Monday 7 May 2018

నా పేరు శివ (నవల) Post no: 49

నా పేరు శివ (నవల) Post no: 49

"నిజమేనా నువ్వు" అడిగాను.నాకు అపుడు అర్ధమయింది షిజోఫ్రెనియ కి మొదటిసారి నేను గురయినపుడు అంటే ట్రీట్ మెంట్ కి ముందు నా పరిస్థితి ఎలా ఉండేదో..!అవి పూర్తి గా గుర్తుకు రావడం లేదు లే గాని ఆ రోజులు మళ్ళీ దాపురించాయా అని భయం వేసింది.

"నువు నిజం అనుకుంటే నిజం..కాదనుకుంటే కాదు" ఆ గొంతు వినిపించింది.

"నువు నా ఊహా అనుకుంటున్నాను"

"చూడు చిన్నా..నువు నా గురించి ఏమనుకుంటున్నావు అనేది ముఖ్యం కాదు.అసలు నేను వచ్చిన కారణం ఏమిటీ అనేది ఆలోచించు.."

"నువు నా ఊహ వే అయితే నేను ఎందుకు వినాలి నీ మాట"


"పైపైన కాదు ఇంకా నీ లోపలకి వెళ్ళి చూడు.."

"నేను ప్రస్తుతం సంతృప్తికరం గా ఉన్నాను.నేను ఏ లోపలకీ దృష్టి సారించనవసరం లేదు.ముఖ్యంగా నా లోనికి"

"అదే నిజమయితే నేను నీకు వినబడను ఇలా...నువు గ్రహించాల్సిన కొన్ని నిజాలున్నాయి"

"దయచేసి అవతలకి పో"


" ఈ మధ్య కాలం లో నీ జీవితం లో కొన్ని జరిగాయి..వాటిని ఓసారి వెనక్కి తిరిగి చూసుకుందామా"

"ఏ చెత్త ని ఇప్పుడు ఆలోచించ దలుచుకోలేదు"

"నీ భాష జాగ్రత్త.పెద్దాళ్ళకి కాస్త రెస్పెక్ట్ ఇవ్వు"

"నా నుంచి నీకు ఏమి కావాలి?"

" నీకు పైపైన కొన్ని తెలియట్లేదు గాని నీ మనసు లోతుల్లో కొన్ని ఇంప్రెషన్స్ బలం గా పడ్డాయి"

"నువు చెప్పేది వింటా గాని ఆ తర్వాత నువు పోతావా"

"నేను ఏ విషయంలోనూ ఒట్టు పెట్టను,కర్మ అనేది ఒకటుంది అది తెలుసా"

"ఎటుబోయిన తప్పించుకోలేం అంటాం అదా"

"బాగా చెప్పావు.ప్రాధమిక విషయాలు మాట్లాడాక ఆ అంశానికి వద్దాం"
"ఏమిటి నీ అర్ధం.."

"అసలు నువు ఎవరు..ఈ జన్మ లో నీ డ్యూటీ ఏమిటి..?అలాటివి"

"సరే..కానీ, నేను ఎవరిని.."

"నేను ఏది చెప్పినా సాక్ష్యాధారాలతో చెపుతా..అల్లాటప్పాగా ఉండదు..అదే నా తెలివి ..తెలియదా "

"నువు ఉన్నది నా తల లో..అంటే అది నా తెలివి అని గదా "

"మరదే..!హాస్యం అంటే...!మెచ్చుకున్నాలే..!రాం ఆ విషయం లో నిన్ని మించిపోయాడులే గాని...చిన్నదానికి గొడవలెట్టుకోకూడదు మనం..కలసి చేయాల్సింది చాలా ఉంది ముందు"

"ఓ కె.."

" నీకు గాయత్రి గుర్తుందా..అదే ఆ బస్ లో పర్స్ పోగుట్టుకున్న ఆ లేడీ..?"

"గుర్తుంది.."

"పోయిన పర్స్ ని ఆమె కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నిన్ను ఉద్దేశించి ఏమంది..?"

"థాంక్స్ చెప్పింది"

"అక్కడికే వస్తున్నా..చూడు.చేతనావస్థ లో ఉన్న నీ మెదడు థాంక్స్ అనే పదాన్ని గుర్తుంచుకుంది.దాని గురించి నేను చెప్పట్లేదు.నీ అచేతనావస్థ లో కి వెళ్ళిన ఇంకో మాట ఉంది..దాని గురించి నేను చెప్తున్నా ..అది అవసరమైనపుడు ఈజీ గా బయటకి వస్తుంది.."

"అదేమిటి చెప్పు"

"ఆమె నిన్ను దేవుడు వి అని ఓ మాట అన్నది..గుర్తు లేదా?"

"పర్స్ ఎవరకి దొరికినా కాస్త బుద్ధిఉన్నవాడెవడైనా తీసుకెళ్ళి అవతల వాళ్ళకి ఇస్తారు.దీంట్లో దైవత్వం ఏముంది..? చిన్న విషయం "

" ఆమె ఆ పర్స్ దొరకాలని దేవుళ్ళకి మొక్కుకున్నప్పుడు అది నీకు అక్కడ దొరికింది.అది  కాకతాళీయమని భావిస్తున్నావా..? "

"అలాంటిదే అనుకుంటున్నా"

"అక్కడ అంతమంది ఉండగా నీకే ఎందుకు దొరకాలి.."

"అది కాకతాళీయం అని చెప్పాగా"

"వాదన అంటే నీకు ఇష్టం లా ఉందే"

"కరెక్ట్ గా చెప్పావ్"

"సరే..పోలీస్ ఆఫీసర్ ...!అతను ఏమన్నాడు నిన్ను..తన కూతుర్ని ఆ దుర్మార్గుడి నుంచి రక్షించినందుకు..?"

"దేవుడు అనా"

"నీకు గణితం అంటే ఇష్టమా ..వరుణ్"

"అవును"

"నా ఫేవరేట్ టాపిక్ దాంట్లో...ప్రోబబిలిటీ సిద్ధాంతం..నీకూ .."

"కాలిక్యులస్"

"అయితే నా వాదనని సరిగా నే అర్ధం చేసుకోగలవు నువు"

"అవును"

"అక్కడ చూడు..ఒకరికి ఒకరు సంబంధం లేని ఇద్దరు నిన్ను దేవుడు అని అన్నారు.అదీ తక్కువ కాలం లో"

"చాలా తక్కువ కాలం లో"

"అంత దగ్గర గా  సంఘటనలు జరగడం కాకతాళీయం అని అంటావా నువ్వు.."

"సరే..నీకు అర్ధమైన విషయం చెప్పు"

"నీ గురించిన సత్యం నీకు తెలియబరుస్తున్నాను.నువు దేవుడి అవతారానివి.ధర్మం నిలబెట్టటానికే నీ జన్మ.ప్రపంచం లో మార్పు తీసుకురావడానికి ముందర మన వ్యక్తిగత జీవితాల్లో మార్పు రావాలి.ఏమంటావు..?" భ్రమ నాకా అతనికా అనిపించింది.

"హ్మ్మ్"

"దేవుడు అని అనడం కంటే నిన్ను శివుడి గా నేను భావిస్తున్నా.ఎందుకంటే అదే నిజం కాబట్టి.నువ్వే శివ,శివ యే నువ్వు"

"నిజంగానా"

" అసలు శివుని అవతారం ఆ కధాకమామీషు ఏంటో తెలుసా "

"తెలీదు"

" నీ డ్రీం గర్ల్ యామిని ఉందే...ఆమె ఎవరో కాదు నీ అర్ధాంగి..పార్వతి ..!ఆమె తో నువు కలిసి తీరాల్సిందే "

"అదేలా జరుగుతుంది"

"రాం లాగా నేను డేటింగ్ పాఠాలు చెప్పను.అయితే ఒక మార్గం చెపుతా..!మీ ఇద్దరి మధ్య అడ్డంగా ఉన్నదెవరూ"

"ప్రవీణా.."

"బాగా చెప్పావ్.ఇప్పుడు కర్మ గురించి చెప్పుకుందాం.నీ దేవత ని వాడు తన్నుకుపోయాడు...అలాంటప్పుడు నువు కసి తీర్చుకోవద్దా ..?దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలుసుకోవాలా లేదా..?"

"అయితే నేనిప్పుడు ఏం చేయాలి"

"ప్రవీణ్ ని చంపి పారేయ్..!పార్వతి ని వెనక్కి తెచ్చుకో...!మీరు ఇద్దరూ జగతిని ఏలాలి  అది నేను చూడాలి"

"నాకు కొంత టైం ఇస్తావా"

"నీ యిష్టం తీసుకో..అయితే ఎంత త్వరగా అయితే అంత మంచిది.సరే...మళ్ళీ కలుస్తా"

అలా చెప్పి గుణ అంతర్ధానమయ్యాడు.ఇది నిజమా నా భ్రాంతి యా అని నివ్వెరపోయాను.ఆ రాత్రి అంతా నిద్రపోకుండా ఉండి,తెల్లారి డాక్టర్ ని కలవాలి అని అనుకున్నాను.గుణ ఇచ్చిన సలహా మీద ఆలోచించదలుచుకోలేదు.ఇప్పటికే ఒకడిని చంపి అరెస్ట్ ని తప్పించుకున్నాను.మళ్ళీ నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంకోడిని చంపితే చట్టం కూడా ఊరుకోదు.నా తల్లిదండ్రులకి అవమానం.యామిని కి కూడా..!నా మనసు లోనుంచి ఆ ఆలోచనల్ని తీసివేసుకోవడం మంచిది.చికిత్స అనేది నాకిపుడు ఎంతైనా అవసరం.(సశేషం) 

No comments:

Post a Comment