Friday 20 April 2018

నా పేరు శివ (నవల),Post no:38

నా పేరు శివ (నవల),Post no:38

జనవరి 4, 2014

ఆ బార్ లో ఆల్కాహాల్ ని తాగడానికి ప్రయత్నించి ఇబ్బంది లో పడ్డాను గదా.దాని పర్యవసానాలు తీవృంగా గాఉంటాయని అర్ధమయి ఇక మందు జోలికి పోవట్లేదు.ఓ గంట పైగానే నిద్ర లోకి జారుకున్నాను,ఆ రోజు ఆ కొద్ది బీరు తాగిన దానికే..!ఆ తర్వాత నీళ్ళు చల్లి ఎలాగో తెలివి లోకి రప్పించి ఇంటికి చేర్చారు.ఇంకా నయం..అదే సీను ని యామిని గనక చూసి ఉంటే ఘోరంగా ఉండేది.

రాం ని,అనూష ని చూసిన తర్వాత యామిని తో మాట్లాడాలనే కోరిక ఎక్కువ అయింది.ఒక రోజు ఫోన్ చేశాను.లిఫ్ట్ చేస్తుందా లేదా అని ఎదురు చూడసాగాను.

" వరుణ్" అవతల నుంచి యామిని. ఆనందమనిపించింది.

" ఎలా ఉన్నావు.." అడిగాను.

"బాగున్నా.ఇక్కడ చాలా బిజీ గా ఉన్నాను..ఏమి అనుకోకు "

"నా కాల్ కి స్పందించినందుకు సంతోషం"

"నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి..తిరుచ్చి రాగలవా ఒకసారి"

" దానికేం..ఈ రాత్రికే చెన్నై లో బయలు దేరి రేపు తిరుచ్చి లో కలుస్తా.."

"సరే..రేపు కేంపస్ లో కలుద్దాం"

"మంచిది"

" బాయ్"

"ఇప్పుడే ఎందుకు బాయ్ చెప్పడం"

" చేయవలసిన పనులు ఉన్నాయి..వెళ్ళాలి"

" సరే అయితే..రేపు కలుద్దాం" అలా చెప్పి ఫోన్ పెట్టేశాను.

మళ్ళీ యామిని ని చూడబోతున్నాననే ఆలోచన ఉక్కిరి బిక్కిరి చేసింది.ఆ ప్రత్యేక సందర్భానికి చక్కగా తయారవ్వాలి.నా అనారోగ్యం నుంచి కోలుకుని మళ్ళీ చక్కగా ఉన్నాననే ఫీల్ ఆమె కి కలగాలి.హెయిర్ కట్ చేయించుకున్నా...మంచి షర్ట్ వేసుకున్నా.చక్కగా తయారయ్యా అన్ని విధాలా.యామిని ని చూసి వస్తానని మా అమ్మ తో చెప్పి కన్విన్స్ చేసి బయలు దేరాను.బైక్ మీద కోయంబేడు బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడే బైక్ ని పార్క్ చేసి బస్ ఎక్కాను.ఈ సారి నా పొరబాట్లకి సారీ చెప్పాలి ..ఎలాగో అలా ఆమె ని బాధించకుండా మాట్లాడాలి.ఇలా ఆలోచించసాగాను.తిరుచ్చి వచ్చేసరికి తెల్లారింది.నిద్ర అంత గా పట్టలేదు.మేము మొదట సారి కలిసిన ఆ కేంటిన్ వద్ద కే వెళుతున్నట్లుగా ఉంది.ఈ సారి ఆశ కన్నా భయమే ఎక్కువ గా ఉంది.ఫలితం ఎలా ఉంటుందోనని..!

సమయం చూస్తే ఉదయం అయిదు అవుతోంది.సిగరెట్ లు కొని ఓ గంట కాలక్షేపం చేశాను.ఆ కేంపస్ లోనే బ్రేక్ ఫాస్ట్ కానిచ్చాను.సరిగ్గా ఏడింటికల్లా యామిని ని కలుస్తానికి ఆ ప్రదేశానికి వెళ్ళాను.అక్కడినుంచి కాల్ చేశాను.

" హలో" అంది నా ఫోన్ కాల్ కి .

" నా కాల్ తో నే లేచావా" అడిగాను.

" లేదు.నేను తయరవుతుండగా నువు కాల్ చేశావు,పావు గంట లో కేంటిన్ వద్ద కి వస్తాను" అన్నది యామిని.

ఆ కేంటిన్ వాతావరణం ని చూడగానే నాకు పాత జ్ఞాపకాలు మది లోకి రాసాగాయి.ఆమె కి కూడా అలా నే రావాలి.లేదా నేనే కదిపి ఆ ప్రస్తావన తీసుకురావాలి.కాసేపటి లో ఆమె కనపడింది వస్తూ..!

" హాయ్" అని ఆమె కి షేక్ హేండ్ ఇచ్చాను.

" నీ ఆరోగ్యం ఎలా ఉంది" ఆమె వాకబు చేసింది.

"మెడిసిన్స్ కొంచెం హై డోస్ లో ఇస్తున్నారు.ఫర్లేదు.అయితే మాట్లాడేదానికి కొంత ఇబ్బంది ఉంది" చెప్పాను.

"అంటే ఏవో మాటలు వినబడటం...కనబడటం ..అలాంటివి..ఓకేనా.."

" ఇప్పుడు అవేమీ లేవు"

" అయితే ఫర్లేదు.చెన్నై లో ఎలా గడుస్తోంది"

"రోజు లో సగం నిద్ర పోవడం.. సగం బోర్ గా నే ఉంది"

" బోర్ గా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు"

" ఎవరైనా ఫేస్ బుక్ ఫ్రెండ్స్ తో..చాట్ చేయడం..మ్యూజిక్ వినడం..అమ్మ వాళ్ళ తో గుడి కి వెళ్ళడం..అలా..!ఒక్కోసారి లాప్ టాప్ లో సినిమాలు చూస్తా..అర్ధం చేసుకోవడం కష్టమే.."

" అర్ధం చేసుకోడానికి ఏముంది"
"అంటే ఆ ఇతివృత్తం అదీ .."

" క్ర్రమేణా అన్నీ సర్దుకుంటాయిలే"

"అందరూ అదే అంటున్నారు"

"అది నిజమే గదా..వర్రీ అవకు..సర్దుకుంటుంది"

" అయితే ఇక్కడ నా ప్రియురాలు ఎలా ఉంది" ప్రశ్నించాను.

"నేను నీ ప్రియురాల్ని కాదు..ఓకె..?" ఆమె సమాధానం నా మొహం మీద ముష్టి ఘాతం లా తగిలింది.

" ఏమంటున్నావు.."

"ఇప్పుడు అన్నదే మళ్ళీ చెపుతున్నా...కాబట్టి తెలుసుకో ఇకనైనా.."

" మరైతే నువు.."

" కేవలం యామినిని..ఎవరి ప్రియురాల్నీ కాదు"

" నేను గతం లో చేసిన వాటికి చెంపదెబ్బ వేసినా భరిస్తా..ఈ విధంగా నువు అనడం నేను భరించలేను..నువు లేనిదే నా  జీవితం లేదు.."

"నీ పరిస్థితి కి పిటీ గానే ఉంది.కాని నన్ను దయనీయ స్థితి లోకి నెట్టకు..మత్తు లోకి జారిన నీ ఫ్రెండ్స్ అందరి కంటే నువ్వే ఇలా పాతాళానికి దిగజారావు"

"అయితే ఇప్పుడు ఏమంటావు..?"

" నా గురుంచి మర్చిపోలేనిది ఏముంది..ఇలా మాటాడి నన్ను ఇబ్బంది పెట్టకు .."

"నీ ప్రశ్న కి జవాబు చెపుతా ..ముందు ఓ కప్పు కాఫీ  తాగుదాం"

" దీనికి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.."

సరే..మొత్తానికి రెండు కాఫీ చెప్పాను.కూర్చొని తాగుతున్నాము.

" గతం లో మనం గడిపిన మధుర క్షణాలు...ఆ రోజుల్ని మళ్ళీ గడపాలని లేదా" అడిగాను.

" స్కూల్ రోజుల్లోనే ఇద్దరితో పోయావు అని నన్ను తిట్టావు..అది గుర్తు లేదా" అన్నది యామిని.

" అవి ఇప్పుడు ఎందుకు...బేబీ"

'ఆ పిలుపే వద్దనేది..!ఇంకో సంగతి నీకు చెప్పాలి.ఆ ఇద్దరు నాకు ఎలాగో నువు అంతే నాకు.అంత కంటే ఏమీలేదు.."

"అంతేనా"

" అంత హాస్యాస్పదం గా ఉన్నాయి నీ మాటలు..అర్ధం అయిందా"

"మొదట్లో నువు పాడిన ఆ డ్రీంస్ ఆన్ ఫైర్ పాటనే పాడుకుంటూ ఇప్పటికీ నువు నా తో ఉన్నట్లుగా ఫీలవుతుంటా నేను.ఆ డిప్రెషన్ వల్లనే నేను ఇలా దిగజారాను.ఇప్పటికీ అదే పాడుకుంటూ ఉంటా..ఎందుకో తెలుసా..?"

" ఎందుకు"

" నేను అలా నీ జ్ఞాపకాల్లో ఎడిక్ట్ అయిపోయాను..అదే నా దురదృష్టం"

" దానికంటే ముందు ఇంకోటి తెలుసుకో...డ్రగ్స్ వల్ల ఎలా అవుతారు అనేదానికి నువు ఉదాహరణ లా నిలిచిపోయావు..? ముందు నీ మైండ్ సెట్ మార్చుకో..."

" అది చెప్పినంత సులభమా.."

" అదంతా నాకు తెలియదు.నీ భవిష్యత్ నీ చేతి లో ఉంది.గతం లో నే ఉండిపోతావా..లేదా..ముందుకు వెళతావా అని నన్ను అడిగితే మాత్రం నేను రెండవదే కోరుకుంటాను.."

" అంటే దాని అర్ధం ఇక నన్ను ప్రేమించడం కుదరదంటావా..?" ఆమె చెప్పే ఏ సమాధానికైనా సిద్ధపడిపోయాను.

" ఆ విషయం చెప్పడానికే నిన్ను ఇక్కడకి పిలిచింది.."

" సరే..చెప్పు"

" అలా నడుస్తూ మాట్లాడదామా"

" అలాగే"

" అలా ఆ గేటు దగ్గర వరకు వెళదాము.అటునుంచి అటే నువు చెన్నై వెళ్ళిపోవడానికి అనువు గా ఉంటుంది" అన్నది ఆమె.ఇద్దరమూ నడవసాగాము.

" ఈ రోజు నాతో గడపడం లేదా ..అయితే" అన్నాను.

"సారీ.మనం ఇక కలిసి మాట్లాడటం అనేది ఇక జరగదు.ఇదే మన చివరి కలయిక.ఫ్రెండ్స్ గానే విడిపోవడం మంచిదనే ఇదంతా చెపుతున్నా"

" నాకు ఒక చివరి అవకాశం ఇవ్వకూడదా.."


" లేదు.నా ప్రణాళికలు వేరే ఉన్నాయి"

 " అంటే వేరే వ్యక్తి తోనా" అడిగాను.కన్నీళ్ళపర్యంతమయ్యాను.

" అవును" నవ్వుతూ అన్నది యామిని.
"అతని పేరు..?" నా గుండెలో పిడుగు పడినట్లుగా అయింది.

"ప్రవీణ్.నా క్లాస్ మేట్.చాలా మంచి వ్యక్తి.." మళ్ళీ నవ్వుతూ చెప్పింది.నాకు బేస్ బాల్ బేట్ తో ఆమె తల చెక్కలయ్యేలా కొట్టాలనిపించింది.

" అతడిని ప్రేమించావా" నేను నిరాశకి సిద్ధపడే అడిగాను.

" నాకు తెలియదు.కాని తను నాతో ఉన్నప్పుడు చక్కగా ఉంటుంది"

" నీకు ఆ రింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చింది తనేనా"

" అవును.తన జీవితకాల పొదుపు తో మరీ కొన్నాడు.నీ వంటి వారికది ఆలోచన కైనా వస్తుందా"

" అంటే నీకు నేను ఏమి గిఫ్ట్ ఇవ్వలేదనా..?"

" ఆ గిఫ్ట్ ..అది రింగ్ కావచ్చు లేదా కీచైన్ కావచ్చు,దాని వెనుక ఉండే భావం ముఖ్యం,ఆ తేడా కే నాకు నవ్వు వచ్చేది,ముఖ్యంగా తన ప్రేమ ప్రకటనకి"

" అంతలా ప్రేమ కలగడానికి తను నీకు ఏం చేశాడని..?"

"నువు నన్ను ఏడ్చేలా చేసినప్పుడు తను నన్ను ఓదార్చాడు.నా బాధల్ని పంచుకున్నాడు.ఎవరినుంచి పొందని అభిమానాన్ని కురిపించాడు.నా మీద ఒక కవిత కూడా రాశాడు,దాన్ని ప్రతి రేయి నిద్రకి ముందర చదువుకుంటాను.."

" సరే" నా మెదడు మొద్దుబారినట్లయింది.ఏమి మాట్లాడటానికి తోచలేదు.

"ప్రవీణ్ కనక లేకపోతే నా మెంటల్ టార్చర్ కి ఏమయిపోయేదాన్నో ఆ దేవుడికే తెలియాలి.రెండోసారి గోవా వెళ్ళినప్పుడు నువు ఎంత టార్చర్ పెట్టావో కొద్దిగా అయినా గుర్తుందా..?" అడిగింది ఆమె.

" లేదు.."

" సర్లే..వదిలెయ్"

" నువు నాకు ఇచ్చిన మెసేజ్ అర్ధమయింది"

" అది మంచిది.ఇవే నా చివరి పలుకులు నీతో.ఇక నన్ను ఎప్పుడూ ఫోన్ చేసి పిలవకు.అది ప్రవీణ్ కి ఇష్టం ఉండదు.తన కోరిక ని నేను మన్నించాలి.అదీ గాక కేంపస్ ప్లేస్ మెంట్స్ దగ్గరకొస్తున్నాయి.ఇక నేను బిజీ అయిపోతాను.."

"మంచిది"

"సరే..ఆల్ ద బెస్ట్.వచ్చే సంవత్సరం కాలేజ్ లో చేరి ఆ తర్వాత జాబ్ సంపాదించుకో.నువు కోరుకున్నవిధంగా .."

" థాంక్స్.ప్రవీణ్ కి నీకు బెస్ట్ ఆఫ్ లక్.బాయ్" అలా చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాను.ఈ బాధ నుంచి విముక్తి పొందాలి.ఎంతో ప్రేమించిన అమ్మాయి కాదన్నప్పుడు..హృదయరహితం గా ప్రవర్తించినపుడు ..నేను బతికి ఉండడం అనవసరం అనిపించింది.

గతం లో ఓసారి నేను సూసైడ్ కి ప్రయత్నించిన వాని గా ఆ అనుభవం ఏమిటో నాకు తెలుసు.సూసైడ్ చేసుకునే వారు పిరికి వారు అని అన్న ఆ వెధవ ఎవడో గాని నాకు కనపడితే వాణ్ణి ఖండ ఖండాలుగా టార్చర్ చేసి చంపుతా.వాడు తప్పు అని ఒప్పుకునేదాకా..!నిజానికి సూసైడ్ చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలి.అప్పుడు నాకది లేకపోయింది.రకరకాలు విధానాలు వెదకాలి..సులభంగా ..మొదటి అటెంప్ట్ లోనే చనిపోవాలి.అలా ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నాను.ఎంత బాధ అయినా ..ఒకసారేగా..!

అయితే నా తల్లిదండ్రులతో కొంత కాలం గడపాలి.వారికి నేను ఎంతో రుణపడిఉన్నాను.నా ఆత్మహత్య గురించి కొన్ని ఫోరం ల లో కూడా పోస్ట్ చెయ్యాలి.ప్రతి వివరం దానిలో రాయాలి.లవ్ ఫెయిల్యూర్,ఇంకా షిజోఫ్రెనియ ల తో ముగించిన కధ గా అది నిలిచిపోవాలి.ఈ జీవితం తర్వాత ఉండే జీవితం ఇంత నరకం గా మాత్రం ఉండదు. (సశేషం)   

No comments:

Post a Comment