Wednesday 21 March 2018

నేను శివ ని (నవల) Post no:25

నేను శివ ని (నవల) Post no:25

"సర్లే" కళ్ళు తుడుచుకున్నాను.

"నువు మాట్లాడు ఇపుడు..ఒక ముప్ఫై సెకండ్లు..నీ వంతు" వరుణ్ చెప్పాడు.

" నేనేం మాట్లాడాలి"

" పోనీ నాకు కాంప్లిమెంట్ ఇవ్వు"

" నువు ఒక.." నా నోటిలోనుంచి మాట రాబోతుంది ,ఇంతలో తను అందుకున్నాడు.

" కానీ పార్వతి..నోటిలోంచి ధారగా మాట్లాడు"

" ఏమి చెప్పాలో తెలియడం లేదు"

" అంటే నా గురించి పొగడటానికి ఏమీ లేదా..అసలు గుణ నా గురించి ఏమని అంటుంటాడో నీకు తెలుసా "

"ఏమంటాడేం"

"నేను ఓ గొప్ప మనిషినని...కారణ జన్ముడినని..అలా...ఆ లెక్కన నువు కూడా గొప్పదానివేగదా "

" ఆ..అంతే"

" విధి చాలా బలీయమైనది.కదా..!నా కోసం నువు..నీ కోసం నేను ..వెయిట్ చేయడం...ఈ జన్మలో ఇలా కలుసుకోవడం ..చాలా గొప్ప విషయం"

" గ్రేట్"

" ఏమిటి ..మళ్ళీ ఆ పొడి పొడి గా మాట్లాడటం" కోపం ధ్వనించింది అతని లో.

" ఓ విషయం గురుంచి మనం చక్కగా మాట్లాడుకోలేమా.." వరుణ్ అన్నాడు మళ్ళీ.ఇపుడు తను గంజాయి మత్తు లో లేడు,కాని విచిత్రం గా మాటాడుతున్నాడు.అంటే దాని ప్రభావం ఎప్పటికీ మనిషి లో అలా ఉంటుందా ..? ఇక నా గతి ఇంతేనా అనిపించింది.

" ఇవ్వాళ అంతా నేనే మాట్లాడుతున్నా...ఒక చేంజ్ కోసం..నువు మాటాడు నా బదులు " అన్నాడు వరుణ్.

" నా గురించి ఏమనుకుంటున్నావో ..అవన్నీ నువు చెప్పు" అన్నాను.ఆ విధంగా అయినా కొన్ని మంచి మాటలు నా గురించి మాటాడతాడని.

" నువు నా అవసరం.కాని నేను నిన్ను కోరడం లేదు.వినడానికి కష్టం గా ఉందా..? అదే విశ్వ రహస్యం.నా జీవితం లో నువు ఓ భాగం.కొన్నిటిని మనం కలిసి చేయాలి.మనం ఏం చేయాలనేది గుణ ఎప్పటికపుడు చెబుతాడు.ఈ లోపులో అంతా నువు అర్ధం చేసుకోవాలి.ఈ లవ్వు గివ్వు కంటే మించిన బాధ్యతలు నాకున్నాయని "

" నీ అర్ధం... గతం లో నువ్వు  నా గురించి చెప్పినదంతా ఉట్టిదేనా "

"నేను ఎంతో చెప్పాను జీవితం గురించి ..నీకు అర్ధం కావడం లేదు. ఇవన్నీ అర్ధం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నీకు...కొన్ని బీర్లు తాగుతూ మాటాడుకుందాం ..పద"

" ఈ సారి ట్రిప్ లో అలాంటి వేమి వద్దనుకున్నాం గదా...ప్రామిస్ చేశావ్ కూడా ..!నా కోసం కంట్రోల్ చేసుకో ఈ సారికి,నీ బెటర్ ఆఫ్ గా చెబుతున్నా "

"వావ్..ఇన్ని మాటలు ఎక్కడ నేర్చుకున్నావ్...బాగుంది...ఒకే ఒక్క బీర్..అంతే ..!కనీసం ఈ ఒక్కదాన్ని ఆమోదించలేవా ?"

" దయచేసి విను.నువు ఆల్కాహాల్ కి దూరం గా ఉండు.నువు అడిగింది ఏదైనా చేస్తా..నీ మంచికోసం చెప్తున్నా"

" నా మంచి ఏమిటి అనేది గుణ కి మాత్రమే తెలుసు.మీ ఈగోలు అన్నీ నాకు అసహ్యం. మీ అందరి కంటే గుణ కొన్ని వందల రెట్లు  తెలివైన వాడు ఇంకా అనుభవం ఉన్నవాడు.ఆల్కాహాల్ గాని డోప్ గాని ముట్టవద్దని అతను ఎప్పడు చెప్పలేదు.అలాంటిది నువ్వు ఎవరవి చెప్పడానికి..? " కోపంగా చూశాడు వరుణ్.

నాకు ఇప్పుడు ఒకటే తోచింది.టాపిక్ మళ్ళించడం మంచిదని.

" సరే..అసలు ఆ గుణ అనే వ్యక్తి ఎవరు,నాతో చెప్పకూడదా తన గురించి" అడిగాను.

" ఓహ్..గుణ నా...నా గత జన్మని జీవించాడు తను .నాకు గైడెన్స్ ఇచ్చేది తనే..ఈ జన్మ లో నేనేమి చేయాలనేది అతనికి మాత్రమే తెలుసు..ఎందుచేత నా జీవితాన్ని జీవించాడు గనక గతం లో..!తను ఒక మార్మిక వ్యక్తి.క్రమ క్రమంగా అంచెలు ప్రకారం నేనేం చేయాలో చెబుతుంటాడు.ఒకేసారి చెప్పాడే అనుకో ఈ సిస్టం తట్టుకోలేదు ఓవర్ లోడయి పొయి " హిస్టీరిక్ గా నవ్వుతూ చెప్పాడు వరుణ్..!
 ఈ రోజు కూడా అతని కోసమే వేచి చూస్తున్నా...మరి ఈ గోవా లోకి వస్తాడో,రాడో ..అంతా అతని దయ.నాకు కనిపిస్తే మటుకు నీకు తప్పకుండా పరిచయం చేస్తా.." నవ్వి చెప్పాడు వరుణ్.

" అతణ్ణి ఓసారి చూడాలని నాకు చాలా ఇది గా ఉంది" అన్నాను.వరుణ్ చెప్పేది తలతిక్కగా ఉన్నా నేను కావాలనే అన్నాను.

" నా ఈ జీవితం లో శివ గా నా పాత్ర నేను చక్కగా పోషించాను..ముఖ్యంగా నా ప్రధమ కర్తవ్యం నిర్వర్తించాను.ఒక దుష్ట శక్తిని అంతమొందించాను " గర్వంగా చెప్పాడు వరుణ్.

" కంగ్రాట్స్"

" నిజంగా నా"

"ఒక కధ చెపుతా విను.ఒకానొకప్పుడు సూర్య అని చెప్పి ఒకడుండేవాడు.భూత కాలం లో ఎందుకు చెపుతున్నానంటే వాడు ఇప్పుడు లేడు.సర్వ దుష్ట గుణాలూ ఉన్న వ్యక్తి.అమాయకులైన విద్యార్తుల యొక్క పర్సులు,మొబైల్స్ కొల్లగొట్టేవాడు.అంతేగాక మొబైల్స్ లో ఉన్న అమ్మాయిల ఫోటోల్ని పోర్నో సైట్ లకి అమ్మేసేవాడు.డబ్బు సంపాదించే పద్ధతుల్లో నీచమైన వి గదా అవి...అందుకే తనని నేను క్షమించలేకపోయాను" వరుణ్ లో ఉద్రేకం తొంగి చూసింది.

" అప్పుడు ఏమయింది" ఆత్రుత గా అడిగాను.

" నా స్థానం లో నువ్వే ఉంటే ఏమి చేస్తావు"

" నాకు తెలీదు.."

" ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే వాడి జీవితాన్ని ముగించాను.వాడు ఉండాల్సింది నరకం లో..అక్కడికే పోయాడు"

" ఏమిటి..నువు చెప్పేది నిజమేనా " నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను.అసలు ఇలాంటి సీరియస్ సంగతి ని అలవోకగా చెప్పేసేడేంటి.తనకి ఏమి కాకూడదు అనేది నా కోరిక.ఇదే గనక నిజమైతే పోలీస్ కేసు అయ్యి అతని జీవితం నాశనం అవుతుంది.
" వాడు అంత ఈజీ గా దొరికాడా ...కనిపెట్టలేనని అనుకున్నాడు.నాలోని దైవ శక్తే వాడి అనుపానులను గురించి చెప్పింది.సీక్రెట్ ప్లేస్ లో నక్కాడు వెధవ..ఆరు సార్లు కత్తి తో పొడిచా.ఆ విధంగా గుణ నాతో మొదటి పనిని నెరవేర్చాడు.తర్వాత పని ఏమిటో..దాని కోసమే ఎదురు చూస్తున్నాను "

అదే గనక నిజమైతే..దాని పర్యవసానాలు ఏమిటో తను ఆలోచిస్తున్నట్లుగా లేదు.నాకిప్పుడు వెంటనే తిరుచ్చి వెళ్ళిపోవాలని అనిపిస్తోంది.అసలు గోవా కి తన తో వచ్చిఉండకుండా ఉంటే బాగుండేది.

" నా గొప్ప పనిని ఒక బీర్ తో సెలెబ్రేట్ చేసుకుందామా"  అడిగాడు వరుణ్.

" ఇంకో బీచ్ కి పోదాం పద.."

" చాలా చికాకు గా ఉంది.ఓ బీర్ పడాల్సిందే..పారూ..ప్లీజ్ ..ప్లీజ్ "

"బైక్ లో పోతుంటే హాయి గా ఉంటుంది..పద"

"ఎలాంటి వైఫ్ వి నువు.."

" నీ మంచి కోసం ఆలోచించే తరహా "

" అదే నిజమైతే ఒక బీర్ ని తాగనివ్వాలి.నా లో వచ్చే ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలంటే,నిద్ర పోవాలంటే ఓ బీర్ ఉండాలి"

" సరే..ఒకే బీర్ ..!" అన్నాను.నాకిక చాయిస్ లేదు.వేరే ఏమి చేయడానికైనా..!నేను ఇప్పుడు ఉన్నది ఒక సైకోపాత్ కిల్లర్ తో...నా క్షేమం నేను చూసుకోక తప్పదు.

" సరే..బ్రిట్టో స్ కి పోదామా"

" సరే"

పావు గంట లో అక్కడికి చేరుకున్నాము.అక్కడ మేము డిన్నర్ చేశాము గతం లో వచ్చినపుడు ..అప్పటికి ఇప్పటికి ఎంత తేడా జీవితాల్లో.అప్పుడు స్వర్గం అనుకుంటే ఇప్పుడు నరకం అనుకోవాలి.నేను గమ్మున ఉండి తననే మాటాడనిస్తున్నాను.నాకు ఏమి తట్టలేదు అతని తో ఏది..ఎలా మాటాడాలో..!బీర్లు సర్వ్ చేయబడ్డాయి.

" నీకు సరదాగా ఉందా.. నాకైతే చాలా బాగుంది " బీర్ ని సిప్ చేస్తూ అన్నాడు వరుణ్.

" నాకూ బాగుంది" ఏదో అనాలని అన్నాను.నిజానికి ఇంకా షాక్ లోనే ఉన్నాను. (సశేషం)  

No comments:

Post a Comment