Friday, 11 May 2018

నా పేరు శివ (నవల),Post no:50

నా పేరు శివ (నవల),Post no:50

ఆగస్ట్ 3,2014

కాలేజ్ లో మళ్ళీ చేరాను ఫైనల్ ఇయర్ కూడా పూర్తి చేసి డిగ్రీ పొందుదామని..!కోర్ కంపెనీ ల్లో కాకుండా IT కంపెనీ లో ఉద్యోగం చేద్దామని నా కోరిక.ఆ రంగం లో నాకు రెండు నెలల పని అనుభవం ఇప్పటికే ఉంది.వత్తిడి తక్కువ ఉంటుంది.ఎదుగుదల కూడా బాగుంటుంది.నా ఆరోగ్య పరిస్థితి కి కూడా అనువు గా ఉంటుంది.

నా బ్రెయిన్ పని తీరు ఇపుడు మెరుగు అయింది.మందుల వాడకం బాగా తగ్గింది.అయితే పొద్దుట ఒకటి,రాత్రి ఒకటి మాత్రలు వేసుకుంటున్నాను.నాకు అనారోగ్యం కలగక ముందు అంత కాదు గాని చాలా వరకు చక్కగా భావ వ్యక్తీకరణ చేయగలుగుతున్నాను.మళ్ళీ జీవితాన్ని ముందు నుంచి మొదలు పెట్టినట్లుగా ఉన్నది.అన్ని రకాలుగా ఆనందం గానే సాగుతున్నది వర్తమానం.  

ప్రియ నా జీవితం లో ఒక భాగమైపోయింది.ఒక సంవత్సరం దూరమవుతున్నందుకు ఆమె బాధపడింది.నెల కి ఒకసారి తప్పకుండా కలుసుకుని ఉల్లాసం గా బైక్ రైడ్స్ వంటివి చేస్తూ ఆనందించుదామని ప్రామిస్ చేశాను.త్వరలో ఆమె ని కలుస్తాను.ఇక గుణ కనిపించడం కి వస్తే...ఆ రోజు తెల్లారి డాక్టర్ ని కలిసి మొత్తం వివరించాను.ఆయన నాకు కొన్ని మాత్రలు రాసిచ్చాడు.ఈ హెల్యూసినేషన్స్ తగ్గడానికి.గుణ చెప్పినట్లు నేను దేవుణ్ణే అయినా సరే..ఓ మనిషి ని చంపడానికి అంగీకరించలేను.యామిని నన్ను విడిచి వెళ్ళింది.అది ఆమె ఇష్టం.ఒక రకంగా నేనూ కారణమే దానికి.ప్రవీణ్ దీ తప్పని అనలేను.పూర్తి గా నాదే తప్పు.

అజయ్ రూం లో ఈసారి మకాం నాది.సామాన్లు అన్నీ ఆ రూం కి సర్దుకున్నాను.ఇప్పుడు మేము ఆల్కాహాల్ జోలికి పోవడం లేదు.ఎప్పుడైనా స్మోక్ చేయడం మహా అయితే..!అజయ్ కూడా ఈసారి తీర్మానించుకున్నాడు.మంచి గా చదివి చక్కని జాబ్ కొట్టాలని..!రాం కూడా ఉంటే బాగుండును ..అతని కంపెనీ మిస్ అవుతున్నాను.మా గ్రూప్ లో తనే మేధావి అంటే..!తనూ అలానే మమ్మల్ని మిస్ అవుతూ ఉండవచ్చు.

మా కాలేజ్ కేంటిన్ లో కూర్చుని కాఫీ తాగుతున్నాను.రేపటినుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది.కొత్త క్లాస్ లు..కొత్త మిత్రులు..ఎక్జాయిటింగ్ గా ఉన్నది.మళ్ళీ తిరిగి రాగలిగాను.నేను కాఫీ తాగుతున్నాను.ఊహించని వ్యక్తి మళ్ళీ ప్రత్యక్ష్యమయ్యాడు.అతను ఎవరో కాదు...గుణ...!నా ముందు సీట్ లో కూర్చున్నాడు.ఇతను మళ్ళీ ఇలా వస్తాడని అనుకోలేదు.మాత్రల్లో ఏం తేడా నో..!

"ఇక్కడ ఎవరో మళ్ళీ చదువు మొదలెట్టి డిగ్రీ పొందుదామని అనుకుంటున్నట్లుగా ఉన్నదే" గుణ మొహం గంభీరం గా పెట్టి అన్నాడు.

"మళ్ళీ నువు ఎందుకు వచ్చావు..?" అతడిని ప్రశ్నించాను.ఎవరూ చూడటం లేదు గదా అని అటూ ఇటూ చూశాను.

"నేను చెప్పాను గదా  ముందు చేయాల్సిన పనులు ముందు చేయాలి అని..అవి ముఖ్యమని" విసుగ్గా అన్నాడు గుణ.

" దయచేసి అందరి ముందు నా పరువు తీయకు.ఇలా మాటాడుతుంటే నన్ను పిచ్చివాడనుకుంటారు.." మెల్లిగా చెప్పాను.

"అలా అయితే నేను చెప్పేది విను.మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం ఉండదు.ఆ ప్రవీణ్ ని చంపు.ఈ చిన్న పని కూడా చేయకపోతే ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను.నువు అతణ్ణి చంపు..నిన్ను పూర్తిగా వదిలేసి పోతా"  ముందుకి వంగి చెప్పాడు గుణ.

"ప్రవీణ్ ఏం చేశాడని చంపాలి..? " ఏదో కాస్త మతి ఉన్న మాటలు మాటాడతాడని ప్రశ్నించాను.నా లోని ఈగో ని మళ్ళించడానికి కూడా.

"అలా ఉంటే బాగుండేదని నువు అనుకుంటున్నావు.కాని నువ్వు దాన్ని పూర్తి గా నమ్మట్లేదు.ప్రవీణ్ కి చచ్చే అర్హతే లేకపోతే నేను నీకెందుకు కనబడతాను..?నేను నీ లోపలి స్వరాన్ని.నన్ను నొక్కేయాలని చూడకు.నేను నువ్వే ..పగ తీర్చుకో..పదా" చాలా లాజిక్ మాటాడుతున్నాడు గుణ.
"సరే..తప్పకుండా దాని గురించి ఆలోచిస్తా...ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో" సర్ది చెప్పాను గుణ తో.ఇంకాసేపు ఉంటే నన్ను పూర్తి గా ఒప్పించేలానే ఉన్నాడు.

"నీలో మార్పు రాకపోతే మళ్ళీ వస్తా" అతను కుర్చీ లోనుంచి లేచాడు.

"దయచేసి పో" అర్ధించాను.

"సరే..బాయ్" అంతర్ధానమయి పోయాడు గుణ.

నేను కూడా లేచి ఎక్స్ హాస్టల్ వేపు నడవసాగాను.గుణ చెప్పిందాకా గ్రహించనే లేదు..ప్రవీణ్ ని చంపాలనే కోరిక లోలోపల ఉందని..!అవును..నా లవర్ ని తను కొట్టేసుకొని పోవడం నాకు ఇష్టం లేదు.పుండు మీద కారం జల్లినట్లుగా మళ్ళీ ఇటీవల తను నాకు ఫోన్ చేయడం ఏమిటి పైగా..?అదేమీ నాకు నచ్చలేదు.ఆ కారణాలు చాలవా పగ తీర్చుకోవడానికి..! ఎందుకైనా అజయ్ ని కూడా ఓ మాట అడుగుదాం.యామిని విషయం లో తప్పు తనదా నాదా అనేది అజయ్ ని అడిగి అభిప్రాయం తెలుసుకోవాలి..!

అజయ్ రూం కి వెళ్ళి తలుపు కొట్టాను.అసహనం గా ఉంది.

" అదేమిటి అప్పుడే వచ్చావ్..."తలుపు తీస్తూ అడిగాడు అజయ్.

"ఒక ముఖ్యమైన సంగతి నీతో మాటాడాలి" బెడ్ మీద కూచుని చెప్పాను.

"దేని గురించి"

"ప్రవీణ్ గుర్తున్నాడా"

"యామిని బాయ్ ఫ్రెండ్ గా"

"అతని మీద నీ అభిప్రాయం ఏమిటి...చెడ్డ వాడనా"

"అలా అనను గాని,తన స్వార్ధమే తప్పా ఇతరుల గురించి ఆలోచించని రకం అని చెప్పొచ్చు"

"అలా ఎందుకు అనుకుంటున్నావు"

"నీవు సమస్యల్లో ఉన్నప్పుడు నిన్ను తను కేర్ చేయలేదు.యామిని నిన్ను విడిచివెళితే నీకు ఎలా ఉంటుంది అని ఆలోచించలేదు.తన స్వార్ధం తను చూసుకున్నాడు.మరి అలాంటి వాడిని ఇంకోరకంగా ఎలా అంటాం..?"

"ఆమె ని తను ప్రేమించి ఉండవచ్చు గా..!నా బాధని అతను అర్ధం చేసుకోలేకపోవచ్చు..అది వేరే విషయం"

" అప్పటికే ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్న ఓ అమ్మాయిని ప్రేమించడం నా సూత్రాలకైతే వ్యతిరేకం.తన పని కోసం ఇంకోడి గుండెని గాయపరచడమేగదా అది.ఎంతో మంది ఒంటరి అమ్మాయిలు..అన్ని విధాలా బాగున్న వాళ్ళు మన కేంపస్ లో ఉన్నారు.అలాంటిది ఇంకోడి ని బాధ పెట్టేలా ప్రవర్తించడం ..అది సబబు గాదు.."

" ఆమె ఏడిచేలా నేను ప్రవర్తించి ఉండవచ్చు ..దానివల్ల నేను ఓ కఠినుడి లా ప్రవీణ్ నన్ను భావించి ఉండవచ్చు"

"అలాటివి జరుగుతూనే ఉంటాయి.రాం చెప్పినట్లు గర్ల్స్ కొద్ది గా ఎమోషనల్ ..ఏ చిన్నదానికైనా ఏడుస్తారు.అంత మాత్రాన ప్రవీణ్ కి అర్హత లేదు నీ గురించి  చెడ్డగా అనుకోడానికి..!మళ్ళీ నువే కోలుకున్నాక నీ రిలేషన్షిప్ చక్క బరుచుకునేవాడివి..దానిదేముంది..?ఈ లోపులో గొప్ప పుణ్యపురుషుడిలా అతను ఎంటర్ కావాల్సిన అవసరం ఏముంది..?"

"అతను చేసింది తప్పే అంటావ్..?"

"చాలా తప్పు బ్రో"

"నా ప్లేస్ లో నువ్వే ఉంటే గనక ఏమి చేస్తావ్"

"ఏం చేస్తానో తెలీదు గానీ ఒక గుణపాఠం మాత్రం వాడికి చెపుతా.."

"ఓహో..అలాగా"     (సశేషం)    

No comments:

Post a Comment