనే పనిచేస్తూన్నారు. దీన్ని ప్రారంభించినవారు జయంతి అనే మహిళ.ఈమె కోయ తెగకి చెంది, ఒక పేరెన్నిక గన్న మీడియా హౌస్ లో పనిచేస్తున్నారు.ఈ లైబ్రరీలతో బాటు చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పే కార్యక్రమం కూడా కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా ప్రయత్నిస్తున్నారు.చిత్రకొండ ఏరియా లోని బోండా తెగ ప్రజల కోసం కూడా కృషి చేస్తున్నారు.

      

Thursday 27 April 2023

అనగూడదు గాని తెలుగువాళ్ళ లో ఉండే ఇంత హిపోక్రసీ...

 కొంతమంది ఆదర్శాలు వల్లిస్తుంటారు.ఎలా అంటే అసలు నిజంగానే వీళ్ళు తమ జీవితాల్లో వాటిని పాటిస్తున్నారా అనిపిస్తుంది.చాలా గౌరవం కూడా కలుగుతుంది. అంత నమ్మశక్యంగా ఉంటాయి వాళ్ళ మాటలు.తీరా వాళ్ళ ఇళ్ళకెళ్ళినప్పుడు మాత్రం చెప్పేదానికి వ్యతిరేకంగా ఉంటాయి వ్యవహారాలన్నీ. ఇంగ్లీష్ భాష వల్ల ఎంత తెలుగు దెబ్బతింటున్నదీ ,సంస్కృతి మంట కలుస్తున్నదీ వివరిస్తూ ఓ పెద్దమనిషి వాట్సాప్ ల్లో తెగ మెసెజ్ లు పెడుతుండేవాడు. నిజం చెప్పొద్దు చాలా గంభీరంగా ఆకర్షణీయంగా కూడా వివరిస్తూండేవాడు. 

ఓసారి ఏదో శుభకార్యం నిమిత్తం ఆ పెద్దమనిషి ఇంటికెళ్ళా. అవీ ఇవీ మాట్లాడినతర్వాత ఆయన గారి మనవళ్ళతో మాట్లాడితే తెలిసింది. ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు మీడియం లో చదవడం లేదు అని. మతి పోయింది,ఏమిటి ఎంత ఆవేదన తో తెలుగు గురించి మధనపడుతుంటాడు ఆ పెద్ద మనిషి.ఇంగ్లీష్ వచ్చి సంస్కృతిని నాశనం చేస్తోందని తెగ బాధపడే ఆయన తన మనవళ్ళలో ఒక్కడిని కూడా తెలుగు మీడియం లో చేర్చలేకపోయాడు.

అనగూడదు గాని తెలుగువాళ్ళ లో ఉండే ఇంత హిపోక్రసీ మరెవ్వరి లో ఉండదేమో.అడిగినా ఏదో డొంకతిరుగుడు సమాధానం రెడీమేడ్ గా పెట్టుకుని ఉంటారు ఇలాంటివాళ్ళు.కొన్నంతే,విని ఊరుకొవడానికే పనికొస్తాయి.    

 

Thursday 20 April 2023

జావా ఆఫ్ ఇండియా అని ఈ పట్టణాన్ని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

 Java of India అని మన దేశం లో ఏ పట్టణాన్ని పిలుస్తారో తెలుసా..? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న గోరఖ్ పూర్ ని ఆ విధం గా పిలుస్తారు. అంతే కాదు, ఆ పట్టణం ఆధ్యాత్మిక,సిద్ధ పురుషులకి పెట్టింది పేరు. ప్రసిద్ధ నాథ్ సంప్రదాయానికి పట్టుగొమ్మ ఈ స్థలం. మత్స్యేంద్రనాథ్ మహాశయులు స్థాపించిన ఆలయం ఇప్పటినుంచి కాదు ఎన్నో తరాల నుంచి పేరెన్నిక గన్నది.గోర్ఖ్ పూర్ పట్టణం అత్యంత పురాతన పట్టణం.గీతా ప్రెస్ అంటే తెలియంది ఎవరికి.ఆ ప్రెస్ ఇక్కడ నుంచే నడిచేది.


రాప్తీ నదీ తీరాన,లక్నో కి తూర్పున 272 కి.మీ. దూరం లో ఉంటుంది.నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ కి ప్రధాన కేంద్రం కూడా.ఒకానొకప్పుడు బస్తీ,దియోరియొ,అజం ఘడ్,నేపాల్ లోని తరాయ్ వీటన్నిటిని కలిపి ప్రసిద్ధ ఆర్యవర్తం లోని క్షేత్రాలుగా పిలిచేవారు.ఇక్కడకి వచ్చిన వారు కపిలవస్తు,లుంబిని,కుషీనగర్,గోరఖ్ నాథ్ ఆలయం  ఇలాంటివి చూడాలి. చౌరిచౌరా ఘటన లో అమరులైనవారికి స్మారక స్థూపం నిర్మించారు.ఇదీ చూడవలసిందే.

ఇక్కడ హిందీ,ఉర్దూ మాట్లాడుతారు.అలాగే భోజ్ పూరి కూడా. ప్రతిరోజు ఇక్కడినుంచి ఢిల్లీకి 13 రైళ్ళు నడుస్తాయి.బ్రిటీష్ వారు ఈ పట్టణాన్ని హిల్ స్టేషన్ గా పరిగణించారు.నేపాల్ కి బోర్డర్ లో ఉండే పట్టణాల్లో ఇది ఒకటి.అన్నట్టు ఈ ప్రాంతాన్ని జావా ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారో తెలుసా ..? ఇక్కడ ఎక్కువగా చెరుకు మిల్లులు ఉంటాయి.దానివల్లనే ఆ పేరు వచ్చింది. 

Saturday 8 October 2022

Akasinthinte Niram- ఓ చక్కని మళయాళ సినిమా

 


ఫేస్ బుక్ కొద్దిగా తగ్గించిన తర్వాత అనుకోకుండా కొన్ని మంచి సినిమాలు చూడగలుగుతున్నాను. ఈ మధ్యనే ఓ మళయాళ చూశాను. దాని పేరు "ఆకాశింథింటే నిరం" (Akasinthinte Niram). చూసిన తర్వాత మనసు ఎంతో ప్రశాంతం గా,హాయిగా, జీవితం గురించి చక్కటి ఆలోచనల తో నిండిపోయింది. మంచి సినిమా చూడాలనుకునే వారు అందరూ తప్పక జీవితం లో చూసి తీరాలి.

గోల్డెన్ గోబ్లెట్ అవార్డ్ కి ఇంకా అనేక దేశ విదేశ సినిమా పోటీలకి ఈ చిత్రాన్ని అధికారికం గా ఎంపిక చేశారు. దానికి అన్ని విధాలా అర్హత కలిగినది ఈ చిత్రం.సినిమా అంతా ఒక దీవి లో జరుగుతూంటుంది.అండమాన్ దీవుల్లో ఉన్న నీల్ అనే 40 చ.కి.మీ. ఉండే దీవి లో సినిమా సాగుతుంది.ఏ పాత్రకి పేరు ఉండదు. కాని ఆ విషయం మనకి సినిమా చివరిదాకా ఎక్కడా తట్టదు.

ఒక చిన్న దీవిలో 60 ఏళ్ళ వృద్ధుడు. తను రకరకాల కళాకృతులు తయారు చేసి దగ్గర లో ఉన్న పట్టణానికి మోటారు బోట్ లో వెళ్ళి అమ్మి మళ్ళీ తిరిగివెళ్ళిపోతుంటాడు.దీన్ని కనిపెట్టిన ఓ దొంగ ఆ బోట్ కదిలేసమయానికి దాంట్లోకి ఎక్కి చాకు చూపించి డబ్బులు ఇవ్వమని బెదిరిస్తాడు. ఆ ముసలివాడు చిన్నగా నవ్వుతూ నీకు ఈత వచ్చా అని అంటూనే ఆ బోట్ ని సముద్రం లోకి పోనిస్తాడు.

ఈ దొంగ కి ఈత రాదు బోట్ నడపడం రాదు.తత్తరపడేలోగా సముద్రం లోకి దూరం గా వెళ్ళిపోతారు.కాసేపు ప్రయాణించి ఓ చిన్న దీవి కి చేరుకుంటారు.అక్కడ ఓ చిన్న కాటేజ్ ఉంటుంది,దాంట్లో ఓ చిన్న పిల్లాడు,ఓ యువకుడు ,ఓ యువతి ఉంటారు.ఎవరిపని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు.ఈ దొంగ పారిపోవాలని ప్రయత్నించినా వీలుపడదు.ఆ దీవి లో వారి జీవనం విచిత్రం గా అనిపిస్తుంది.

  జీవితాన్ని ఇంత అర్ధవంతం గా జీవించవచ్చా అనిపిస్తుంది.ప్రకృతి ని పాడుచేఅకుండానే దానితో కలిసి జీవించడం కనబడుతుంది.అన్నట్టు ఆ ముసలాయనకి మంచి లైబ్రరీ ఉంటుంది.తోట ఉంటుంది.ఇంట్లో నుంచి చూస్తే సముద్రం ఉంటుంది.అంతే కాదు కొన్నిసార్లు మోటార్ బైక్ వేసుకుని ఎక్కడికో వెళుతుంటాదు ముసలాయన.ఈ దొంగ కి ఆసక్తి పెరుగుతుంది.కాని ఆ పెద్దాయన ఒక సమయం వచ్చినప్పుడు ఆ దొంగ ని ఆ చోటకి తీసుకువెళతాడు. అతను నిర్ఘాంతపోతాడు. అక్కడ ఏమి ఉన్నదీ తెలియాలంటే సినిమా చూస్తేనే బాగుంటుంది.

సముద్రం పక్కనే వేసిన చిన్న కాటేజ్ లు లాంటివి తప్పా పెద్ద ఖర్చు ఏమీ లేదు. కాని ఎప్పుడూ సముద్రం పక్కనే ఆ అందమైన లోకేషన్ లలో జరిగే సన్నివేశాలు మనసు ని ఎక్కడికో తీసుకుపోతాయి. డైలాగ్స్ చాలా తక్కువ.కాని ప్రతి సీను మనసు లో ముద్ర పడిపోతుంది.సినిమా ని ఆస్వాదించే కళాత్మక హృదయులు తప్పక చూడాలి.డా.బిజూ దర్శకత్వం బావుంది.నెడుముడి వేణు,ఇంద్రజిత్,అమలా పాల్ లాంటి వారు ఉన్నారు.ఈ సినిమా ప్రైం వీడియో లో ఉంది.ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి.వీలయితే చూడవచ్చును. 



   

Thursday 18 August 2022

ఇన్నాళ్ళకి ఓ కలని మాటల్లో బంధించగలిగాను

 తెల్లవారుఝామున అనగా బహుశా, నాలుగున్నర అయిదు మధ్యలో అనుకుంటా ఒక కల వచ్చింది.అసలు ఏవైనా కలలు వచ్చినా తెల్లారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుందాం అనుకుంటే ఎందుకో నాకు అసలు గుర్తుకు రావు.మరుపు కమ్మేస్తుంది.కల వెలిసిపోయిన తరవాత...ఆ ...ఇదేగా గుర్తుండదా అనిపిస్తుంది...తీరా జ్ఞాపకం తెచ్చుకోబోతే షరా మామూలే. అది కాస్తా మసకబారి మస్తిష్కం నుంచి తుర్రుమంటుంది.ఇది చాలు ...మన మనసు మన ఆధీనం లో ఎప్పుడూ అలా ఉండదు అనడానికి.

అయితే ఈసారి మాత్రం అలాకాదు. సాలిడ్ గా గుర్తుంది.కనుక ఓ బ్లాగ్ పోస్ట్ రాయాలనిపించింది.కల కి మొదలు చాలా స్పీడ్ గా ఉంటుంది.పరిచయాలు అవీ ఏవీ ఉండవల్లే ఉంది. మరి అది ...ఒక రోడ్డు...ఎర్రటి తారు రోడ్డు.అలాగని మరీ రక్తపు రంగు లో లేదు.ఒక సాధారణ రోడ్డు...ఆ రోడ్డు ని అక్కడక్కడ ఎవరో చెక్కేశారు. కనక దాని కింద నల్లని రోడ్డు కనబడుతోంది.అదేంటబ్బా ...విచిత్రం గా ఉంది రోడ్డు అనుకుంటున్నాను.

దారికి రెండు వైపులా పెద్ద చెట్లు.చల్లటి గాలి.చల్లటి నీడ.నిశ్శబ్దం గా ఉంది.పడుకున్న శరీరం సైతం చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నది.అలా చూస్తుండగా నేను ఎక్కిన ఏదో వాహనం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది.అరే అనిపించి... నడుచుకుంటూ వస్తున్నాను. ఏదో వేరే రాష్ట్రం లో అడుగుపెట్టినట్లు అనిపించింది.ఒక గ్రామం లా ఉంది.ఎటు చూసినా పచ్చని చెట్లు.కొబ్బరి చెట్లు ఇంకా ఇతర చెట్లు ఎత్తుగా కనిపిస్తున్నాయి.వాటి సందుల్లోంచి చూస్తే ఒక పొడవాటి,ఎత్తైన తెల్లని భవనం అగుపిస్తోంది.అరే ఇక్కడ ...ఇలాంటి భవనమా..అనుకుంటూండగా మరో దృశ్యం కనిపించింది.

పాతకాలపు గురుకులం లా ఉన్న ఓ కుటీరం ...దాంట్లోని బెంచీలన్నీ కొత్తగా నిగనిగలాడుతున్నాయి.అన్నీ చెక్కవే.దగ్గరకి వెళ్ళి చూస్తున్నాను.అంతలోనే  ఇస్కాన్ వారి తరహా లో ధోతీ లో ఉన్న ఓ పెద్ద మనిషి రాగా,నా గురించి చెబుతుండగా ...సరేసరే మీ ఇష్టం చూడండి అన్నాడాయన.అంతలోనే కొంతమంది స్త్రీలు ఆరేడుగురు బిలబిలమని వచ్చారు.పైనున్న మెట్ల మీదినుంచి.ఏదో మాటాడుతున్నారు గాని అర్థం కావడం లేదు.వాళ్ళ చీరె కట్టు సౌరాష్ట్ర ప్రాంతం లా అనిపించింది.ఆ తర్వాత ఆ మనుషులంతా కనబడలేదు.

ఎటూ చూసినా పచ్చని ప్రకృతి.మనసుకి హాయిగా అనిపించసాగింది.అలా అలా ... తెలివి వచ్చింది. ఈసారి ఎలాగైనా ఈ కల గుర్తుపెట్టుకోవాలని కొన్ని సంకేతపదాలు పెట్టుకున్నాను.విచిత్రం గా ఈసారి కలమాత్రం మరుపు రాలేదు. రోజంతా హాయిగా అనిపించింది.ఆ గ్రామం పదే పదే కళ్ళముందే కనిపిస్తోంది.అది ఎక్కడుందో ...తెలిస్తే బాగుండును.వెళ్ళాలని మనసు లో ఓ కుతూహలం.కొన్ని కలలు అంతే...!ఎన్ని మాయాజాలాలో ఈ దేహం లో...నిజం కంటే నిజం అనిపిస్తుంది ఒక్కో కల.