Monday 21 May 2018

నా పేరు శివ (నవల),post no:58

నా పేరు శివ (నవల),post no:58

చాప్టర్-8

వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు.ఇపుడు సాయంత్రం పావుతక్కువ ఎనిమిది అవుతోంది.ఇక నేను నా కార్యక్రమాన్ని ప్రారంభించాలి.అయితే మొదట మా నాన్న తో మాటాడడం అంటే కొద్దిగా బెరుకు గా ఉంది.ఆయన ప్రిన్స్ పుల్స్ ఆయనవి.స్ట్రిక్ట్ మనిషి.మగ వాళ్ళని నమ్మకూడదు.వాళ్ళు మోసకారులు.ఇవి ఆయన ప్రిన్స్ పుల్స్ లో కొన్ని.ముందుగా మా అమ్మతో మాట్లాడాలి.ఆమెని ఒప్పించడం సులువు.ఏ చిన్న విషయమైన మా అమ్మ తో చెప్పడం ముందునుంచి నాకు అలవాటు.ఒక్క వరుణ్ విషయం తప్ప నా గురించి అన్ని విషయాలూ ఆమె కి తెలుసు.

అమ్మ నా బెడ్ రూం లోకి వచ్చి మాటాడసాగింది.

"ఎంత మంచి కుటుంబమో...కదా" నా పక్కనే కూర్చుని అన్నది అమ్మ.

"అవును" అని,నా అసలు విషయం చెప్పడానికి తయారవసాగాను.విని ఆశ్చర్యం కూడా ఆమె కి కలగవచ్చును.

"కృష్ణ తో ఏం మాట్లాడావు?" అడిగింది అమ్మ.

" పెద్దగా ఏం లేదు.నా జాబ్ గురించి ..అంతే"

"తనకి నువు నచ్చి ఉంటావు,ఆ పెళ్ళి కూడా అయిపోతే మీ అక్క లానే నువు చక్కగా సెటిల్ అయిపోవచ్చు"

"వెళ్ళే ముందు నీతో ఏం చెప్పాడు?"

"నీతో మాట్లాడటం బాగుందని చెప్పాడు.వాళ్ళు వెళ్ళిన తర్వాత నీతో మాట్లాడమని చెప్పాడు"

"వాళ్ళ నిర్ణయం ఏమిటి"

"ఓ రెండు రోజులు ఆగి చెప్తామన్నారు"

"ఓ కె"

"అది సరే..వాళ్ళు వెళ్ళిపోయినతర్వాత నీతో మాటాడమన్నాడు.ఇంతకీ ఏమిటది?ఏమి చెప్పావు అతనితో..?అతను నచ్చలేదు అని మాత్రం చెప్పకు"
"అదేం లేదు,తను మంచి మనిషే"

"నాకు కూడా మంచి కుర్రాడిలా అనిపించాడు.ఆ కుటుంబం కూడా మన లాగానే మంచి ఫ్రెండ్లీ గా ఉండే తరహా అనిపించింది.మీ బావ గారు అక్కని చూసుకోవడానికి వచ్చినపుడు ఎలా అనిపించిందో ఇపుడూ అలా అనిపించింది.నీకు ,కృష్ణ కి జోడీ మంచిగా ఉంటుంది.నువ్వు ఏమంటావు?"

ఇక ఉన్నదంతా చెప్పాల్సిన తరుణం వచ్చేసింది..!

"అమ్మా..నువు అడిగావు గా...ఇందాకా!కృష్ణ నీతో ఏదో మాటాడమని అన్నట్లు..."

"ఆ..అవును" ఆసక్తి గా అన్నది అమ్మ.

"అది నేను చెప్పినదే..!నీతో నూ నాన్న తోనూ చెప్పడానికి భయపడిన సంగతి అది"

"చెప్పు..ఏమిటది"

"నేను ఇంకో వ్యక్తి ని ప్రేమించాను" ఎలాగో చెప్పేశాను.ఆమె రియాక్షన్ కోసం చూశాను.

"ఏమిటి"

"నాకు తెలుసు ఇది నీకు షాకింగ్ గా ఉంటుంది.మీకు బాధ గా కూడా ఉంటుంది.మన కుటుంబ పద్ధతులకి వ్యతిరేకమని..కూడా తెలుసు!అయితే అది నా చేతుల్లో లేదు.అది అలా జరిగిపోయింది.అతని గురించి ఆలోచించకుండా నేను ఉండలేను, సారీ అమ్మ"

"ఏమి చెప్పమంటావు నన్ను" అమ్మ తల పట్టుకుంది.

"నిన్ను చెప్పమని అడగడం లేదు,దయచేసి నేను చెప్పేది అంతా విను..నా వేదన కొంత తగ్గుతుంది"

"మీ నాన్న అగ్గి మీద గుగ్గిలం అవుతాడు ఇది వింటే,నీకు తెలీదా "

" అందుకే నీ సాయం నాకు కావాలి.నాన్న ని నువ్వే ఒప్పించాలి"

"అసలు ఆ అబ్బాయి ఎలాటి మనిషో.."

"ఒకటి చెప్పు.కృష్ణ అంటే నీకు మంచి అభిప్రాయం ఎందుకు కలిగింది..?"

"మర్యాదస్తుడు ఇంకా చక్కగా సెటిల్ అయ్యాడు.అతని కుటుంబం కూడా మంచిది"

"అవునా..!అలానే వరుణ్ కూడా..!అతను నీకు కూడా నచ్చుతాడు.చాలా మంచి మనిషి ..అతని కుటుంబం కూడా మంచిది.అంతే కాదు వరుణ్ కి కేంపస్ ప్లేస్ మెంట్స్ లో జాబ్ కూడా వచ్చింది.అన్నిటికీ మించి తనని ఎంతో ఎక్కువ గా నేను ప్రేమించాను.."
" హ్మ్మ్..ఇంతకీ అతని పేరేమిటన్నావు?"

"వరుణ్ అని,మన పొరుగు వాళ్ళే"

"ఏమిటి నువ్వనేది"

"అవును"

"అయిత అతణ్ణి పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయించుకున్నావా?"

"పెళ్ళి అనేది చేసుకుంటే తననే..!వేరే విధంగా నేను ఊహించలేను.వినడానికి నాటకీయం గా ఉండవచ్చు.నేను చెప్పేది మాత్రం నిజం.అర్ధం చేసుకో అమ్మా"

" ఎంతకాలం నుంచి ప్రేమ లో ఉన్నారు?"

"ఒకటిన్నర ఏడాది బట్టి...సుమారు గా..!ఫోన్ లో మాట్లాడాటుకోవటం..కలిసి బయటకి వెళ్ళడం ఉన్నాయి..కానీ "

"కానీ.."

"నా ప్రేమ గురించి తనకి తెలియదు.నిజం చెప్పాలంటే అతను ఇంకో అమ్మాయి ప్రేమ లో ఉన్నాడు.భయం గానూ ఉంది..నా ప్రేమ ని అంగీకరిస్తాడా ..లేదా అని" నాకు కణ్ణీళ్ళు ఆగలేదు.

"మరి అతనితో చెప్పబోతున్నావా?"


"నీతో మాట్లాడిన వెంటనే అతని తో నేను మాట్లాడుతా.ఒకటి మాత్రం నిజం.తను కాదంటే నేను అవివాహిత గానే మిగిలిపోతాను.ఏదో ఒక రోజున అతనే నా కోసం తిరిగివస్తాడు.."

"నువు చెప్పేది నవ్వులాట గా ఉంది ప్రియ.అందుకేనా నిన్ను పెంచి పెద్ద చేసింది?"

"ఏమో అమ్మా.సారీ..!ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది.నీ కూతురు గానే ఉంటా తప్ప ఎవరో భార్య గా ఉండను"

"సరే..వరుణ్ కి ఫోన్ చెయ్యి.వాళ్ళ పేరేంట్స్ ఒప్పుకుంటే మీ మేరేజ్ జరుగుతుందన్నట్టుగా చెప్పు.ఒకసారి మన ఇంటికి రమ్మను,మీ నాన్న కి ఏదో నచ్చచెబుతా"  
నాలో సంతోషం మొలకలెత్తింది.కృష్ణ చెప్పింది రైట్ అయింది.మా అమ్మ ఎట్టకేలకు అర్ధం చేసుకున్నది నన్ను.

"థాంక్ యూ అమ్మా...!"అని ఆమె ని కౌగలించుకున్నాను.నా నుదుటన ఆమె ముద్దు పెట్టింది.

"ఆల్ ద బెస్ట్ తల్లీ" అంది అమ్మ.

ధైర్యం  కూడదీసుకుని వరుణ్ కి ఫోన్ చేశాను.అమ్మ ని ఒప్పించగలిగాను.వరుణ్ ని కూడా ఒప్పించుతాను.నా మనసు ని దాచుకోవలసిన అవసరం ఇక నాకు లేదు.

" హాయ్..పెళ్ళికొడుకు తో సమావేశం ఎందాకా వచ్చింది?" వరుణ్ ప్రశ్నించాడు అవతల నుంచి.

"నేను తిరస్కరించాను..." చెప్పాను.ఆ మాట అతనికి వేరే వాళ్ళ మీద ఇంటెరెస్ట్ లేనితనాన్ని తెలియబరుస్తుందని ఆశించాను.

"కూల్" మామూలు గా అన్నాడతను.

" అన్నట్టు నువు యామిని ని కలిశావా?" ప్రశ్నించాను.

" మీట్ అయ్యాను"

"ఏమిటి విషయాలు"

"చాలా ఆసక్తికరమైనవి ఉన్నాయి"

" అంటే మళ్ళీ ప్రేమ లో ఉన్నారా?"

"అదేం లేదు.మళ్ళీ చేరువ అవుతాము మేము,నాకు నమ్మకముంది.ఒకసారి పోగొట్టుకున్నా..మళ్ళీ అలా జరగగూడదు"

"అంటే ఇప్పటికీ ఆమె ని నువు ప్రేమిస్తున్నావా?"

"ఏమి ప్రశ్న ప్రియ..!అది మొత్తం నీకు తెలుసుగదా..!ఏదో ఒకరోజు ఆమె నాకోసం మళ్ళీ వెనక్కి వస్తుంది అని చెప్పానా ..లేదా"

"అప్పుడు చెప్పావు లే..!ఈ మధ్యన ఆమె తో మాట్లాడలేదు గా...!అలా ఏం నాతో చెప్పలేదుగా"

"అంటే దాని అర్ధం ఆమె ని ప్రేమించడం లేదని కాదు.."

"ఆమె తో నీకు ఫిజికల్ కాంటాక్ట్ కూడా ఉందా?"

"అవన్నీ రహస్యాలు "

"తెలుసుకోకూడదా నేను"

" లేదు..ప్రియ..లేదు"  (సశేషం)   

Sunday 20 May 2018

నేనే శివ ని (నవల),Post no:57

నేనే శివ ని (నవల),Post no:57

"ఎందుకు..?మా పేరేంట్స్ డిస్టర్బ్ చేస్తున్నారా?" ప్రశ్నించాను నేను.

"అదేం లేదు.నేను మా నాన్న గురించి చెపుతున్నా.అడిగినవీ అడగనవీ అన్నీ నాన్ స్టాప్ గా మాటాడుతున్నాడు చూశారా..?ఆయన వైఖరి మీ అందరకీ బోర్ కొట్టే ఉంటుంది,దానికి నేను సారీ చెపుతున్నా" చెప్పాడు కృష్ణ.నిజానికి ఆ గోల ఏమీ నేను  వినడం లేదు.నా బాధ లో నేను మునిగిఉన్నాను.

"కొంతమందికి వారి విజయాలు చెప్పుకోవడం అలవాటు.దానిదేముంది" ఏదో పైకి అన్నాను అలా..!

"ఎంత అర్ధం చేసుకునే మనసు మీది ...అయితే మా నాన్న వాగుడుకాయ తనాన్ని పెద్దగా తప్పు అనుకోవట్లేదన్నమాట"

"ఆ ..దానిదేముంది లెండి"

" నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా గంటలు గంటలు అలా తినేస్తూనే ఉంటాడు. అవతలవాళ్ళేమో మొహమాటానికి పోయి ఈయన తో బలి అవుతుంటారు.."

"వృద్ధాప్యం లోకి వచ్చినపుడు ఒంటరితనం ఫీల్ అవుతుంటారు.అది అర్ధం చేసుకోదగినదే.."

"వావ్ ప్రియ...నీ జవాబు చాలా బాగుంది.మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళే మంచి మాటలు మాటాడుతారు.నీ మనసు చాలా మంచిది"

"థాంక్స్"

" నువు ఇలా ఉంటావు అనుకుంటే నేను ఒక్కడినే వచ్చేవాడిని.అయితే అది సాంప్రదాయం కాదని వెనకాడాను"

"నో ప్రోబ్లం"

"ఇప్పటికి ఎన్ని సంబంధాలు వచ్చాయి మీకు"

"ఇదే మొదటిది"

"నిజంగా"

"మరి ..మీకు ఇది ఎన్నవ పెళ్ళిచూపులు"

" ఇంతదాకా ఇద్దర్ని చూశాను.ఒకమ్మాయి మరీ అమాయకం టైప్ ఇంకోమ్మాయి లక్ష్యం అంటూ లేని మనిషి"

"నాలోనూ ఆ రెండు లక్షణాలు ఉన్నాయి"

"మీరు చెపితే నేను నమ్మను.అది నేనుగా అనుకోవాలి.చాలా పరిణితి ,విజయం పట్ల ఆకాంక్ష ఈ రెండూ మీలో ఉన్నాయి,రాత్రి కూడా పనిచేస్తున్నారు ..అంటే అదే గదా "

"అంత కష్ట జీవి ని కాదులెండి"

"అలా ఎందుకు అనుకుంటున్నారు.మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారా లేదా నేను చెప్పేదాన్ని ఖండిస్తున్నారా?.."

"నేనే నిజమే చెపుతున్నా"

"మీకు నేను అంటే ఇష్టమేనా"

"మనం అయిదు నిమిషాలే గదా మాటాడింది.ఎలా చెప్పగలను దీని మీద ఆధారపడి"

"పోనీ అలా బయటకి వెడదామా"

"అలాని కాదు"

"దాన్నిబట్టి ఒకటే అయుండాలి.ఎవరినో ప్రేమించి ఉండాలి..అవునా?"

"ఆ..లేదు..లేదు" తల వాల్చి చెప్పాను.

"నాతో అబద్ధం చెప్పవద్దు ప్రియ.నీ ముఖ కవళికళే చెపుతున్నాయి,వినిపించు నీ ప్రేమ కధ.." అతను అడిగాడు.

"ఇది మా పేరేంట్స్ కి చెప్పరుగా .."

"ప్రామిస్"

"థాంక్స్.నేను ఒక వ్యక్తిని ప్రేమించాను తన పేరు వరుణ్.."

"మరి అతను మిమ్మల్ని ప్రేమించాడా?"  
"లేదు.అది ఓ పెద్ద కధ.వినడానికి ఏమైనా అభ్యంతరమా..ఉన్నది  మొత్తం చెపుతాను"

"అలాగే...దానిదేముంది"

"నన్ను కలవకముందు వరుణ్ యామిని అనే అమ్మాయి ని ప్రేమించాడు.ఆమె ఇతడిని కాదని వేరొకరిని ప్రేమించి వెళ్ళిపోయింది.ఆ తర్వాత నేను కలిశాను.తనతో మొదటి మాటలనుంచే ఆకర్షణకి లోనయ్యాను.నిజం చెప్పాలంటే తనని చూడకముందు నుంచే ఆకర్షణ ఏర్పడింది"

" అదెలా సాధ్యం"

"ఇండియా లోని ఓ  పేరున్న ఇంజనీరింగ్ కాలేజ్ లో అతను చదువుతున్నాడు అని వాళ్ళ అమ్మ ద్వారా తెలిసింది.ఆ విధంగా ఒక పుల్ ఏర్పడింది.నా ఫ్రెండ్స్ అంతా తెలివి తేటల్లో అంతంత మాత్రమే"

"ఒకరి ద్వారా తెలుసుకున్నావు అతడిని.."

"వాళ్ళ అమ్మ తరచూ గుళ్ళో కలుస్తూ ఉంటుంది"

"ఆ తర్వాత..."

"వరుణ్ , నేను చేరువ అయ్యాము.ప్రేమ బలపడింది.అతనికి నా ప్రేమ గురించి చెప్పే లోపు ఒక ఊహించని పరిణామం జరిగింది"

"ఏమిటది"

" యామిని మళ్ళీ ఇతని కోసం వెనక్కి వచ్చేసింది.కారణం తెలియదు.వరుణ్ ప్రస్తుతం ఆమె వద్ద కి వెళ్ళాడు"

"అదేం ప్రేమ...! వరుణ్ ని విడిచి పెట్టేసి..మళ్ళీ వెనక్కి రావడం ఏమిటి..?అందరూ ఆమె ఆడించినట్లు ఆడాలా?"

"నా గుండె బద్దలయినట్లుగా అయింది.ఇంకో ప్రధాన కారణం కూడా ఉంది"

"ఏమిటి"

" మా పేరేంట్స్ కి ఇదంతా చెప్పే ధైర్యం లేదు.వాళ్ళేమో ఇలా సంబంధాలు తెస్తున్నారు.మీరు జెంటిల్ మేన్ లా ఉన్నారు.అందరూ అలా ఉండరు గదా"

"నిజమే"

"ఏదో రోజున ఎవరినో కట్టుకోక తప్పదు.వరుణ్ ని నా పొరబాటు ఏమీ లేకపోయినా పెళ్ళి చేసుకోలేకపోయేనే అని విచారిస్తూ..కాలం గడపవలసిందే గా"

"ఇప్పుడు మీకు ఓ ఆలోచన చెప్పనా?"

"దయచేసి చెప్పండి"
"రెండు మార్గాల్లో వెళ్ళవచ్చు.ఒకటి వరుణ్ గురించి మీ పేరేంట్స్ కి ధైర్యంగా చెప్పాలి.నాకు తెలుసు..మీరు భయపడుతున్నారని..కాని దాన్ని అధిగమించాలి.మీ బాధ ని తప్పకుండా వాళ్ళు అర్ధం చేసుకుంటారు.మీకు సపోర్ట్ గా ఉంటారు.."

"వాళ్ళు నన్ను తిట్టరూ.."

"ప్రియ..నువు ఇపుడు మేజర్ వి.ఇంకా జాబ్ కూడా ఉంది.నీకు నచ్చిన వ్యక్తిని నువు పెళ్ళి చేసుకోవచ్చు.ఓర్పు గా వారిని ఒప్పించు.చూడటానికి వాళ్ళు మంచి వాళ్ళు గా నే ఉన్నారు.నిన్ను అర్ధం చేసుకుంటారు..వేరేలా ఎందుకు భావిస్తున్నావు?"

"అయితే ఈ రోజు రాత్రి కే వాళ్ళ తో మాటాడుతా"

"అది అలా ఉండాలి.రెండో దారి ఏమిటంటే..వరుణ్ కి కాల్ చెయ్యి.తనని మీ పేరేంట్స్ తో మాటాడమను.ఒక ఫ్రెండ్ గానే కాదు జీవిత భాగస్వామి గా తనని ఎంచుకున్నట్లు చెప్పు.నిజంగా నీ ప్రేమ నిజమే అయితే అతని లో నీ పట్ల సానుకూలతే ఏర్పడుతుంది.కొన్నిసార్లు వింతలు జరుగుతాయి ప్రేమ లో"

"హ్మ్మ్"

" కొంత ధైర్యమూ కావాలి..ఈ దారుల్లో వెళ్ళాలంటే..!నీ లక్ష్యాన్ని వెంటాడడం లో తప్పు లేదు.అది నువ్వు ఇపుడు చేయాలి"

"ఇపుడు హాయి గా ఉంది.నువు ఇలా నా మంచి కోరుతావని అసలు ఊహించలేదు.థాంక్స్ ఎ లాట్"

"సరే..సక్సెస్ అయిన తర్వాత నాకు ఆ మంచి వార్త చెప్పు..నీ పెళ్ళికి కూడా నన్ను పిలువు"

"తప్పకుండా" నవ్వుతూ చెప్పాను.

"చాలా బావుంది " నాకు షేక్ హేండ్ ఇస్తూ చెప్పాడు కృష్ణ.

"మీ పెళ్ళికూతురి వేట ఫలించాలి అని కోరుకుంటున్నా" చెప్పాను.
"తప్పకుండా నీ లాంటి ఒక పెళ్ళికుమార్తె నాకు దొరుకుతుంది..కూల్" చెప్పాడతను.

"ఆ నమ్మకం ఉంది నాకు"

"సరే..ఇక మేము బయలుదేరుతాము మరి" అతను బయటకి వెళ్ళగా నేను రూం లోనే ఉండిపోయాను.

కృష్ణ నిజంగా ఒక మంచి మనిషి.అతను చెప్పిన సలహా నాకు బాగా నచ్చింది.ఒక రకంగా ఓ మోటివేషన్ సెమినార్ లా సాగిపోయింది మా సంభాషణ.నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది మా పేరేంట్స్ తో నా ప్రేమ గురించి చెప్పడానికి..!నా ప్రేమ శక్తి వరుణ్ ని నాకు దగ్గర చేస్తుంది.నేను ప్రయత్నించాల్సిన సమయం ఆసన్నమయింది.నా తల్లిదండ్రుల తోను,వరుణ్ తోను మాటాడవలసిన సమయం ఇది. (సశేషం)

Saturday 19 May 2018

నా పేరు శివ (నవల),Post no:56

నా పేరు శివ (నవల),Post no:56

పార్ట్-5, "ప్రియ" చెబుతున్నది

చాప్టర్-17

నేను వరుణ్ ని ప్రేమించాను.గతం లో అశ్విన్ ని,సుబ్రమణిని ప్రేమించినట్లుగా గాక చాలా లోతుగా ప్రేమించాను.వరుణ్ తో మాటాడుతుంటే ఎంతో సౌకర్యంగా ఉండేది.అది వేరే ఎవరి వద్దా దొరకనిది.మేము ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేది.అతడిని కలవకముందే నేను తన పట్ల ఆకర్షింపబడ్డాను.వరుణ్ వాళ్ళ అమ్మ గుడిలో కలిసినపుడు తన కొడుకు MIIT చదువుతున్నాడని చెప్పినపుడు నాకు ఒక ఆకర్షణ జనించింది.అతడిని కలిసే రోజు కోసం చూశాను.మొదటిసారి అతడిని కలిసే అవకాశం రావడం అది ఇంకా ధృఢ బంధం గా మారింది.

అతని మొహం లోని అమాయకత్వం...నాలో సింపతీ ని రేపింది.అనారోగ్యం వల్ల కలిగిన ఒక నెమ్మది తనమూ ..తనని బాగు చేసే ఒక అవకాశం కలగడమూ దేవుడు ఇచ్చిన వరం లా అనిపించింది.అతడిని ఆనందకరం గా ఉంచడానికి నేను చేసిన యత్నము బలమైన ప్రేమ గా మారింది నాలో..!వరుణ్ చనిపోవడానికి ప్రయత్నం చేసిన ఆ తరుణం లో నాకు ఆ పీడకల రావడం ఏమిటి..అది దేవుడు తనకి కల్పించిన కల యే.లేకపోతే ఆ రోజున వరుణ్ చనిపోయి ఉంటే నాకు ఎప్పటికీ విచారమే మిగిలేది.

కాలం గడుస్తున్నకొద్దీ మేము దగ్గర అవసాగాము.అది నిజమైన ప్రేమ గా పరిణమించింది.నా ఫీలింగ్స్ ని అర్ధం చేసుకొని ప్రతి స్పందిస్తాడని ఆశించసాగాను.ఇదిగో ఈ చివరి క్షణం దాకా..!నా పాత కధల వలె ఈసారి విఫలమవడం నాకు ఇష్టం లేదు.ఆలశ్యం కాకముందే నా ప్రేమని వ్యక్తపరచాలి.అయితే దానిలో విషాదమే మిగిలింది.

వరుణ్ గురించి నా తల్లితండ్రులకి ఎప్పుడూ నేను చెప్పలేదు.అంత ధైర్యం నాకు లేకపోయింది.వాళ్ళు సంప్రదాయ తరహా లో ఆలోచించే మనుషులు.ప్రేమ గీమ అనేది అంగీకరించరు.అబ్బాయిని వాళ్ళే వెతికి పెడితే నేను తాళి కట్టించుకోవాలి.చిన్ననాటి నుంచి వారి పెంపకం చెప్పేదదే.వాళ్ళ ఉద్దేశ్యం లో తాను ఇంకా చినపిల్ల నే.నూటికి తొంభైమంది పేరేంట్స్ లాగే వాళ్ళూనూ.
నాకు ఈ రోజు ఓ షాక్ లా అనిపించింది.ఎందుకంటే నా తల్లిదండ్రులు చూసిన సంబంధం వాళ్ళు నన్ను చూడటానికి వస్తున్నారు.పెళ్ళికొడుకు,అతని తల్లి దండులు ఈ రోజు ఏ నిమిషాన్నైనా రావచ్చును.మా అమ్మ తో వరుణ్ గురించి చెప్పే ధైర్యం నాకు లేదు.నా తల్లిదండ్రులతో ఉన్నదాన్ని చెప్పలేకపోయాను.దాని పర్యవసానాలు అనుభవించాల్సిందే ..!అనుభవిస్తున్నాను.

ఇది చాలాదన్నట్లు ఇదే సమయం లో యామిని ని కలవడానికి వరుణ్ వెళ్ళడమేమిటి..!?నాతో కనీసం సరిగా జవాబు చెప్పే మూడ్ లో కూడా లేడు.పెళ్ళికొడుకు వస్తున్నా ,ఆ సంగతి ని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.వరసగా మూడు సార్లు ఇలా జరగడమేమిటి నాకు..?నా ప్రేమ సక్సెస్ రేటు జీరో శాతమే...విచారించదగ్గ విషయమే..!

నా ప్రేమ ని వరుణ్ పట్టించుకోకపోవడం ఏమిటి..?యామిని వెంట బడటమేమిటి..?నా జీవితం ఇలా కావడం ఏమిటి..?

ఆలోచిస్తూ ఉండగానే డోర్ బెల్ మోగింది.నా చికాకు ని పెళ్ళివాళ్ళ మీద చూపించకుండా మర్యాద గానే సంబంధాన్ని తిరస్కరించాలనే ఆలోచనకొచ్చాను.వరుణ్ నా కోసం వెనక్కి రావడానికి దారి తర్వాత యోచించాలి.ఏమో..అది ప్రేమ నా..లేక ఆబ్సెషనా ..?అతడిని వదిలే పనే లేదు.పరిస్థితులు ఎలా ఉన్నా నా వంతు ప్రయత్నం చేయకుండా వదిలేది లేదు.

"రండి..రండి.."అంటూ మా అమ్మ పెళ్ళి కొడుకు వాళ్ళని ఆహ్వానించింది.వాళ్ళు లోనికి వచ్చి కూర్చున్నారు.మా నాన్న కూడా వాళ్ళ తో హాల్ లో కూర్చున్నాడు.

""ఎలా ఉన్నారు" పెళ్ళి కొడుకు వాళ్ళ తండ్రి మా కుటుంబాన్ని పరామర్శ చేశాడు.మేము అంతా కూర్చున్నాము.

" మేము అంతా బాగున్నాం సార్..మా ఇల్లు సులభంగా నే దొరికిందిగా " మా నాన్న వాళ్ళని అడిగాడు.

"మరీ అంత ఈజీ గా కాదు గానీ..ఎలాగో దొరకబుచ్చుకున్నాము" పెళ్ళి కొడుకు తండ్రి నవ్వుతూ చెప్పాడు.

పెళ్ళికొడుకు ని చూస్తే అమాయకుని లా గుళ్ళో పూజారి గా ఉండవలసిన వ్యక్తి లా అనిపించాడు.మనిషి పరవాలేదు.తల వెంట్రుకల్ని పక్కకని దువ్వుకున్నాడు.కళ్ళద్దాల పవర్ బాగా నే ఉన్నట్లుంది.బాగా చదివే మనిషి లా తోచాడు.

"సంతోషం..ఈమె మా అమ్మాయి ప్రియ" అంటూ మా నాన్న అతనికి పరిచయం చేశాడు.

"హలో.." నేనే అన్నాను ఆ ముగ్గురి తో..!వాళ్ళు తేరిపార నా వైపు చూశారు.
"నా పేరు కృష్ణ.ప్లెజర్ టు మీట్  యూ..!" పెళ్ళికొడుకు నవ్వుతూ చెప్పాడు.

"నా పేరు ప్రియ" నవ్వుతూ చెప్పాను.

"కాఫీ గాని టీ గాని తీసుకొస్తాను మరి" మా అమ్మ అన్నది.

"నేను ఏదీ తాగనమ్మా..!మా అబ్బాయి,నా భార్య మాత్రం టీ తాగుతారు ..వాళ్ళకి రెండు కప్ లు మాత్రం తెస్తే చాలు" పెళ్ళికొడుకు తండ్రి అన్నాడు.

"సరేనండి" అని మా అమ్మ కిచెన్ లోకి వెళ్ళింది.

"ప్రియ కి ఎంతమంది తోబుట్టువులు?" పెళ్ళికొడుకు తండ్రి అడిగాడు.

"ప్రియ కి ఒక అక్క.ఆ అమ్మాయి పెళ్ళయి సింగపూర్ లో ఉంటున్నది.ప్రియ పెళ్ళి లో ఆమె ని చూడవచ్చు.."మా నాన్న చెప్పాడు .పాపం ఆయనకి మాత్రం ఏం తెలుసు..నా పెళ్ళి అయితే వరుణ్ తో నేనని..!

"నాకు ఇంకో అబ్బాయి ఉన్నాడు.వాడు చిన్నవాడు..లా చేస్తున్నాడు ప్రస్తుతం" పెళ్ళికొడుకు తండ్రి అన్నాడు.

"అంటే కృష్ణ చార్టెడ్ అకౌంటెంట్ ..అంతే గదా" మా నాన్న అన్నాడు.

"అవును అంకుల్ ..నా పని లో నేను ఎంతో ఆనందిస్తాను" కృష్ణ సమాధానమిచ్చాడు.

"మీలా వృత్తిని ప్రేమించేవారంటే నాకు చాలా ఇష్టం" మా నాన్న కితాబిచ్చాడు.

"మీ జాబ్ అంటే మీకు ఇష్టమేనా "పెళ్ళికొడుకు అడిగాడు నన్ను.

"ఫర్వాలేదు.సమస్యలు ఏమీ లేవు" చెప్పాను.

"నైట్ షిఫ్ట్ లు ఉంటాయా" ఆ తండ్రి అడిగాడు.

"ఉంటాయి అంకుల్" అన్నాను.

"రెండు షిఫ్ట్ ల లో నీకు ఏది ఇష్టం" పెళ్ళికొడుకు ప్రశ్నించాడు.

" ఎనిమిది గంటలు నిద్ర ఉంటే చాలు.ఏ షిఫ్ట్ అయినా ఒకటే" నా సమాధానం అది.

"అలాని కాదు.రెండిటిలో ఏ షిఫ్ట్ ని ప్రిఫర్ చేస్తారు" తను అడిగాడు.

"పగలు షిఫ్ట్ నే ప్రిఫర్ చేస్తా" చెప్పాను.
మా అమ్మ టీ లు తెచ్చి ఇచ్చింది.నేను తప్ప మిగతా అంతా మాటల్లో మునిగిఉన్నారు.వరుణ్ గూర్చి ఆలోచిస్తూ నే టీ ని తాగాను.అక్కడ యామిని తో వరుణ్..ఇక్కడ యేమో ఈ బోరింగ్ మనిషి ఇంకా కుటుంబం తో నేను..!

నా లోపల అసూయ బుసలు కొట్టింది.యామిని కంటే నేనే వరుణ్ కి తగినదాన్ని.నా నుంచి  తన్నుకు పోయిది ..ఎంత ఇది ఆ యామిని కి..?ఆలోచిస్తున్నకొద్దీ నిరాశ కమ్ముకొస్తున్నది.వరుణ్ తో మాట్లాడాలని అనిపించింది.అతని ఫీలింగ్స్ ఏమిటో తెలుసుకోవడానికి..!

"మీరు పెద్ద గా మాట్లాడరా ..ఏమిటి?" పెళ్ళి కొడుకు ప్రశ్నించాడు.

"అదేమీ లేదు" ఏదో కవర్ చేశాను.

"మీరు వర్రీ గాకండి..మా అమ్మాయి మాట్లాడటం మొదలుపెడితే ఆపడం కష్టం..కొద్ది గా సిగ్గు అనేది ఉంటుంది గా ..అదీ విషయం" మా నాన్న చెప్పుకుపోతున్నాడు.

" అంకుల్..మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయి తో ఓ పది నిమిషాలు మాటాడవచ్చా ..?" పెళ్ళికొడుకు అడిగాడు.

"అబ్బే నాకేం అబ్జక్షన్ లేదు..ప్రియ నీకూ" మా నాన్న అడిగాడు నన్ను.

" లేదు నాన్న" అన్నాను.ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి ఇది ఒక మంచి చాన్స్ లే అనిపించింది నాకు.

నేను,అతను ఒక రూం లోకి వెళ్ళాము.ఓ మంచం మీద కూర్చున్నాము.

"సరే..ఎలాంటి సంకోచం లేకుండా మాటాడుకుందాము" అన్నాడతను..! (సశేషం)    

Wednesday 16 May 2018

నా పేరు శివ (నవల),Post no:55

నా పేరు శివ (నవల),Post no:55

"హలో" అన్నాను.

"వరుణ్,ఒక పెద్ద ట్రాజెడి ఓ గంట లో జరగబోతోంది..."అన్నది ప్రియ.

"ఏమిటది"

"మా అమ్మ వాళ్ళు సంబంధం చూస్తున్నారు నాకు అని చెప్పా గదా ,వాళ్ళు రాబోతున్నారు"

"అయితే ఏమిటి దానివల్ల"

" ఏమిటి..నీకు ఎలాటి బాధ లేదా ..?వేరే వ్యక్తి తో మాటాడుతుంటే"

"బాధ దేనికి?"

"నిజంగా ఎలాటి బాధ లేదా?"

"లేదు"

"పెళ్ళి కొడుకు ని చూసే మూడ్ అసలు లేదు నాకు,అందునా ఎవరో కొత్త వ్యక్తిని"

"అలా అంటే నీ భవిష్యత్ ఎలా?"

"ఏడుపు వస్తోంది వరుణ్"

"అసలు విషయం చెప్పు"

"నీకు అర్ధం కాలేదా ?"

"ఇప్పుడు నేను ఏకాగ్రత చూపే మూడ్ లో నేను.నా కోసం ప్రవీణ్ ని విడిచిపెట్టింది యామిని.ఆమె కోసం ఇప్పుడు వెళుతున్నా"

"అంటే..నీ అర్ధం మళ్ళీ యామిని కోసం వెళుతున్నావా?"

" నేను సరిగా ఆలోచించే స్థితి లో లేను.చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి నాకు.ముందు యామిని ని కలిసి ఆ తర్వాత నిన్ను కలుస్తాను"

"ఓకె...ఆల్ ద బెస్ట్"

" థాంక్స్..బాయ్"

" బాయ్"

ప్రవీణ్ ఇచ్చిన అడ్రెస్ చూశాను.ఆమె ఇల్లు వడపళని లో ఉంది.నేను ఇప్పుడున్నది మైలా పూర్ లో..!ఆటో పిలిచి ఎక్కాను.ఇప్పుడు మా ముగ్గురి గురించి ఆలోచిస్తూ సమాచారాన్ని విశ్లేషించుకుంటున్నాను.తెగిపోయిన లింక్ ల్ని కలుపుకుంటున్నాను.నా షిజోఫ్రెనియ అవస్థ లో నేను ప్రవర్తించిన విధానానికి యామిని నన్ను విడిచివెళ్ళింది.కాబట్టి ఆమెనీ తప్పనడానికి లేదు.నన్నూ అనుకోవడానికి లేదు,ఏం చేస్తున్నానో ఆ రోజుల్లో నాకూ తెలీదు కాబట్టి..!
యామిని విడిచిపెట్టి వెళ్ళినందుకు ప్రవీణ్ బాధ పడుతున్నాడు.అతని తో మాట్లాడినతరువాత నా కనిపించింది ఏమిటంటే ముందర నేను అనుకున్నంత చెడ్డవాడు కాదు తను..!నిజం చెప్పాలంటే యామిని అతడిని విడిచి పెట్టి వెళ్ళడం కూడా సబబు కాదు.నా మానసిక స్థితి కారణం గా ప్రవీణ్ కి ఆమె చేరువ అయి ఉండవచ్చును.అయితే నా మీద ఉన్న కొన్ని ఫీలింగ్స్ వల్ల అతనితోనూ ఉండలేకపోయింది.

ఇపుడు యామిని ని కలిసి ఆమె ఎందుకు అలా చేసిందో తెలుసుకోవాలి.ఆటో దిగాను.ఆమె ఉండే అపార్ట్మెంట్ రోడ్ కి దగ్గర గానే ఉంది.వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను.చాలా రెస్ట్ లెస్ గా ఉంది నా లోపల..!

"వరుణ్..! వాటె ప్లెజంట్ సర్ప్రైజ్ " తలుపు తెరిచి నేను కనబడటం తో అన్నది యామిని.

"నేను లోపలకి రావచ్చా" అడిగాను.ఆమె మొహం లో సంతోషం.

"తప్పకుండా .."

లోనికి వచ్చి సోఫా లో కూర్చున్నాను.

"నేను ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలుసు" పక్కనే కూర్చుంటూ అన్నదామె.

"నీ అద్రెస్ ప్రవీణ్ ఇచ్చాడు" చెప్పాను.

"ప్రవీణ్ ని నువు కలిశావా?"

"అవును.ప్రవీణ్ తో నీకు బ్రేక్ అప్ అయిన తవాత నాకు ఎందుకు కాల్ చేయలేదు?"


"కొన్నాళ్ళు ఇలా సింగిల్ గా ఉండడం మంచిది అనిపించింది"
"ఎలా అనిపిస్తోంది"

"బాగుంది.నీతో ఉండటానికే నేను ఇష్టపడతాను.అప్పటికి రెండు మూడు సార్లు ఫోన్ చేశాను"

"అది సరే..మరి ప్రవీణ్ ని ఎందుకు వదిలివేశావు?"

"చెప్పాలంటే అది కాంప్లికేటేడ్ విషయం"

"నాకు వివరించు"

"నిన్ను పూర్తి గా నాలోనుంచి తొలగించుకోలేకపోయాను.ప్రవీణ్ తో బాగానే ఉన్నా,మా రిలేషన్ షిప్ లో ఏదో లోపించింది.చాలా మొనాటనస్ గా డల్ గా అనిపించసాగింది.అందునా నాలాంటి మార్పు తో జీవించాలనుకునే వ్యక్తి కి..!అది అతని నుంచి పొందలేకపోయాను.ఎందుకో ఒక నెర్వస్ గా అనిపించింది.అది ఇందుకే అని చెప్పలేను"

"కంగారు పడకు..ఆ నెర్వస్ నెస్ త్వరలో పోతుంది"

"ఆలోచిస్తే..అనిపించేది ఏమంటే నీకు నాకు మధ్య అయిన గొడవలు వంటివి అతనితో లేకపోవడం కూడా ఓ కారణం కావచ్చు.కొన్ని సార్లు అలాటివి బంధం ధృఢపడటానికి సహకరిస్తాయి.మీ ఫ్రెండ్ రాం చెప్పినది కూడా కరెక్టే అనిపిస్తోంది.."

"రాం కి థాంక్స్ చెప్పాల్సిందే"

"నేను ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నా..చెప్పు..!ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా?"

"ఆవును.."

"ఇప్పటికీ నా..?" (సశేషం)   

నా పేరు శివ (నవల),Post no:54

నా పేరు శివ (నవల),Post no:54

మార్చ్ 1,2015

"హాయ్..వరుణ్! లోపలకి రా" ప్రవీణ్ తలుపు తీసి ఆహ్వానించాడు.

"తప్పకుండా" అని లోపలకి వెళ్ళాను.

నా బ్యాగ్ లో పదునైన కత్తి ని పెట్టుకొని వచ్చాను.గుణ చెప్పినట్లుగా ప్రవీణ్ ఎంత బతిమాలినా వినకుండా పొడిచి వేయడమే..!ఈ పని చేయబోయే ముందు కొద్దిసేపు వీడితో మాటాడదాము ,పోయిందేముంది..!అసలు ఫోన్ ఎందుకు చేశాడు నాకు..అది కూడా తెలుసుకున్నట్లు ఉంటుందిగా..!

"ఆ..వరుణ్..కొద్ది గా మందు తీసుకుంటావా?" ప్రవీణ్ అడిగాడు నేను సోఫా లో కూర్చున్న తర్వాత.

"నో ..థాంక్స్..ఇపుడు నేను తాగడం లేదు." చెప్పాను.

"సరే..నేను తీసుకుంటా..నీకు అబ్జక్షన్ లేదుగా"

" నో ప్రోబ్లం..కానీ డ్యూడ్"

" ఇదివరకు నీ ఫేవరేట్ డ్రింక్ ఏమిటి..?" తను మందు పోసుకొని ఐస్ వేసుకుంటూ అడిగాడు ప్రవీణ్.

"బీర్" చెప్పాను.ఇంతకీ అసలు విషయానికి వస్తాడా వీడు అనిపించింది.

"ఓ.కె.కాలేజ్ రోజుల్లో చీప్ విస్కీ తాగేవాణ్ణి.మా యింటి దగ్గర్నుంచి ఎక్కువ డబ్బులు పంపించకపోవడం మూలాన..!" అతను సిప్ చేస్తూ చెప్పాడు.

" నిజమా"

"ఇప్పుడు నేను స్కాచ్ తాగుతున్నా.ఎందుకంటే బాగా సంపాదిస్తున్నా కాబట్టి"

"మంచిది"

" నువు ఎప్పుడైనా స్కాచ్ తాగావా?"

"లేదు"

"ట్రై చెయ్..విస్కీ కంటే స్కాచ్ సూపర్ గా ఉంటుంది,కనీసం విస్కీ అయినా రుచి చూశావా "

" ఆ చూశా"

"అంటే రెండిట్లో ఏది నీకు ఇష్టం..బీర్ లేదా విస్కీ?"

"బీర్"

" ఏంటి పొడి పొడి గా చెబుతున్నావు..బోర్ కొడుతున్నానా?"

"ఏదో మాట్లాడాలి..రమ్మన్నావు గా ..!ఆ విషయం ఏమిటి..అక్కడికి రా"

"ఇప్పుడిప్పుడే కిక్ ఎక్కుతోంది..సరే ..! నీకు తెలుసుకోవాలని ఉందిగా "

" ఔను డ్యూడ్"
"దానికంటే ముందు,నీ గురించి ఒకటి చెబుతా ఏమీ అనుకోనంటే.."

"సరే చెప్పు"

"ప్రతి ఒక్కరు తమ గురించి చెప్పేదాన్ని ఇష్టపడతారు.నీ గురించి చెబుతున్నందుకు నన్ను నువు అభినందించాలి" ప్రవీణ్ నవ్వుతూ చెప్పాడు.నేనూ మర్యాదకి ఇకిలించాను.

"నువు గిటార్ వాయించడం లో గొప్పోడివి కావచ్చు,చదువు లో గొప్పోడివి కావచ్చు,హృదయపరంగా గొప్పోడివి కావచ్చు..కాని ఒక దాంట్లో మాత్రం నువు జీరో అని చెప్పొచ్చు"

"అర్ధం కాలేదు"

"రిలేషన్షిప్ ని నిలబెట్టుకోవడం లో నువు వేస్ట్ గాడివని చెప్పొచ్చు.నీ గర్ల్ ఫ్రెండ్ తో ఎలా హేపీగా ఉండాలో,ఉంచాలో నీకు తెలీదు,నిజమేగా "అడిగాడు ప్రవీణ్.తల ఊపాను.చాలా ఎక్కువ చేశాడు వీడు ఇప్పటికే..ఇంకా ఎంతసేపులే..!

మళ్ళీ ప్రవీణే అన్నాడు "నువు యామిని ని చెత్త లా చూశావు.ఆమెని బాగా బాధించావు.నీ రెండో గోవా ట్రిప్ లో నువు ఏం చేశావో తెలుసా"

"నాకు తెలీదు" అన్నాను.అయినా ప్రతి ఒక్కరు ఆ రెండో ట్రిప్ గురించే చెబుతున్నారు.ఏమి చేశానో అప్పుడు..?

"నువు ఆమె ని చంపడానికి ప్రయత్నించావు" గొంతు పెంచి చెప్పాడు ప్రవీణ్.

"ఏమి వాగుతున్నావు నువు..?" నేను షాక్ తిన్నాను.వీడు ఏదో ట్రిక్ చేస్తున్నాడు అనిపించింది.
"నీతో ఎప్పుడూ ఆ కత్తి ఉండేది.ఆ సూర్య ని చంపడానికి ఉపయోగించావే అది.ఏ తప్పు లేకుండా యామిని ని చంపడానికి ప్రయత్నించావు ఆ రోజు.ఆమె నాకు అంతా చెప్పింది డ్యూడ్.అయితే ఇది పోలీస్ లకి చెప్పకూడదని నాతో ప్రామిస్ చేయించింది.ఈ రోజు దాకా నేను ఎవరకీ ఇది చెప్పలేదు.అందుకు నువ్వు నాకు థాంక్స్ చెప్పుకోవాలి" ప్రవీణ్ వివరించాడు.

"థాంక్ యూ" అన్నాను.నాలో దేవినట్లుగా అయింది.

యామిని నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయింది అనేది నాకిప్పుడు తెలిసింది.ఆమె ఆ రెండో గోవా ట్రిప్ లో నాతో మంచిగా ఉండాలని బంధం బలపడాలని ప్రయత్నించే ఉంటుంది గాని నేను పొడవడానికి ఒడి గట్టానంటే అప్పుడు నా స్థితి ఎంత దారుణంగా ఉన్నదో మానసికంగా..!యామిని ని పొందే అర్హత నాకు లేదు.అసలు ఈ ప్రపంచం లో ఇలా తిరిగే అర్హత కూడా నాకు లేదు.నేను పిచ్చి ఆసుపత్రి లో ఉండదగిన వాడిని.

"ఆమె అలా ఎనిమిది నెలలు బాధ పడింది.నేను ప్రేమించిన ఆ అమ్మాయి అలా ఉండటం నాకు ఎంతో బాధ కలిగించింది.." అన్నాడు ప్రవీణ్.

"నువు ప్రేమించడం ఏమిటి..?" ప్రశ్నించాను.

" నీ కంటే ముందు నుంచే ఆమె ని నేను ప్రేమిస్తున్నాను.అయితే ఆమె తో చెప్పే ధైర్యం నేను చేయలేకపోయాను.మీ మొదటి గోవా ట్రిప్ గురించి ఆమె నాకు చెప్పినపుడు నాకు నిద్ర పట్టలేదు.నా ప్రియురాల్ని దూరం చేసిన నీ మీద నాకు ఎంతో కోపం వచ్చింది.." ప్రవీణ్ చెప్పిన ఈ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.అతడి నుంచి నేను దొంగిలించానా ఆమె ని అని..!

"నేను.."

"నేనే గనక నీలా సైకో ని అయితే ఈ చేతులతో నిన్ను చంపి ఉండేవాడిని.అంత కోపం వచ్చింది" ప్రవీణ్ ఊగిపోయాడు.

నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు.
"ఏమైతేనేం..చివరకి ,ఆమె కి నా ప్రేమ ని తెలియబరిచాను.ఆ అద్భుతమైన రోజు నాకు గుర్తుంది.అక్టోబర్ పద్నాలుగు,రెండువేల పదమూడు.ఆ రోజున నా మీద కాంతి పుంజం విరిసింది"

"ఆ తర్వాత ఏం జరిగింది"

"ఆ తర్వాత కొన్ని రోజులు బాగా గడిచాయి.అవి గుర్తుంచుకోదగిన రోజులు నాకు.అయితే ఈ మధ్య.." చిన్న గొంతు తో చెప్పాడు ప్రవీణ్.

" ఆ..ఏమైంది..చెప్పు" చాలా ఆత్రుత గా అడిగాను.

"ఇప్పటికి నిన్ను ఆమె ప్రేమిస్తోంది.నాతో రిలేషన్ లో ఉండటం ని ఓ పొరబాటు గానే భావిస్తోంది.రెండు రోజుల క్రితమే ఇది నేను తెలుసుకున్నాను.కారణం నాకు తెలీదు.నీ వేపు మొగ్గు ఉన్నది ఆమె లో.నా ఓటమి ని అంగీకరించడానికే నీకు ఫోన్ చేశాను.నీ ప్రేమ నా ప్రేమ కంటే గట్టిది.అది నిరూపించావు."అలా చెప్పి ప్రవీణ్ చిరునవ్వు చిందించాడు.తను లోపల గాయపడిన విషయం నేను తెలుసుకున్నట్లు పసిగట్టాడు.

"ఐ యాం సారీ,డ్యూడ్..!" చెప్పాను. ప్రవీణ్ ని చంపే ఆలోచన ని విరమించుకున్నాను.ఇప్పుడు గుణ ఉన్నా నన్ను కాదనలేడు.తనూ బాధ పడతాడు కూడా.

"నీ హృదయం ఎంత గాయపడిందీ నేను తెలుసుకోగలను..బ్రో" అంటూ తను నా దగ్గరకి వచ్చి హత్తుకున్నాడు.పరిస్థితి ఇలా అవుతుందని నేను అసలు ఊహించలేదు.చివరకి నేను ప్రవీణ్ ని ఓదార్చవలసి వచ్చింది.

"ఇంకా ఏం చెప్పాలో తెలియడం లేదు బ్రో" అన్నాను.

"ఇప్పుడు యామిని చెన్నై లో పనిచేస్తోంది.ఇదిగో అడ్రెస్ తీసుకో..!వెళ్ళి కలువు..సర్ప్రైజ్ చెయ్యి...ఆమె నిన్ను ఇంత త్వరగా అసలు ఊహించదు"అంటూ ప్రవీణ్ నా చేతి లో ఓ కాగితం ముక్క పెట్టాడు.

"నువ్వు బాగానే ఉన్నావు గా ..ష్యూర్" అడిగాను తనని.

"ఇక ఆమెని నా జీవితం లో భాగంగా పరిగణించలేను.నేను మర్చిపోతాను.కష్టమే ..కానీ ఎలాగోలా నా దారి లో నేను వెళ్ళిపోతాను " చెప్పాడు ప్రవీణ్.

"ఐ విష్ యూ లక్" చెప్పి వెళ్ళడానికి సిద్ధపడ్డాను.

"ఈసారి అయినా మంచిగా ఉండటానికి ప్రయత్నించు..ఆల్ ద బెస్ట్,ఆనందం తో ఉండండి "

" ఓ కె" అలా చెప్పి వేగంగా బయటకి నడిచాను.

ఇపుడు నాకు ముగ్గురు మీద జాలి కలుగుతోంది.యామిని మీద..అలాంటి భయంకరమైన అనుభూతుల్ని పొందినందుకు..!ప్రవీణ్ మీద..ఆమె ఇతడిని వీడి పోయినందుకు..!చివరిగా నామీద,ఇంత సైకోపాత్ కిల్లర్ గా అయినందుకు..!

ప్రియ నుంచి కాల్ రావడం తో ఆ విషయం మీద ఆలోచిస్తున్నాను..!(సశేషం)   

Tuesday 15 May 2018

నా పేరు శివ (నవల),Post no:53

నా పేరు శివ (నవల),Post no:53

ఫిబ్రవరి 28,2015

ఈ శనివారం సస్పెన్స్ తో నిండిపోయింది.అజయ్ కి ఉన్న ఇంటర్ వ్యూ వల్ల.అతని రిజల్ట్ ఏమవుతుందో అని నాకు ఆతురత గా ఉంది.ప్రియ వాళ్ళ కంపెనీ లోనే అతని ఇంటర్వ్యూ.ఈ చాన్స్ లో గాని తనకి జాబ్ రాకపోతే కష్టమే..!ప్రతి చోటా రిఫరల్ కావాలి ,అది దొరకడం మళ్ళీ ప్రయాస తో కూడుకున్నది.ఆందోళన గా ఉండి ఓ సిగరెట్ తీసి ముట్టించుకున్నాను.

కాసేపున్నాక అజయ్ నుంచి కాల్ వచ్చింది.వెంటనే తీసి మాటాడాను.

" ఆ..చెప్పు..ఆ శుభ వార్త" నా లోని ఆతురత ని అణచుకోలేకపోయాను.

" మళ్ళీ ఈ సారి తన్నేసింది బ్రో" నీరసంగా అన్నాడు అజయ్.

"అయ్యో..అప్పుడే రిజల్ట్స్ వచ్చాయా"

"అవును.."

"నీకు రాలేదా జాబ్ అయితే"

ఓ అయిదు క్షణాలు నిశ్శబ్దం.

"హలో" నిరాశ గా అన్నాను.మళ్ళీ సారికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ.

అజయ్ ఉన్నట్లుండి నవ్వడం వినిపించింది.

"నీతో జోక్ చేశాను బ్రో...నాకు జాబ్ వచ్చింది " అవతల నుంచి చెప్పాడు అజయ్.

"నువు ఎపుడు ఇలాంటి వేషాలే .." నవ్వుతూ అన్నాను.

" కాసేపు టెన్షన్ క్రియేట్ చేద్దామని ..అంతే..ఆ విషయం లో నేను సక్సెస్ అయ్యానా"

"జాబ్ సంపాయించడం లోను...టెన్షన్ పుట్టించడం లోనూ రెండిటిలో సక్సెస్ అయ్యావు.."

"ఆ ..ఇపుడు ఒకటి నిజంగా చెప్పాలి నీతో...సీరియస్ గా"

"నీ సక్సెస్ కి నాకు చాలా ఆనందం గా ఉంది..చెప్పు.."

"ఏదో బిల్డప్ కోసం చెప్పడం లేదు.నా గుండె లోతులోనుంచి వచ్చింది ఇపుడు చెప్పబోతున్నా"
"నువు ఆల్రెడి బిల్డప్ ఇచ్చేశావు గదా"

"నువు నిజంగా దేవుడివి బ్రో.నేను దేవుడిని ఎంతో మొక్కుకున్నాను జాబ్ ఇప్పించమని.అది నీ ద్వారా నెరవేరింది"

"అదేం లేదులే..బ్రో"

"ఒక సీక్రెట్ చెప్పనా"

"చెప్పు"

"రాం కి చెపితే నన్ను చంపేస్తాడు.కాని ఈ ఆనంద సమయం లో చెప్పకుండా ఉండలేకపోతున్నాను"

"ఏమిటది" నాలో ఆతురత ఎక్కువైంది.

"నీకు అనారోగ్యం గా ఉన్న ఆ టైం లో నిన్ను నువు శివుడిగా భావించుకునేవాడివి.నేను నమ్మినా,మిగతావాళ్ళు దాన్ని నమ్మేవారు కారు.నీ షిజోఫ్రెనియ లక్షణాల్లో అది ఒకటిగా జమకట్టేవారు.నిజం చెప్పాలంటే..నువు శివుడివే..!మేము అంతా నీ అనుచరులం" చెప్పాడు అజయ్.

"ఏమిటి...! నేను ఆ దేవుడు శివుడినా.." నమ్మలేక అడిగాను.

"అవును..ముమ్మాటికీ"

గుణ ఆ రోజు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.నేను నిజంగా శివుడినేనా..?నన్ను సరిగా పరీక్షించారా వైద్యులు ...నేను అనుకునేవి అన్నీ నిజాలేనా..?

"ఓహో..అలాగా" దీర్ఘాలోచన లో పడ్డాను.

"మళ్ళీ థాంక్స్ బ్రో" అజయ్ అన్నాడు.

"వెల్కం బ్రో..తిరుచ్చి రా..!సెలెబ్రేట్ చేసుకుందాం"

"ఓ కె ..అక్కడ కలుద్దాం"

"బాయ్.."
హాస్టల్ దాటి ఆలోచనల్లో పడి ముందుకు నడవసాగాను.నాలో అనేక ఆలోచనలు ఒకనిదానితో ఒకటి ముప్పిరిగొంటున్నాయి.ఇదివరకు కూడా నన్ను నేను శివ లాగానే భావించుకునేవాడిని.ఎందుకు అలా..?అది పోనీ..ముగ్గురు వ్యక్తులు..ఒకరి తో ఒకరికి సంబంధం లేనివారు కూడా నన్ను శివుడి గానే భావించారు.ట్రీట్ మెంట్  అయిన తరువాత కూడా గుణ నాకు కనబడటం లో అర్ధమేమిటి..?!నేను నన్ను దేవుడి గా భావించుకోవడం లేదు గాని ఒక ఉద్వేగం నాలో నెలకొన్నది.ఇవన్నీ ఆలోచిస్తే మళ్ళీ సమస్యల్లో పడతాను.అలా అనుకొని తోసిపుచ్చసాగాను నా మనసులో..!

"నేనూ నీతో వస్తే ఏమైనా అభ్యంతరమా" గుణ అకాస్మాత్తుగా మళ్ళీ ప్రత్యక్ష్యమయ్యాడు.ఈ సారి నాకు భయం వేయలేదు.సంతోషమనిపించింది ఒకందుకు.నాలో ఉన్న చాలా వాటికి ఇపుడు సమాధానాలు కావాలి.

"నేను దేవుడినా" అడిగాను నేను.

"దానికి జవాబు నీకు తెలుసు.తర్వాత ప్రశ్న అడుగు" గుణ చెప్పాడు.

"నాకు షిజోఫ్రెనియ లేదా "

" అలాంటి తెలిసిన విషయాలు అడగకు.నీ లోపలకి చూడు...అక్కడ నేను ఉండి మాట్లాడుతున్నాను"

"డాక్టర్లు చెప్పింది తప్పా"

"మళ్ళీ చెపుతున్నా.సిల్లీ ప్రశ్నలు అడగకు.నీకు సమాధానం దొరకని వాటిని అడుగు.."

"నేను ప్రవీణ్ ని ఎందుకు చంపాలి?"

"ఇప్పటికే నీకు ఎంతో చెప్పాను దానిగురించి..ఊహించుకోలేవా ఆ మాత్రం"

"అది న్యాయామా"

"కొద్దిగా తెలివి పెరిగింది ఇప్పటికి.సంతోషం"

"నేను అతడిని చంపననుకో...ఏం చేస్తావు నువ్వు"

"నేను చేసేది ఏముంది..ఇక రోజూ నీ వెంట బడటమే నేను.."

"నిన్ను అసలు పట్టించుకోను నేను"

"బాబూ..మర్చిపోయావా..గతం లో నువు పడినా టార్చర్.చావు కి దగ్గర గా వెళ్ళివచ్చావు.ఆ రోజులు మర్చిపోయావా .." గుణ అడిగాడు.
"అవును..ఆ రోజులు భయంకరమైనవి" ఆ చీకటి రోజులు తల్చుకుంటూ అన్నాను.

"ఆ రోజున నువు ఆత్మహత్య చేసుకోబోతుంటే ప్రియ సమయానికి ఫోన్ చేయబట్టి బతికిపోయావు..ఈ సారి నువు సూసైడ్ చేసుకుంటే ఆ బాధ్యత ఎవరిది మరి.."

"ఏమో నాకు తెలియదు"

" చూడు వరుణ్..యామిని నీ నుంచి విడిపోవడానికి కారణం ఎవరు?"

"నేను అనుకోవడం..ప్రవీణ్ అని "

"ఇంకా నయం బతికిపోయావు,ఒక వేళ నువు గాని చనిపోయివుంటే దానికి పూర్తి కారణం ఎవరు..ప్రవీణ్ యేగా .."

"హ్మ్మ్"

" ఒక విషయం చెప్పనా...నేను నీలో ఎప్పుడు ఏర్పడ్డానో తెలుసా..?నీలో జీవితం మీద నిరాశ...కోపం లాటివి మొదలైనప్పుడు...ప్రవీణ్ మీద లోలోపల ద్వేషం మొదలైనపుడు...!నన్ను సంతృప్తి పరచాలంటే నువు ప్రవీణ్ ని చంపవలసిందే...!
గుణ మాటలు నాకు పాత రోజుల్ని గుర్తు చేశాయి.యామిని తన కి ఫోన్ చేయద్దు అని చెప్పడం...ఆ విషాదం తో నిండిన వీడ్కోలు..!ఆమె ఎందుకని అలా చెప్పింది.ఆ ప్రవీణ్ గాడి వల్లనేగా..!వాడు అలా అని ఆమె తో చెప్పి ఉంటాడు.శవం లాంటి వాడు ఆ వెధవ..శవం కావాల్సిందే..!గుణ చెప్పినది అర్ధం అవుతోంది.ప్రవీణ్ అంటే విపరీతమైన అసహ్యం కలుగుతోంది.న్యాయం జరగాల్సిందే..!నాకు నేనే చేసుకోవాలి అది.

"వాడిని నేను చంపితే పట్టుబడనా" అడిగాను.

"వాడి ఇంటికి పో.వేసేసెయ్.తప్పించుకు వచ్చేసేయ్..!ఎవరకి తెలుస్తుంది..?వాడి ఖర్మకి వాడు పోయాడు అనుకుంటారు..!"

"నేను ప్రవీణ్ ని చంపితే ఇక నాకు కనబడవు గా"

"నేను ఏర్పడిందే వాడిమీద ద్వేషం తో..!వాడికి జరగాల్సింది జరిగాక నేను నీకు కనిపించను.ప్రామిస్ చేస్తున్నా"

"సరే..ప్రవీణ్ ని నేను చంపుతా "

"మంచి నిర్ణయం"

నేను ఫోన్ తీసుకొని ఒక నెంబర్ కి డయల్ చేశాను..! (సశేషం)  

Monday 14 May 2018

నా పేరు శివ (నవల),Post no:52

నా పేరు శివ (నవల),Post no:52

" వావ్...ఏమిటి నీకు జాబ్ వచ్చిందా,కంగ్రాట్స్" ప్రియ ఎంతో ఉద్వేగం తో పలకరించింది.

"థాంక్స్ హనీ" చిరునవ్వు తో చెప్పాను.

"మీ పేరేంట్స్ కి కూడా చెప్పావుగదా "

" ఆ...చెప్పాను"

"ఏమన్నారు వాళ్ళు"

"చాలా హేపీ గా ఫీలయ్యారు వాళ్ళు.నాకు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ కి కూడా ఫోన్ చేసి చెప్పారు ..నేను మళ్ళీ బాగవడానికి ఆయనదీ ఓ ప్రధాన పాత్ర గదా"

"ఈ లెక్కన తరచూ నువు చెన్నై రావచ్చు ..అంతే గా"

"తప్పనిసరిగా"

" మరి నాకు ఎక్కడ ట్రీట్ ఇవ్వబోతున్నావు మరి..?"

"నీ యిష్టం..ఎక్కడంటే అక్కడే"

"మారియట్ లో లంచ్ ఎలా ఉంటుంది"

" ఓ.కె. డన్"

"ఆ తర్వాత ECR మీదుగా రైడ్ ఎలా ఉంటుంది"

"దానికీ డన్"

"ఓ.కె. త్వరగా నిన్ను చూడాలని ఉంది"

"నాకూ అంతే..!ఇపుడు అజయ్ రూం దగ్గరకి వచ్చాను. రాత్రి కి ఫోన్ చేస్తా మళ్ళీ"

"మళ్ళీ ఇంకోసారి కంగ్రాట్స్..!"

"మళ్ళీ థాంక్స్"

" బాయ్.."

"బాయ్" అని ఫోన్ ఆఫ్ చేసి,అజయ్ రూం తలుపు తట్టాను.

అజయ్ తలుపు తెరిచాడు.తను దిగాలు గా ఉన్నాడు.

"ఏమిటి..ఏమయ్యింది బ్రో.." నేను అడిగాను.

"నా ఇంటర్వ్యూ మళ్ళీ తన్నేసింది బ్రో.." కన్నీళ్ళ పర్యంతమయ్యాడు అజయ్.

"బాధ పడకు .తప్పనిసరిగా వచ్చే ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవుతావు.ప్రిపేర్ అవుతూ ఉండు" ఊరడించాను అజయ్ ని.
"చాలా కష్టమే బ్రో.నా టెక్నికల్ నాలెడ్జ్ దెబ్బ తింది.మొదటి మూడు ఏళ్ళు చదువు ని నిర్లక్ష్యం చేశాను.దాన్నంతటిని కలిపి ఈ ఒక్క ఏడాది లో ఎలా పుంజుకోగలను.ఇక నేనింతే బ్రో.ఇలా జాబ్ లేకుండా మిగిలిపోవడమే..!నా తల్లిని ఇంకా మిగతా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో ఏమిటో.."  అనంటూ అజయ్ తన తల నా భుజం మీద పెట్టి ఏడవసాగాడు.

"ఇక ఏ ఇంటర్వ్యూ లోనూ చాన్స్ లేదంటావా?"

"అసలు లేదు బ్రో"

వరసగా నాలుగు ఇంటర్వ్యూ ల్లో అజయ్ ఫెయిల్ అయ్యాడు.ఈ రోజు దానితో కలుపుకొని.నాకు తెలుసు అతని బాధ.చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అతని కుటుంబం.అర్కిటెక్చర్ లో తనకి నాలెడ్జ్ లేకపోతేనేం వేరే ఫీల్డ్ లో వెదకవచ్చుగదా అనిపించింది.

" ఆ..నాకు ఓ ఐడియా వచ్చింది బ్రో" అతని భుజం తడుతూ అన్నాను.

"ఏమిటది" అజయ్ కన్నీళ్ళు తుడుచుకున్నాడు.

"నువు చదివిన ఆర్కిటెక్చర్ కాకుండా వేరే రంగం లో జాబ్ చేయగలవా"

"చేయగలను,కాని వేరే పని నాకేం తెలుసని.."

"సేల్స్ ఫీల్డ్ లో నువు చేరవచ్చు.రాం ని వాళ్ళ కంపెనీ లోకి నిన్ను రిఫర్ చేయమని చెబ్దాం ఆగు"

"ఒక స్టూడెంట్ కి పెన్ కూడా అమ్మలేను.అలాంటిది లక్షల ఖరీదు చేసే ఉత్పత్తుల్ని నేను ఎలా అమ్మగలను బ్రో"

"రాం నీకు గైడెన్స్ ఇస్తాడులే ,కంగారు పడకు"

"ఒక నెల రోజుల్లో బయటకి వెళ్ళగొడతారు నన్ను..అది ఖాయం"

" హ్మ్మ్" ఆలోచించసాగాను.ఒక ఆలోచన తట్టింది.

"కాల్ సెంటర్ లో నువు పని చేస్తావా..?" అడిగాను అజయ్ ని.

"అంటే ఏం చేయాలి నేను" ప్రశ్నించాడు అజయ్.

" అంటే వచ్చే ఫోన్ కాల్స్ కి ఆన్సర్ ఇవ్వాలి.పరిష్కారాలు చెబుతుండాలి"

" ఎలాంటివాటికి"

"అది వివిధ కంపెనీల్ని బట్టి ఉంటుంది"

"నా సమస్య నేను పరిష్కరించుకోలేను. అలాటిది...! నాకు తెలిసింది ఆ మాదక ద్రవ్యాలు వాడి నాశనం అవడమే"

"దాని గురించి వర్రీ గాకు.నీకు ట్రైనింగ్ ఇస్తారు"

"అలాగా"

" వాళ్ళకి కావలసింది చక్కని కమ్మ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థి.నీకు మంచి ఆంగ్ల పరిజ్ఞానం ఉంది.అది తిరుగులేని ప్లస్ పాయింట్ అవుతుంది"

"అంటే నాకు జాబ్ వస్తుందా బ్రో" ఇంతసేపటికి నవ్వుతూ అడిగాడు అజయ్.

"నూరు శాతం" థంస్ అప్ పెట్టి చెప్పాను.

"మరి ఇంటర్ వ్యూ అరేంజ్మెంట్ ఎవరు చేస్తారు?"

"వరుణ్ ఉన్నప్పుడు నీకేమిటి భయం..నాకు వదిలిపెట్టు"

"అక్కడ పని చేసే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా"

"అవును,తెలుసు.ఆమె పేరు ప్రియ.." చెప్పాను. (సశేషం)