Friday, 23 March 2018

నేను శివ ని(నవల) Post no:27

నేను శివ ని(నవల) Post no:27

చాప్టర్-8

" వావ్..రాం కి ప్రియాక అని  ఇంకో పేరు ఉందా..అది నాకు తెలీదే..!ముద్దు పేరా అది? ఈ రోజు నేను చెబుతున్నది సరిగా వినకుండా పరధ్యానంగా ఉండానికి అదా కారణం..ఆ యావ లో ఉన్నావా ఆ ప్రియాంక తో" దెయ్యం లా నవ్వాడు వరుణ్.ఆ తర్వాత నా జుట్టు గట్టిగా పట్టుకున్నాడు.

" నన్ను వదులు" నా జుట్టు విడిపించుకోడానికి ప్రయత్నిస్తున్నాను.

" నేను ముందే చెప్పాను..నాతో అబద్ధం ఆడితే దానికి అనుభవిస్తావు అని.నా వార్నింగ్ సీరియస్ గా తీసుకోలేదు గదూ ..దానికి గాను మూల్యం చెల్లించవలసిందే..." లోపల దడదడ లాడసాగింది.చావగొడితేనో..!

"అంటే నా క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే దొరికాడా నీకు ఈ సారి అఫైర్ పెట్టుకోడానికి...నువు పెద్ద బోకు వి అని తెలుసు ..కానీ ఈ స్థాయి లో అని ఊహించలేదు" అలా అంటూ నా జుట్టు పట్టుకుని రూం లోకి లాక్కొచ్చాడు.

" ప్లీజ్ వరుణ్..వదిలి పెట్టు జుట్టు ని ...నొప్పి గా ఉంది" అన్నాను.

" అలాగే ఉంటుంది ప్రియతమా..నేను అనుభవిస్తున్న నొప్పి తో పోల్చితే ఇదెంతా..?నేను అనుభవించినంత నువూ అనుభవించాలిగా నొప్పి" బెడ్ మీదకి తోశాడు నన్ను.

" రాం కి నాకు మధ్య ఏమీ లేదు.అదంతా నువు ఊహించుకుంటున్నావు.మేము మంచి స్నేహితులము మాత్రమే...కావాలంటే నువే అతడిని అడుగు " కన్నీళ్ళతో చెప్పాను.

" నేను పిచ్చొడిలా కనిపిస్తున్నానా..ఆ మాత్రం తేడా తెలియదనుకుంటున్నావా..నీ నంగనాచి కబుర్లు కి పడిపోతానా" నా భుజాలు పట్టుకుని చెప్పాడు.

" దయచేసి నన్ను నమ్ము.నేను నిన్ను ప్రేమించే నీ పార్వతిని" చెప్పాను.

" నువు నా పార్వతి వి కావు.నువు ఒక బజారు సరుకు వి..నన్ను వెధవని చేస్తున్నావా ..నిన్ను పూర్తిగా పరిశీలించకుండానే నీ వల లో ఇంచుమించు పడిపోయాను.లోపలకంటా వెళ్ళి చూస్తే నీ నిజరూపం ఇదన్నమాట.పూర్వం లా నేను ఎందుకు లవ్ చేయడం లేదో తెలుసా,దానికి కారణం నీ పనికిమాలిన ప్రవర్తనే ..దానికి రుజువులు కావాలా..నీ స్కూల్ డేస్ లోనే ఇద్దరి తో పోయావు..నీ మొత్తం జాతకం అంతా ఆ గుణ కే తెలుసు ,నువ్వు ఒక దేవతవి ..అది నేను నమ్మాలి ,వింటే నవ్వొస్తున్నది"ఆ రూం లో తిరుగుతూ వాగుతున్నాడు వరుణ్.
    " నీకొక సేల్స్ టెక్నిక్ చెప్పనా...అదే నీ సీక్రెట్ లవర్ ప్రియాంక చెప్పిందిలే...కష్టమర్ ఏదైనా కొనాలని  వచ్చినపుడు సేల్స్ మేన్ ఏమని చెబుతాడో తెలుసా... చెక్ ఇస్తారా కేష్ ఇస్తారా అని.అంటే ప్రొడక్ట్ ని అతను ఆల్రెడీ కొన్నట్లు గా ఊహిస్తాడన్నమాట.అంటే కొనకుండా ఉండానికి ఆస్కారం లేదక్కడ.అదో టెక్నిక్ లే.వండర్ఫుల్ గా ఉంది గదూ" వరుణ్ చెప్పాడు.

" ఇది నాకెందుకు చెబుతున్నావు ఇప్పుడు" నేను అడిగాను.

" నీ మీద అదే టెక్నిక్ ప్రయొగించబోతున్నా.నువు ఎలా చావ బోతున్నావు..ఎలా అయితే నీ కిష్టం...నీ గొంతు కోసి చంపాలా లేదా ఊపిరాడకుండా చేసి చంపాలా ...నువు ఆల్రెడీ చనిపోయావు అంతే...చాయిస్ నువు చెప్పు ఎలా చస్తావో" అతని ముఖం లో మళ్ళీ  ఆ దెయ్యపు నవ్వు.

"వరుణ్.."  నేను రోదించసాగాను.చావడానికి భయపడి కాదు.నేను ప్రేమించిన వాడి చేతిలోనే చావవలసి  వస్తోందే అని.

" నీకు ఎవరైనా చెప్పారో లేదో...ఏడ్చినప్పుడే చాలా బాగుంటావు నువు" అలా అంటూ తన బ్యాగ్ వైపు నడిచాడు.

" ఆప్షన్ ఒకటా లేదా రెండా ..చెప్పు " అలా అంటూ పదునైన కత్తి ని తీశాడు బ్యాగ్ లోనుంచి.

నేను దేవుణ్ణి ప్రార్దిస్తూ ఏడవసాగాను.ఈ రూం లో నుంచి బయటపడాలి ఎలాగైనా...తప్పించుకుని ..జీవించాలి..!

" ఏయ్ ..ఎవరు ఆ తలుపు కొట్టేది " అని అంటూ తలుపు దగ్గరకెళ్ళి వాటిని తీశాడు వరుణ్.

" గుణా..నువ్వా ..సరైనా సమయానికి వచ్చావ్...లేకపోతే యామిని బతికుండగా చూసే చాన్స్ మిస్ అయ్యేవాడివి..అఫ్కోర్స్..ఆమె చావడానికి అర్హురాలు ..ఇలాంటి చెడు ప్రవర్తనని మనలాంటి దైవాంశ సంభూతులు సహించరు గదా  " అంటూ మాట్లాడసాగాడు.

విచిత్రం ఏమిటంటే రూం లో మేమిద్దరం తప్ప ఎవరూ లేరు.వరుణ్ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు.పరిస్థితి అర్ధమయింది.పర్సు తీసుకుని మెల్లిగా తలుపు కి దగ్గరగా వచ్చి బతుకు జీవుడా అని దౌడు తీశాను.ఆ విధంగా దేవుడు నా మొరని ఆలకించాడనుకున్నాను. మొత్తానికి ఆటో లో కూలబడి ఏర్ పోర్ట్ కి వచ్చాను.

*   *   *    *
ఆగస్ట్ 20,2013
క్లాస్ లో ప్రొఫెసర్ చెప్పే పాఠం బుర్ర లోకి ఎక్కడం లేదు.క్లాస్ లోనే ఉన్నప్పటికి.ఆ గోవా ట్రిప్ ఇప్పటికీ భయంకరంగా అనిపిస్తోంది.నా బాయ్ ఫ్రెండ్ చేతి లోనే మర్డర్ కావాలసినదాన్ని ..ఏదో దైవం రక్షించి ఉండకబోతే..! నిజానికి వరుణ్ తో బంధం బలపడుతుందనే వెళ్ళా ..కాని అతను ఎలా ప్రవర్తించాడు...చంపేదాకా పోయాడు.ఏది ఏమైనా గాని ఇకమీదట అతడిని అసలు కలవకూడదు.ఓర్పు కి కూడా ఓ హద్దు ఉంటుంది.

క్లాస్ లోనుంచి అంతా బయటకి వస్తున్నారు.క్లాస్ అయిపోవడం తో..!చాలా అలసిపోయాను అన్ని రకాలుగా.ఇదంతా మరిచిపోవాలని జీవితం లో ముందుకెళ్ళాలని నిశ్చయించుకున్నాను.

" హాయ్.." అనే పిలుపు వినబడింది.నేను కూర్చున్న బెంచ్ మీదనుంచే తల తిప్పి చూస్తే ప్రవీణ్.నా క్లాస్ మేట్.

" హాయ్ ప్రవీణ్" నవ్వడానికి ప్రయత్నించాను.

" వారం ట్రిప్ అని చెప్పావు.ఏమిటి ఒక రోజు కే వెనక్కి వచ్చావ్" అడిగాడు.

" అదెందుకులే డ్యూడ్"

" తను నన్ను చక్కగా ట్రీట్ చేయలేదు అని వెయ్యవసారి మాత్రం చెప్పకు"

" ప్లీజ్ ప్రవీణ్..నన్ను ఆటపట్టించకు..రెస్ట్ తీసుకోనీ కొద్దిగా,ఒంటరి గా వదులు నన్ను  "

" నిన్ను నీ మానాన బాధపడేట్లు చెయ్యడం..అది నా వల్ల కాదు.నీ బాధ లో నన్ను పాలుపంచుకోనీ ..కొద్దిగా కూర్చోనీ"

" కూర్చో.కాని ట్రిప్ గురించి ఏమీ అడగకు.ఆ ఒక్కటీ చేయగలవా"

" నిన్ను డిస్టర్బ్ చేయను.హామీ ఇస్తున్నా.నువు మాట్లాడు అనేంత దాకా నేను మాట్లాడను..సరేనా" బెంచ్ పక్కనే కూర్చుంటూ అన్నాడు ప్రవీణ్.అలా పావు గంట గడిచింది.గత ఎనిమిది నెలలు గా నా గాధలన్నీ మాటాడకుండా వింటూ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటున్నాడు.ఎలాంటి సొల్యూషన్ కూడా ఇవ్వడు..అది నాకు నచ్చిన అంశం.

" థాంక్స్" అన్నాను నేను కొద్దిగా ఉన్నతర్వాత. ( సశేషం)     

No comments:

Post a Comment