Wednesday, 16 May 2018

నా పేరు శివ (నవల),Post no:54

నా పేరు శివ (నవల),Post no:54

మార్చ్ 1,2015

"హాయ్..వరుణ్! లోపలకి రా" ప్రవీణ్ తలుపు తీసి ఆహ్వానించాడు.

"తప్పకుండా" అని లోపలకి వెళ్ళాను.

నా బ్యాగ్ లో పదునైన కత్తి ని పెట్టుకొని వచ్చాను.గుణ చెప్పినట్లుగా ప్రవీణ్ ఎంత బతిమాలినా వినకుండా పొడిచి వేయడమే..!ఈ పని చేయబోయే ముందు కొద్దిసేపు వీడితో మాటాడదాము ,పోయిందేముంది..!అసలు ఫోన్ ఎందుకు చేశాడు నాకు..అది కూడా తెలుసుకున్నట్లు ఉంటుందిగా..!

"ఆ..వరుణ్..కొద్ది గా మందు తీసుకుంటావా?" ప్రవీణ్ అడిగాడు నేను సోఫా లో కూర్చున్న తర్వాత.

"నో ..థాంక్స్..ఇపుడు నేను తాగడం లేదు." చెప్పాను.

"సరే..నేను తీసుకుంటా..నీకు అబ్జక్షన్ లేదుగా"

" నో ప్రోబ్లం..కానీ డ్యూడ్"

" ఇదివరకు నీ ఫేవరేట్ డ్రింక్ ఏమిటి..?" తను మందు పోసుకొని ఐస్ వేసుకుంటూ అడిగాడు ప్రవీణ్.

"బీర్" చెప్పాను.ఇంతకీ అసలు విషయానికి వస్తాడా వీడు అనిపించింది.

"ఓ.కె.కాలేజ్ రోజుల్లో చీప్ విస్కీ తాగేవాణ్ణి.మా యింటి దగ్గర్నుంచి ఎక్కువ డబ్బులు పంపించకపోవడం మూలాన..!" అతను సిప్ చేస్తూ చెప్పాడు.

" నిజమా"

"ఇప్పుడు నేను స్కాచ్ తాగుతున్నా.ఎందుకంటే బాగా సంపాదిస్తున్నా కాబట్టి"

"మంచిది"

" నువు ఎప్పుడైనా స్కాచ్ తాగావా?"

"లేదు"

"ట్రై చెయ్..విస్కీ కంటే స్కాచ్ సూపర్ గా ఉంటుంది,కనీసం విస్కీ అయినా రుచి చూశావా "

" ఆ చూశా"

"అంటే రెండిట్లో ఏది నీకు ఇష్టం..బీర్ లేదా విస్కీ?"

"బీర్"

" ఏంటి పొడి పొడి గా చెబుతున్నావు..బోర్ కొడుతున్నానా?"

"ఏదో మాట్లాడాలి..రమ్మన్నావు గా ..!ఆ విషయం ఏమిటి..అక్కడికి రా"

"ఇప్పుడిప్పుడే కిక్ ఎక్కుతోంది..సరే ..! నీకు తెలుసుకోవాలని ఉందిగా "

" ఔను డ్యూడ్"
"దానికంటే ముందు,నీ గురించి ఒకటి చెబుతా ఏమీ అనుకోనంటే.."

"సరే చెప్పు"

"ప్రతి ఒక్కరు తమ గురించి చెప్పేదాన్ని ఇష్టపడతారు.నీ గురించి చెబుతున్నందుకు నన్ను నువు అభినందించాలి" ప్రవీణ్ నవ్వుతూ చెప్పాడు.నేనూ మర్యాదకి ఇకిలించాను.

"నువు గిటార్ వాయించడం లో గొప్పోడివి కావచ్చు,చదువు లో గొప్పోడివి కావచ్చు,హృదయపరంగా గొప్పోడివి కావచ్చు..కాని ఒక దాంట్లో మాత్రం నువు జీరో అని చెప్పొచ్చు"

"అర్ధం కాలేదు"

"రిలేషన్షిప్ ని నిలబెట్టుకోవడం లో నువు వేస్ట్ గాడివని చెప్పొచ్చు.నీ గర్ల్ ఫ్రెండ్ తో ఎలా హేపీగా ఉండాలో,ఉంచాలో నీకు తెలీదు,నిజమేగా "అడిగాడు ప్రవీణ్.తల ఊపాను.చాలా ఎక్కువ చేశాడు వీడు ఇప్పటికే..ఇంకా ఎంతసేపులే..!

మళ్ళీ ప్రవీణే అన్నాడు "నువు యామిని ని చెత్త లా చూశావు.ఆమెని బాగా బాధించావు.నీ రెండో గోవా ట్రిప్ లో నువు ఏం చేశావో తెలుసా"

"నాకు తెలీదు" అన్నాను.అయినా ప్రతి ఒక్కరు ఆ రెండో ట్రిప్ గురించే చెబుతున్నారు.ఏమి చేశానో అప్పుడు..?

"నువు ఆమె ని చంపడానికి ప్రయత్నించావు" గొంతు పెంచి చెప్పాడు ప్రవీణ్.

"ఏమి వాగుతున్నావు నువు..?" నేను షాక్ తిన్నాను.వీడు ఏదో ట్రిక్ చేస్తున్నాడు అనిపించింది.
"నీతో ఎప్పుడూ ఆ కత్తి ఉండేది.ఆ సూర్య ని చంపడానికి ఉపయోగించావే అది.ఏ తప్పు లేకుండా యామిని ని చంపడానికి ప్రయత్నించావు ఆ రోజు.ఆమె నాకు అంతా చెప్పింది డ్యూడ్.అయితే ఇది పోలీస్ లకి చెప్పకూడదని నాతో ప్రామిస్ చేయించింది.ఈ రోజు దాకా నేను ఎవరకీ ఇది చెప్పలేదు.అందుకు నువ్వు నాకు థాంక్స్ చెప్పుకోవాలి" ప్రవీణ్ వివరించాడు.

"థాంక్ యూ" అన్నాను.నాలో దేవినట్లుగా అయింది.

యామిని నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయింది అనేది నాకిప్పుడు తెలిసింది.ఆమె ఆ రెండో గోవా ట్రిప్ లో నాతో మంచిగా ఉండాలని బంధం బలపడాలని ప్రయత్నించే ఉంటుంది గాని నేను పొడవడానికి ఒడి గట్టానంటే అప్పుడు నా స్థితి ఎంత దారుణంగా ఉన్నదో మానసికంగా..!యామిని ని పొందే అర్హత నాకు లేదు.అసలు ఈ ప్రపంచం లో ఇలా తిరిగే అర్హత కూడా నాకు లేదు.నేను పిచ్చి ఆసుపత్రి లో ఉండదగిన వాడిని.

"ఆమె అలా ఎనిమిది నెలలు బాధ పడింది.నేను ప్రేమించిన ఆ అమ్మాయి అలా ఉండటం నాకు ఎంతో బాధ కలిగించింది.." అన్నాడు ప్రవీణ్.

"నువు ప్రేమించడం ఏమిటి..?" ప్రశ్నించాను.

" నీ కంటే ముందు నుంచే ఆమె ని నేను ప్రేమిస్తున్నాను.అయితే ఆమె తో చెప్పే ధైర్యం నేను చేయలేకపోయాను.మీ మొదటి గోవా ట్రిప్ గురించి ఆమె నాకు చెప్పినపుడు నాకు నిద్ర పట్టలేదు.నా ప్రియురాల్ని దూరం చేసిన నీ మీద నాకు ఎంతో కోపం వచ్చింది.." ప్రవీణ్ చెప్పిన ఈ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.అతడి నుంచి నేను దొంగిలించానా ఆమె ని అని..!

"నేను.."

"నేనే గనక నీలా సైకో ని అయితే ఈ చేతులతో నిన్ను చంపి ఉండేవాడిని.అంత కోపం వచ్చింది" ప్రవీణ్ ఊగిపోయాడు.

నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు.
"ఏమైతేనేం..చివరకి ,ఆమె కి నా ప్రేమ ని తెలియబరిచాను.ఆ అద్భుతమైన రోజు నాకు గుర్తుంది.అక్టోబర్ పద్నాలుగు,రెండువేల పదమూడు.ఆ రోజున నా మీద కాంతి పుంజం విరిసింది"

"ఆ తర్వాత ఏం జరిగింది"

"ఆ తర్వాత కొన్ని రోజులు బాగా గడిచాయి.అవి గుర్తుంచుకోదగిన రోజులు నాకు.అయితే ఈ మధ్య.." చిన్న గొంతు తో చెప్పాడు ప్రవీణ్.

" ఆ..ఏమైంది..చెప్పు" చాలా ఆత్రుత గా అడిగాను.

"ఇప్పటికి నిన్ను ఆమె ప్రేమిస్తోంది.నాతో రిలేషన్ లో ఉండటం ని ఓ పొరబాటు గానే భావిస్తోంది.రెండు రోజుల క్రితమే ఇది నేను తెలుసుకున్నాను.కారణం నాకు తెలీదు.నీ వేపు మొగ్గు ఉన్నది ఆమె లో.నా ఓటమి ని అంగీకరించడానికే నీకు ఫోన్ చేశాను.నీ ప్రేమ నా ప్రేమ కంటే గట్టిది.అది నిరూపించావు."అలా చెప్పి ప్రవీణ్ చిరునవ్వు చిందించాడు.తను లోపల గాయపడిన విషయం నేను తెలుసుకున్నట్లు పసిగట్టాడు.

"ఐ యాం సారీ,డ్యూడ్..!" చెప్పాను. ప్రవీణ్ ని చంపే ఆలోచన ని విరమించుకున్నాను.ఇప్పుడు గుణ ఉన్నా నన్ను కాదనలేడు.తనూ బాధ పడతాడు కూడా.

"నీ హృదయం ఎంత గాయపడిందీ నేను తెలుసుకోగలను..బ్రో" అంటూ తను నా దగ్గరకి వచ్చి హత్తుకున్నాడు.పరిస్థితి ఇలా అవుతుందని నేను అసలు ఊహించలేదు.చివరకి నేను ప్రవీణ్ ని ఓదార్చవలసి వచ్చింది.

"ఇంకా ఏం చెప్పాలో తెలియడం లేదు బ్రో" అన్నాను.

"ఇప్పుడు యామిని చెన్నై లో పనిచేస్తోంది.ఇదిగో అడ్రెస్ తీసుకో..!వెళ్ళి కలువు..సర్ప్రైజ్ చెయ్యి...ఆమె నిన్ను ఇంత త్వరగా అసలు ఊహించదు"అంటూ ప్రవీణ్ నా చేతి లో ఓ కాగితం ముక్క పెట్టాడు.

"నువ్వు బాగానే ఉన్నావు గా ..ష్యూర్" అడిగాను తనని.

"ఇక ఆమెని నా జీవితం లో భాగంగా పరిగణించలేను.నేను మర్చిపోతాను.కష్టమే ..కానీ ఎలాగోలా నా దారి లో నేను వెళ్ళిపోతాను " చెప్పాడు ప్రవీణ్.

"ఐ విష్ యూ లక్" చెప్పి వెళ్ళడానికి సిద్ధపడ్డాను.

"ఈసారి అయినా మంచిగా ఉండటానికి ప్రయత్నించు..ఆల్ ద బెస్ట్,ఆనందం తో ఉండండి "

" ఓ కె" అలా చెప్పి వేగంగా బయటకి నడిచాను.

ఇపుడు నాకు ముగ్గురు మీద జాలి కలుగుతోంది.యామిని మీద..అలాంటి భయంకరమైన అనుభూతుల్ని పొందినందుకు..!ప్రవీణ్ మీద..ఆమె ఇతడిని వీడి పోయినందుకు..!చివరిగా నామీద,ఇంత సైకోపాత్ కిల్లర్ గా అయినందుకు..!

ప్రియ నుంచి కాల్ రావడం తో ఆ విషయం మీద ఆలోచిస్తున్నాను..!(సశేషం)   

No comments:

Post a Comment