Friday, 26 January 2018

నా పేరు శివ (నవల) Post no:8

నా పేరు శివ (నవల) Post no:8

ఆగస్ట్ 10,2011

పొద్దున్నే అయిదు గంటలకి తెలివి వొచ్చింది.ఒకటికి పోసి వచ్చిన తర్వాత నిద్రపట్టట్లేదు.ఎప్పుడో జూనియర్ కాలేజి రోజుల్లో పరీక్షలు రాసి ఆత్రుత గా రిజల్ట్స్ కోసం ఎదురు చూసిన ఆ రోజులు మాదిరి గా ఉంది ఇప్పటి పరిస్థితి.రాబోయే సన్నివేశాల్ని ఫలితం ఏదైనా ఫెస్ చేసి తీరవలసిందే అని అనుకుని నిశ్చయించుకున్నాను.

అద్దం లో నన్ను నేను చూసుకున్నాను.ఒప్పుకు తీరాలి.టాల్ అండ్ అత్లెటిక్,మంచి కలరు,చక్కని జుట్టు... అందగాడివేరా అని భావించుకున్నాను.ఎన్ని ఉన్నా తళ తళ మెరిసే నా పళ్ళ వరసే వేరు.అందుకే సాధ్యమైనంత ఎక్కువ సార్లు నవ్వాలి.అంతకన్నా ముందు ఆమె ని నవ్వేట్లు గా మాటాడాలి.

మంచం మీద పడుకొని మళ్ళీ ఒక్కసారి రాం చెప్పిన గోల్డెన్ రూల్స్ ని నెమరు వేసుకున్నాను.అయితే మొదటి రూల్ కొంచెం ఇబ్బందే..ఆత్మ విశ్వాసం తో మాట్లాడటం...! అందుకనే అతను మొదట సన్నివేశాల్ని ఊహించుకుని ప్రాక్టీస్ చేస్తే హెల్ప్ ఫుల్ గా ఉంటుందని చెప్పినది.కొన్ని పుష్ ఉప్స్ తీసి తల స్నానం కానిచ్చాను.నన్ను నేను బాత్ రూం లో చూసుకొని నీకేమి రా సూపర్ అని కితాబు ఇచ్చుకున్నాను.చక్కటి బ్లూ షర్ట్ ఇంకా జీన్స్ ధరించాను.

ముందుగా ఆమె గానకళ ని ప్రశంసించాలి.ఆ తర్వాత నా గిటార్ వాదనకి ఏమైనా సలహాలు అడగాలి.ఆమె ఏ బ్రాంచ్ లో చదువుతోంది..ఇలాంటివి అడగాలి.నా గురించి కొంత ఏదో చెప్పాలి.అయితే ఆడంబరం గా ఉన్నట్లు గాక సహజం గా మాట్లాడాలి.ఆ తర్వాత కేంటిన్ వేపు గా తీసుకు వెళ్ళాలి.చాలా సింపుల్ ప్లాన్.ఇన్స్టిట్యూట్ కి వెళ్ళే లోపు ఒక సిగరెట్ కాల్చాను.
బయటపడి మెస్ లో ఏడున్నర కల్లా ఏదో తిండి తిన్నాను.తర్వాత యామిని వాళ్ళ క్లాస్ రూం కేసి నడిచాను.ఆ లొకేషన్ గురించి ముందే వాకబు చేశాను.బ్లాక్ 3 లో 22 వ రూం.రిలాక్స్ కావడానికి గట్టిగా గాలి పీల్చి వదిలాను.స్టూడెంట్స్ అంతా లోపలికి వెళ్ళి వారి సీట్ల లో కూర్చుంటున్నారు.యామిని మొదట వరస లో ఉండి ఉండవచ్చు.నేను కారిడార్ లో పచార్లు చేయసాగాను.అలా ఓ అయిదు నిమిషాలు గడిచిన పిమ్మట నిరీక్షణ ఫలించింది.ఆమె ముందు సీటు లోనే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాటాడుతూ కనిపించింది.కరెక్ట్ గా 8 కల్లా ప్రొఫెసర్ క్లాస్ లోకి ప్రవేశించాడు.ఆహా..ఏమి సమయ పాలన..!

9.05 కల్లా క్లాస్ ముగిసింది.నేను అలానే బయట నిలబడిపోయాను...ఎర కోసం చూసే ఒక ప్రాణి లా..!నేను అనుకోవడం ఇది ఎక్స్ ట్రా క్లాస్ వంటిది.గుంపులు గుంపులు గా స్టూడెంట్స్ బయటకి వస్తున్నారు.నేను ఊహించినట్లుగానే గడుస్తున్నాయి నిమిషాలు.యామిని మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి బయటకి వచ్చింది.తగినంత దూరం లో ఉంటూనే ఫాలో కాసాగాను.ఇపుడు ఆమె ఒక్కతే కేంటిన్ వైపు రాసాగింది.అన్నీ నాకు అనుకూలం గానే జరుగుతున్నాయి.నువ్వు లక్కీ రా అనుకున్నాను.

ఆమె తినడానికి ఆర్డర్ ఇచ్చి ..ఆ ఐటెం రాగానే ని పట్టుకొని టేబుల్ వద్దకి వస్తుండగా ..ఇదే తగిన టైం గా భావించాను.రిలాక్స్ గా ఫీల్ అయి..నెమ్మది గా ఆమె టేబుల్ వేపు గా వచ్చాను." హాయ్" అని పలకరించాను.చెయ్యి చాపాను.

" మొత్తానికి ఈరోజు కి నాతో మాట్లాడటం కుదిరిందా" అన్నది ఆమె నాకు షేక్ హేండ్ ఇస్తూ.స్టన్ అవడం నా వంతు అయింది.

" ఏమంటున్నావు" నాకు కంఫ్యూజన్ గా అనిపించి ప్రశ్నించాను.

" నా ఉద్దేశ్యం ..ఇన్నాళ్ళకి నాతో మాట్లాడే ధైర్యం వచ్చిందా అని "

" ఎందుకని నీకు అలా అనిపించింది"

" ఎందుకంటే అదే నిజం గనక.ఇన్నాళ్ళకి మగవాడి లా మారావ్"

నా పాత్రని ఈమె పోషిస్తున్నదేమిటబ్బా అనిపించింది,రాం చెప్పిన గోల్డెన్ రూల్స్ అవీ జ్ఞాపకం వచ్చి..!

" ఆ రోజున ఆడిషన్స్ జరిగిన రోజునే నిన్ను పలకరిద్దామని అనుకున్నాను.అప్పుడు ఎందుకులే..అనుకొని ఇదిగో ఇప్పటి దాకా ఆగాను." ఎలాగో కవర్ చేశాను.రాం చెప్పిన రూల్స్ అన్నీ గాలికి పోతున్నాయి.ఏమైనా డామేజ్ కంట్రోల్ కాకుండా చూసుకోవాలి.

" నిజమా..లాస్ట్ సెమిస్టర్ టైం లో మా క్లాస్ రూం దగ్గర్లో కనిపించింది మీ ట్విన్ బ్రదరా " అన్నది.అంటే ఈమె కి అప్పటి రోజు బాగానే గుర్తుందన్నమాట.

" ఔను..అది నేనే.బలే గుర్తు పెట్టుకున్నావే..నన్ను ఎవరు చూసినా అంత తొందరగా మర్చిపోరు..అలాంటి రూపం నాది..నీ మాటలు అర్ధం అయ్యాయి."  కూల్ గా బదులిచ్చాను.

" అవును నువు చెప్పింది నిజమే అయితే అది మరొకలా కూడా ఉంది బ్రదర్" అంది.నా గొంతు లో ఏదో అడ్డం పడ్డట్లు అయింది.

" అది ఏమిటి సిస్టర్" అడిగాను. నేనూ తక్కువ వాడిని కాదు ఈ రకం వాటికి అన్నట్లుగా..!

" ఒకమ్మాయిని కలవడానికి వచ్చి అతని ఫ్రెండ్ ద్వారా ఆమె వివరాలు తెలుసుకొని..మళ్ళీ తిరిగి ఈ విషయం చెప్పొద్దు అని అతడిని బతిమాలడం..అది ఏ అమ్మాయి అయినా మరిచిపోగలదా "

ఆ మాటలు వినడం తో నా నెత్తి మీద సుత్తి తో మోదినట్లయింది.నా పేరు గల ఆ వరుణ్ గాడు ఎంత పనిచేశాడు..వెధవ కబుర్లు ఎన్నో చెప్పి.

" ఇప్పుడు తెలిసింది..ఆ వరుణ్ నన్ను మోసం చేశాడని " అన్నాను.

" దానిదేముంది లే..ఇలాంటివి జరుగుతుంటాయి" నవ్వుతూ అన్నది.  
" నేను ఇక్కడ కూర్చోవచ్చా" అడిగాను

" నన్ను పర్మిషన్ అడగనవసరం లేదు..కూర్చో" అన్నదామె.

" అయితే నా పేరు నీకు తెలుసు ..అంతేగా " ఆమె ముందు కూర్చున్నాను.

" వాన ఇచ్చే దేవుడి పేరు ..అదెలా మర్చిపోగలం"  అన్నది .నా వెర్షన్ ఈమె పోషిస్తున్నదే అనిపించింది.

" ఒక మంచి అమ్మాయి లా అనిపిస్తున్నావు..ఇంకా నీ గురించి చెప్పు" అన్నాను.

" ఇప్పుడు దేవత మంచి మూడ్ లో ఉంది..ఏదడిగినా చెబుతుంది.."  సరదాగా కన్ను గీటుతూ అన్నది.

" బేసిక్స్ నుంచి వద్దాము..నీ పుట్టిన రోజు ఎప్పుడు.."

" ఎందుకు ..సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనా"

" ఇప్పుడే చెపితే అది సర్ప్రైజ్ ఎలా అవుద్ది"

" నవంబర్ 12  "

" ఓ..అయితే నీ రాశి వృశ్చికం అన్నమాట" అన్నాను.

" అవును..కనక జాగ్రత్త గా ఉండాలి"

" ఆ రాశి గురించి ఒక విశేషం చెప్పగలవా"

" చాలా సీక్రెట్  లు ఉంటాయి వాళ్ళ దగ్గర"

" నీకు సంబందించి అలా అనిపించడం లేదే"

" నువ్వు ఏదడిగితే అది చెబుతున్నానని..నాకు సీక్రెట్స్ లేవు అనుకోకు.. చాలా ఉన్నాయి "

" వినడానికే భయంకరంగా ఉంది.సరే..నీ హాబీలు "

" మూడు హాబీలు...రీడింగ్...రీడింగ్..రీడింగ్.."

" అబ్బో..వెరైటీ గా ఉన్నాయ్"

" మరి నీ హాబీస్"

" గిటార్ వాయించడం" మరీ ఏం చెప్పకపోతే బాగోదని చెప్పాను.

" ఆడిషన్స్ లో బాగా ప్లే చేశావ్..ఎంత కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావ్.." అడిగింది.

" ఇంచు మించు పది నెలలు గా "

" నీకు మోటివేషన్ ఎవరు"

" అది చాలా సీక్రెట్ "

" ఓ..కాని నువు వృశ్చిక రాశి కాదే"

" కాదో ..అవునో నేను చెప్పలేదే"

" ఇలా అయితే దేవత తుఫాన్ సృష్టిస్తుంది జాగ్రత్త.."

" అది నాకు తెలుసు ..అందుకే మళ్ళీ సారి మనం కలిసినపుడు చెపుతా అది"

" మనం..మళ్ళీ కలుస్తాము అని ఎవరు చెప్పారు బ్రదర్ ?"

" అదే తాయత్తు మహిమ ..సిస్టర్ "

" నీ ఆత్మ విశ్వాసానికి అభినందనలు,నేనయితే గేరంటీ ఇవ్వలేను"
"నువు రానక్కర లేదు..నేనే కనుక్కుంటా"

" అంటే నువు వేధించే తరహా నా"

" కాదు నీ భక్తుడిని మాత్రమే.."

" నువ్వు.."  అలా అంటూ గట్టిగా నవ్వింది.టాపిక్ మార్చడం మంచిది అనిపించింది.

" నీ జీవిత లక్ష్యం ఏమిటి..?" అడిగాను నేను

" నువే ఎందుకు గెస్ చేయకూడదూ.." 

" ఓ సక్సెస్ ఫుల్ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ కావాలని.."

" అది కాదు.." 

" నువే చెపితే బెటర్ " 

"వినే ఓపిక ఉందా..చాలా పెద్దగా ఉంటుంది" 

"తప్పకుండా" 

"ఆరు నవలలు,ఆరు సంవత్సరాల్లో కాలం లో రాయాలని నా కోరిక.ఇంకా అవి బాగా అమ్ముడయి ధనం తెచ్చిపెట్టాలి.ఆ తర్వాత భావి తరాల రచయితల కోసం ఓ స్కూల్ తెరవాలనేది నా లక్ష్యం.నా స్కూల్ ఫ్లాప్ అయినా నా బుక్స్ ద్వారా డబ్బులు ఎప్పుడూ వస్తుండాలి. " 

" భవిష్యత్ మొత్తాన్ని స్కెచ్ వేసి పెట్టావే" 

" అవును..అలా ఎక్కువగా ఆశిస్తున్నా  " 

"రైటింగ్ స్కూల్ ఎందుకు..నీకు టీచింగ్ అంటే ఇష్టమా..?" 

" అదేం లేదు డ్యూడ్..నాకు సరిపోయేంత డబ్బులు వస్తాయని అంతే" 

" అరవై ఏళ్ళ దాకా రాయోచ్చు గదా..ఆరేళ్ళే రాయాలని ఎందుకు రూల్ పెట్టుకున్నావ్" 

" మనుషులకి ఉండేది తక్కువ సృజనాత్మకత.."

" అది అనంతం అంటారు గదా"

" నన్ను ఓ ప్రశ్న అడగనీ ...జీవిత అనుభవం నుంచే గదా క్రియేటివిటీ వచ్చేది.." 

" ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు" 

" అయితే విను.జీవితం ఎలా లిమిటెడ్ నో అదే విధంగా అనుభవాలు..దానితోబాటు సృజనాత్మకత నూ " 

" ఐ సీ" 

" ఉదాహరణకి నా ఇరవై ఒక్క ఏళ్ళప్పుడు నేను ఒక నవల రాస్తే అది అప్పటి వరకు నేను పొందిన అనుభవ జ్ఞానం నుంచే రాయాలి.అలా ఆరు నవలలు జీవితానికి సరిపోతాయి..మిగతావి ఎన్ని రాసినా అవి పనికిమాలిన చెత్త గానే ఉంటాయి..అది నా ఆలోచన" 

" నిజమేనేమో..సినిమా,పేయింటింగ్,రచన ఇలా ఏ రంగం తీసుకున్నా కొంత కాలానికి ఆయా క్రియేటర్స్ యొక్క శక్తి క్రమేణా తగ్గినట్లు కనిపిస్తుంది ..కాలం తో బాటు గా.." 

" నా విశ్లేషణ తో సంతృప్తి ఏనా " 

" ఇంకొకటి అడగాలి" 

" ఓ.కె.." 

" నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా "

" ఇది మన జాబితా లో లేని ప్రశ్న కదా" 

" ఇదీ ఒకరికొకరు తెలుసుకునేదేగా.." 

" నాకే గనక అలా ఉండి ఉంటే నా మాటల్ని రెండు సెకండ్ల లో కట్ చేసేదాన్ని..పది గంటలకి క్విజ్ కార్యక్రమం ఉంది ,ఇక వస్తాను"  ఆమె లేచింది.

" ఆల్ ది బెస్ట్ " అన్నాను.

కేంటిన్ బయటకి పోయి ఒక దమ్ము కొట్టి ఈ జరిగిన దాన్ని అంతా అనలైజ్ చేసుకోవాలి.రాం చెప్పిన మొదటి రెండు రూల్స్ కొత్త వాళ్ళ కి మరీ అంత సులువైనవి కావు.కాని నేను చేయగలిగాను.ఆమె కి వేరే బాయ్ ఫ్రెండ్ లేరు అనే ముఖ్య విషయాన్ని తెలుసుకున్నాను. రాం కి శుభ వార్త చెప్పాలి.గుడ్ జాబ్ వరుణ్ ..కీపిటప్..! 

*  *  *  *  * 
నవంబర్ 12,2011
కేంటీన్ లో యామిని తో మాట్లాడి మూడు మాసాలు అవుతోంది.ఒకసారి ఆమె క్లాస్ ముందు కలిసినపుడు ఫోన్ నెంబర్ అడిగితీసుకున్నాను.అప్పటినుంచి ఫోన్ లో మాటలు సాగుతున్నాయి.ఆమె ఫేవరేట్ బుక్ హారీ పాటర్,మూవీ వచ్చి ద షషాంక్ రిడెంప్షన్ ..ఆహారం లో పాస్తా..! ఆమె స్వతహ గా తమిళ్ గాని ముంబాయి లో పుట్టి పెరిగింది.ఇలాంటి వి తెలియసాగాయి.


అయితే ఇప్పుడిప్పుడే నా లవ్ గురించి చెప్పదలచుకోలేదు.నా భయం కట్ చెబుతుందేమో నని...!ఆ రోజు ఆమె బర్త్ డే..వైల్డ్ వెస్ట్ బార్ లో ఆమెతో మాటాడుతున్నాను.ఆమె కొంచెం పై స్థాయి లో ఉన్నప్పుడు నా లవ్ వ్యక్తం చేయాలని అనుకున్నాను.ఒక తొందర లాంటిదే అది..అది ఇస్స్యూ కాదిక్కడ ..ఒప్పుకుంటుందా లేదా అనేదే ప్రధానం..! 
 (సశేషం)
--English Original: Raghav Varada Rajan
--Telugu Translation: Murthy Kvvs   

No comments:

Post a Comment