Wednesday 25 February 2015

అది గ్రహించనన్నాళ్ళు హిందూ మతానికి నిష్కృతి లేదు.."

మదర్ థెరెస్సా పై మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు.కాని అంత మాత్రం చేత పూర్తిగా ఆమె ని తప్పు పట్టలేము.ఒక్కో మతానికి ఒకో స్వరూపం ఉంటుంది.ఒక అర్ధం ఉంటుంది.లోకం పట్ల అది నెరవేర్చవలసిన కర్తవ్యం ఉంటుంది.ఎవరి ఇంట్లోనుంచి వాళ్ళు చూస్తే మరో ఇల్లు అదోలా కనిపిస్తుంది.కొన్నేళ్ళ క్రితం బైబిల్ ని అసలు ఏమున్నదో తెలుసుకోవాలనే ఆసక్తి కొద్ది చదివాను.చాలా నెమ్మెదిగా ఒక ఆసక్తి తో మాత్రమే చదివాను. చాలా కొత్త ద్వారాలు తెరుచుకున్నట్లు అనిపించింది. ఒక గొప్ప ఆర్గనైజేషన్ స్పిరిట్ ని మనిషిలో నింపే భావజాలం దానిలో అలుముకుని ఉన్నది.పైకి శాంతి సందేశం లా ఉన్నప్పటికి అంతర్లీనంగా పోరాట స్వభావం ని నింపుతుంది.ముఖ్యంగా అపోస్తలులు పాల్ వంటివారు ఎలాంటి ఎదురీతల్ని ఈది ..దానిని ఎలాంటి భావ యుక్తమైన మాటల్లో చెబుతారంటే రోమాంచితమవుతుంది.

అసలు ఆత్మల్ని సంపాదించడమే బైబిల్ లో చెప్పిన అసలు విషయం.ఇక్కడ దాని అర్ధం అన్య మార్గాలనుంచి మనుషులని ఇవతలకి చేర్చడమే.అది ఆ గ్రంధం నమ్మిన వారికి శిరోధార్యమే తప్ప ఇంకోలా ఎలా కనబడుతుంది.దానికి కోసం సేవ అనే మార్గాన్ని ఎన్నుకోవడం వారికి తప్పు కాదు.పంట విస్తారంగా ఉంది గాని కోసే పనివాళ్ళు బహుకొద్దిగా ఉన్నారని చెప్పబడుతుంది ఓ చోట.అసలు ఏ ప్రతిఫలం లేకుండా ఏ మనిషి అయినా ఏ పని ఎందు  చేస్తాడు. ప్రేమ యోగం అనేది బైబిల్ లో ప్రయోగించబడింది.అయితే హిందూ మతం చాలా ప్రాచీన కాలం లోనే ఈ స్వరూపాలన్నిటినీ అర్ధం చేసుకున్నది.అంటే దాని అర్ధం.. పై పై పూజలు పునస్కారాలు చేసి అదే భారతీయ ధర్మం అని ప్రవచించే వారిగురించి నే చెప్పడం లేదు.భారతీయ ధర్మం యొక్క శాపం దాని ప్రాచీనతే...అంతు తెలియని ప్రాచీనత..దాన్ని ఎలాగైనా మార్చి మార్చి అర్ధాలు చెప్పుకునే అవకాశం ఉండటమే..!అక్కడే వచ్చింది తంటా..!

అందుకనే సేవ అనే భావాన్ని ఆధునిక కాలం లో భారతీయ ధర్మం లోకి రామకృష్ణ మిషన్ ద్వారా ప్రవేశపెట్టారు స్వామి వివేకానంద.తోటి సాధువులు సైతం ఆయన్ని ఈ విషయం లో విమర్శించారు..ఆత్మ జ్ఞానాన్ని అందిస్తే చాలు గదా...మనిషికి భౌతిక పరమైన సేవ అందించవలసిన అవసరం ఏముంది అని ప్రశ్నించినప్పుడు....ఆయన ఇలా అన్నారు "ఎంతో సాధన కలిగిన ఒక రుషి  కి ఏర్పాటు చేసే నియమాల్ని మనం సాధారణ మనిషి కి ఆపాదించి అలా చేయాలని ఆశిస్తాం..అది సరి కాదు...అక్కడే పొరబాటు జరుగుతున్నది.అందుకే రామకృష్ణుడు మళ్ళీ అవతరించింది.. !ఒక అంత్య కులజుని తో భోజనం చేయడానికి మీకు అహం అడ్డు వస్తుంది..అదే అతను ఒక ఇంగ్లిష్ పేరు పెట్టుకొని మతం మారి వస్తే మటుకు నీవు అతడిని ఆహ్వానిస్తావు.నీ మతం వారిని తృణీకరిస్తే వారు అతడినిపూజారి గానే   చేశారు.అలాంటప్పుడు నీ మతం లో అతను ఎందుకుండాలి.వారు మతం మారుతున్నది ధనం కోసం కాదు తమ ఆత్మ గౌరవం కోసం.అది గ్రహించనన్నాళ్ళు హిందూ మతానికి నిష్కృతి లేదు.."

Tuesday 24 February 2015

పేపర్ వాళ్ళు ఆ మాత్రం తెలుసుకోవద్దా..??

ఈ రోజు ఓ తెలుగు పేపర్ లో చూశాను.నిన్న జరిగిన ఆస్కార్ అవార్డ్ ల కార్యక్రమానికి సంబందించి ..ఉత్తమ నటి గా ఎన్నికైన జూలియన్ మూర్ పేరు ని జూలియన్ మూరె గా సంబోధిస్తూ వేశారు.విదేశీ పేర్లని తర్జూమా చేసేప్పుడు ఆ మూలానికి దగ్గరగా ఉండే ఉచ్చారణ ని తెలుసుకుని వేయాలి.నా అనువాదం నా ఇష్టం అనుకుంటే చేసేదేమీ లేదు.కాని అదే రైట్ ప్రొనన్సియేషన్ గా భావించి కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు సదరు పత్రిక యొక్క పాఠకుని పరువు పోతుంది.అంతే.

Saturday 14 February 2015

Other side of the midnight డబ్భైవ దశకం లో సిడ్నీ షెల్డన్ రాసిన ఒక మంచి థ్రిల్లర్.


Other side of the midnight డబ్భైవ దశకం లో సిడ్నీ షెల్డన్ రాసిన ఒక మంచి థ్రిల్లర్.

Other side of the midnight డబ్భైవ దశకం లో సిడ్నీ షెల్డన్ రాసిన ఒక మంచి థ్రిల్లర్.ఏమీ తోచనప్పుడల్లా అలా చదివిన వాటినే తిరగేస్తుంటా...దాని వల్ల రెండు లాభాలు.ఒకటి మనకి కాలం తో పెరిగిన తెలివిడి వల్ల కొత్త కోణం లో కొన్ని విషయాలు అగుపిస్తాయి.మరొకటి కాలక్షేపం..టివి ని పెద్దగా చూడను కాబట్టి ..!

ఆ విధంగా తిరగేస్తున్నప్పుడు ఆ నవల్లోని ఇద్దరు ప్రధాన పాత్రలు Noelle Page,Catherine Alexander లు మళ్ళీ చాలా ఆలోచనలు పుట్టించారు నాలో..!ఇదొక ముక్కోణ ప్రేమ కధ ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యం లో జరిగే ఒక రివెంజ్ స్టోరీ కూడా..!ఆ ఇద్దరివి చాలా స్ట్రాంగ్ కేరక్టర్స్.Noelle Page ది ఇంకానూ ...ఫ్రాన్స్ లోని మర్సైల్స్ లో జన్మించిన ఆమె కి మోడల్ అయి ,బాగా సంపాదించి ప్రపంచం లో పేరు తెచ్చుకోవాలని ఉంటుంది.

దీనికి బీజం ఆమె తండ్రి నుంచి పడుతుంది.బాగా అందం గా ఉండి అందర్నీ ఆకర్షణ కి గురి చేసే ఆమె ని Auguste  అనే ధనికుడైన వ్యాపారస్తునికి తార్చుతాడతను.ఆమె ఒక కుర్రవాణ్ణి ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న తండ్రి అంటాడు...నీ అందం తో నీకు గల ఆకర్షణలతో ఇంకా పైకి ఎదగాలి అని.అట్లా ఈ Auguste తో శయనిస్తుందామె.. అప్పుడామె తెలుసుకుంటుంది పురుషుడు ధనము,పశుబలం ద్వారా లోకాన్ని వశపరుచుకుంటే  పురుషుని రంజింప జేయడం వల్ల స్త్రీ లోకాన్నే శాసించగలదు అని చెప్పి.ఇహ అప్పటినుంచి పురుషుని శరీరానికి ఎన్ని రకాలైన హాయిలని కలిగించవచ్చునో ప్రాక్టికల్ గా నేర్చుకుంటుంది.అలా ఆమె ఇంటి నుంచి కూడా పారి పోయి పారిస్ కి చేరుతుంది.చిన్న మోసాలకి గురయినా పెద్ద ఆపదలకి ఏమీ గురవదు గాని వాటిల్ నుంచి నేర్చుకుంటుంది.ఆమె కి సహాయపడగలరు అనుకున్న అయిదుగురు కి పడక సుఖం అందించి కొన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.అలా టాప్ మోడల్ గా ,నటి గా రాణిస్తుంది.అవతల వాళ్ళకి గాని,ఇవతల వాళ్ళకి గాని ఇదంతా ఓ బిజినెస్ డీల్ లా జరుగుతుంది తప్ప ఒక పాప కార్యం లానో ఇంకో ఫీలింగ్ తోనో జరగపోవడం లోనే జీవితాన్ని చూసే విధానం లో ఒక్కో దేశానికి ఎంత తేడా ఉంది అనిపిస్తుంది.Israel Katz అని ఒక డాక్టర్ ఉంటాడు ..అతను ఫ్రాన్స్ లో ఉండే ఒక యూదు జాతీయుడు.Noelle కి ఒక పైలట్  ద్వారా గర్భం వచ్చినప్పుడు ఆమె కి చికిత్స పరంగా చాలా సహాయం చేస్తాడతను. ఉద్యోగం కూడా ఇప్పిస్తాడు.మళ్ళీ కొన్ని ఏళ్ళు పోయినాక ఆమె ని మంచి నటి గా కుదురుకున్న సందర్భం లో అతను కలుస్తాడు.అప్పటికే హిట్లర్ సైన్యాలు ఫ్రాన్స్ ని ఆక్రమించి ఉంటాయి.యూదులంటే మండిపడే నాజీ ల హయాం లో ఆ డాక్టర్ తన ఉనికిని కోల్పోయి ఒక కార్పెంటర్ గా పనిచేస్తుంటాడు.అప్పుడు మనసు చివుక్కుమంటుంది.చాలా ఆలోచనలు ముసురుకున్నాయి.అసలు హిట్లర్ కి ఈ యూదులంటే ఎందుకంత ద్వేషం ..ఏదో బలమైన కారణాలే ఉండాలి...లేకుంటే ఎక్కడ అడుగుపెడితే అక్కడ పోలాండ్ ,ఆస్ట్రియా ,రష్యా,ఫ్రాన్స్ ఇంకా జర్మనీ లోను 60 లక్షల మంది యూదులను కుక్కల్ని చంపినట్లు చంపి పారేశాడు. ఇంకా ఈ లిస్ట్ చాలా పెద్ద గా ఉంది..ఆ జోలికి పోవడం లేదు.అలనాటి జీసస్,మోసెస్ ల దగ్గర్నుంచి ఈనాటి అల్బ్బర్ట్ ఐన్స్టీన్,సిగ్మండ్ ఫ్రాయిడ్ ,లెనిన్,మార్క్స్,ఇసాక్ అసిమోవ్,స్పీల్ బెర్గ్ ,మర్డోచ్ దాకా ప్రపంచాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేసిన ఆ జాతి పై అతనికి ఎందుకు అంత ద్వేషం అని చాలాసేపు యోచించా..!గూగూల్ లో కి కూడా వెళ్ళి సెర్చ్ చేశా....ఏవేవో డొంక తిరుకుడు సమాచారం బోల్డంత ఉంది గాని నాకైతే సంథృప్తి కలగలేదు. సరే ఇంకో కేరక్టర్ గురించి మరోసారి చెప్పుకుందాము.Click here  

Thursday 5 February 2015

తెలుగు పేపర్లు చూసి చూసి ఏమైనా మార్పు ఉంటుందేమోనని తెలుగు వెబ్ న్యూస్ పోర్టల్స్ చూద్దామని ప్రయత్నిస్తామా అవీ అంతే.పెద్ద తేడా ఉండదు

తెలుగు పేపర్లు చూసి చూసి ఏమైనా మార్పు ఉంటుందేమోనని తెలుగు వెబ్ న్యూస్ పోర్టల్స్ చూద్దామని ప్రయత్నిస్తామా అవీ అంతే.పెద్ద తేడా ఉండదు.రాజకీయుల సొల్లు మాటలకి డప్పు వేయడం ..లేదా దుమ్ము ఎత్తి అవతల వాడి మీద పోయడం.ఇంకా ఎక్కడ లేని సినిమా మానియా.అవే బొమ్మలు.అవే గోల.తెలుగు వాడికి ఈ రెండు మసాళాలు తప్ప మరోటి లేకుండా చేసిపెట్టిన ఘనత మన ప్రముఖ దిన పత్రికలవే.మళ్ళీ ఇందులో కుల గజ్జి కూడా చాలా స్పుఠంగా కనిపిస్తుంది.

కొన్ని ఇతర భాషల వాళ్ళ న్యూస్ వెబ్సైట్స్ చూస్తుంటాను.గ్రామ స్థాయిలోను,పట్టణ స్థాయిలోను జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్ని కవర్ చేస్తుంటారు.అక్కడి ప్రత్యేకతల్ని వెలికి తీయడం..ఆటగాళ్ళతో,వివిధ రంగాల వారితో ఇంటర్వ్యూ లు చేసి వేయడం,ఇట్లా చాలా విభిన్నంగా మెయిన్ స్ట్రీం న్యూస్ పేపర్లలోని రాని వాటినన్నిటిని కవర్ చేస్తుంటారు. అదీ వారి భాషలో కాకుండా చక్కని సింపుల్ ఆంగ్ల భాషలో రాయడం వల్ల కింది నుంచి పై వారు..ఇతర భాషల వాళ్ళు కూడా చక్కగా అర్ధం చేసుకుంటారు.ఈ దిశగా ఉండేవి ఏమన్నా తెలియపరచగలరు..ఎవరైనా సరే..!!!

Sunday 14 December 2014

హాలీవుడ్ లోకి అడుగు పెట్టినాక సెక్స్ కి దానిలో ప్రయోగాలకి కొరత ఏముంది

The Story Teller పుస్తకాలు సర్దుతుంటే కనబడిందీరోజు.హెరాల్డ్ రాబిన్స్ రాసిన చాలా చెత్త నవలల్లో అది ఒకటి.ఒక చిన్నపాటి బ్రూక్లిన్ రచయిత హాలీవుడ్ లో వెలుగొందటానికి పడే తపన కధంతా ..!హీరో Joe Crowne హాట్ పుస్తకాలు రాసి అమ్ముతూంటాడు పబ్లిషర్లకి.ఆ తర్వాత హాలీవుడ్ లోకి అడుగు పెట్టినాక సెక్స్ కి దానిలో ప్రయోగాలకి కొరత ఏముంది.మారిస్స అనే ఆవిడ ఉంటుంది.మాదకద్రవ్యాలు ,సముద్రం పై పడవల మీద షికార్లు .. గమ్మత్తు గా ఉండే కేరక్టర్ అది.The Carpet baggers,The Adventurers హెరాల్డ్ యొక్క మంచి నవలలు అనిపించినాయి.కాని ఇంగ్లీష్ ఫిక్షన్ కారులలో నాకు నచ్చేదేమంటే ఒక్కొక్కళ్ళది ఒకో తీరు.సిడ్నీ షెల్డన్ పొలిటికల్ థ్రిల్లర్స్ ని రాస్తే,ప్యూజో లాంటి వాళ్ళు మాఫియా గురించి రాస్తారు.హెరాల్డ్ రాబిన్స్ హాలివుడ్ ఇంకా సెక్స్ థ్రిల్లర్స్ ని ఇరగదీస్తాడని చెప్పాలి.కొంతమంది సాంకేతికత మీద రాస్తారు.జెఫ్రీ ఆర్చర్ ఆర్దిక పరమైన అంశాల నేపధ్యం లో బాగా రాస్తాడు.ఒకసారి ప్రయాణం లో Germ అనే సైంటిఫిక్ థ్రిల్లర్ చదివా..బహుశా రాబిన్స్ కుక్ అనుకుంటా రచయిత..ఆ ప్లాట్ మాత్రం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.ప్రపంచం లో ఉన్న గొప్ప పరిశోధకుల్ని రప్పించి ఒక వైరస్ ని తయారు చేస్తుంది ఒక కార్పోరేట్ దిగ్గజం.దాన్ని వివిధ దేశాల్లో వ్యాపింపజేసి దాని మందుల్ని పెద్ద ఎత్తున అమ్ముకోవాలనేది వారి ప్లాన్. మళ్ళీ ఆ మధ్యన కమల్ హాసన్ తీసిన ఓ సినిమా లో ఇలాంటి చమక్కే కనిపించింది.HIV వైరస్ ఇలాంటి బయలాజికల్ వెపన్ అయినా ఆశ్చర్యం ఏముంది..?  

Wednesday 26 November 2014

అలా కానప్పుడు నీళ్ళు త్రాగడమే మంచిది గదా..!

The Gospel of Sri Ramakrishna చాలా చిన్న అక్షరాలతో ప్రచురించబడిన పెద్ద పుస్తకం.ఒక సారి పూర్తిగా చదివాను.అయినా అప్పుడప్పుడూ చదువుతూనే ఉంటాను.ఎంత సూటిగా,సరళంగా ఎటువంటి ఆడంబరత ,సంకోచం లేకుండా పైనుంచి కిందపడే వర్షపు చుక్కల్లా ఉంటాయి రామకృష్ణుని మాటలు. నరేంద్రుని తో ఒక చోట అంటారు." విలువైనది ఏది పొందాలన్నా పై పైన వెతికితే ఏం లాభం..ఎన్ని జన్మలు వెతుకుతావు అలా..నీకు ముత్యాలు కావాలంటే సాగరగర్భంలోకి పోయి శోధించు..ఒడ్డుమీద ఇసుకలో వెతికితే ఏం లాభం..!నేనే గనక త్రాగుబోతు నయితే కిందపడే వరకూ త్రాగుతా..అలా కానప్పుడు నీళ్ళు త్రాగడమే మంచిది గదా..! ఏ విషయాన్నయినా పై పైన చూస్తున్నంతకాలం దాని గురించి ఏ జ్ఞానం పొందుతావు..ఏదో ఒక విషయం కొరకు శోధిస్తూ నీ తనువు రాలిపోయినా పరవాలేదు..దానివల్ల నీకే కాదు ప్రపంచానికి మేలు చేకూరుతుంది."

నా మటుకు నేను ఇది పఠనం విషయం లో అన్వయించుకున్నాను.మొదట్లో ప్రారంభించినపుడు ఎన్నో పుస్తకాలు చదివేవాడిని.తీరా చూస్తే చెప్పుకోవడానికి తప్ప దీనిలో సారం ఏమి అర్ధం అయింది నాకు అని ప్రశ్నించుకునేవాణ్ణి.అలా ఆ మహానుభావుల వాక్యాలు నా లోలోపల ఎన్నో కాంతుల్ని వెలిగించినవి.అవి సాధ్యమైనత ఆచరించి చూపడమే మన నివాళి తప్ప ఊరికే వల్లే వేసుకోవడానికి కాదు అనిపిస్తుంది. 

Monday 17 November 2014

The Sicilian గురిచి రెండు ముక్కలు..!

The Sicilian గురిచి రెండు ముక్కలు..!

ఈ రోజు ఎందుకనో చెగువేరా ఫోటోస్ ఫేస్బుక్ లో చూసిన తర్వాత ఇది రాయాలనిపించింది.ఎప్పటినుంచో అనుకున్నా కుదరలేదు.అది మరో సంగతి.Che యొక్క జీవితానికి Mario Puzo రాసిన మరో క్లాసిక్ Sicilian లోని హీరోకి దగ్గర పోలికలున్నట్లు అంపిస్తాయి.అతని పేరు Guiliano.సిసిలీ లో జన్మించి బందిపోటు గా మారి పేదవారి పాలిట రాబిన్ హుడ్ గా ప్రసిద్ది చెందిన ఒక యువకుని కధ అది.ఆ నవల్లో హీరో కి విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది.చరిత్ర,తత్వ శాస్త్రం ,కవిత్వం ..ఒకటేమిటి అన్నీ చదువుతుంటాడు.గాడ్ ఫాదర్ లాంటి ప్రొఫెసర్ ఒకతను ఉంటాడు.అతని పేరు Hector Adonis.గుట్టల్లోకి వెళ్ళి మరీ అతనికి పుస్తకాలు ఇచ్చి వస్తుంటాడు.హీరోకి ఒక మంచి మిత్రుడు ఉంటాడు(Aspanu Pisciotta).అసలు చివరిదాకా అతన్ని కేరక్టర్ ని అంచనా వేయలేము.విచిత్రంగా హీరో చావుకి అతను కారణమవుతాడు.అనేకసార్లు హీరోని ఎంతగానో కాపాడతాడు.చాలా చిన్న కారణం..హీరోకి పెరిగే పాపులారిటి కి అసూయ చెంది శత్రువుల కి ఉప్పందించి అతని చావుకి కారణమవుతాడు.Guiliano పాత్ర యావత్తు ఎందుకనో చే కి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది.విచిత్రంగా చే కూడా బాగా నమ్మిన ఒక వ్యక్తికారణంగానే శత్రువుకి చిక్కి చంపబడతాడు.ఈ హీరోకి మల్లేనే చే కి కూడా విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు.చే లాగానే అతనూ యవ్వన ప్రాయం లోనే చంపబడతాడు.అదనే కాదు ఇంకా చాలా విషయాలు కలుస్తాయి.Mario Puzo సిసిలీ లో జన్మించిన ఆ రాబిన్ హుడ్ ని అడ్డుపెట్టి ఇది రాశాడా అనిపిస్తుంది.

Michael Corleone సిసిలీ కి ప్రవాసం వెళతాడు గదా.. ఆ రెండు హత్యలు చేసిన తర్వాత.మన ఈ గాడ్ ఫాదర్ లోని కేరక్టర్ మళ్ళీ సిసిలియన్ నవల లో కూడా ప్రస్తావింపబడతాడు.ఆ హీరో Guiliano ని తనతో పాటు అమెరికా తీసుకువెళ్ళాలని ఒప్పందం కూడా కుదురుతుంది.అయితే అతను నమ్మిన మిత్రుడే వంచన చేస్తాడు.దానితో ఒక్కడే Michael అమెరికా కి తిరిగి వచ్చేస్తాడు.అయితే సిసిలియన్ నవల లోని  పాత్రలు ఏవీ గాడ్ ఫాదర్ లో కనిపించవు.అందుకనే సిసిలియన్ నవలని చదివిన వాళ్ళుMichael పాత్ర ని చూసి గాడ్ ఫాదర్ కి సీక్వెల్ అనుకుంటారు. కాని కాదు.ఒక గమ్మత్తు కోసం అలా స్టోరిని కలుపుతాడంతే.ఇదనే కాదు The Last Don చదివిన వాళ్ళు కూడా గాడ్ ఫాదర్ కి సీక్వెల్ అనుకుంటారు.కాని కాదు.కాకపోతే Don Corleone పాత్ర ఇంకొన్ని పాత్రలు గాడ్ ఫాదర్ లో నుంచి దీనిలోకి వచ్చి ఉంటాయి.ఒక అంతస్సూత్రం చేత Mario Puzo వాటినన్నిటిని అలా గుదిగుచ్చాడు.ఇది ఇలా ఉండగా ఇంకొంతమది మహానుభావులు గాడ్ ఫాదర్ కి వచ్చిన పాపులారిటిని చూసి తమ స్వంత ఆలోచనల్ని ఆ పాత్రలకి ఆపాదించి రాసేశారు.అదో గందరగోళం.అందుకనే చాలామంది గాడ్ ఫాదర్ సినిమా కి మల్లే గాడ్ ఫాదర్ నవల కూడా రెండుమూడు భాగాలుగా ఉంది అని చెప్పి అనుకొంటుంటారు.