ఫేస్ బుక్ కొద్దిగా తగ్గించిన తర్వాత అనుకోకుండా కొన్ని మంచి సినిమాలు చూడగలుగుతున్నాను. ఈ మధ్యనే ఓ మళయాళ చూశాను. దాని పేరు "ఆకాశింథింటే నిరం" (Akasinthinte Niram). చూసిన తర్వాత మనసు ఎంతో ప్రశాంతం గా,హాయిగా, జీవితం గురించి చక్కటి ఆలోచనల తో నిండిపోయింది. మంచి సినిమా చూడాలనుకునే వారు అందరూ తప్పక జీవితం లో చూసి తీరాలి.
గోల్డెన్ గోబ్లెట్ అవార్డ్ కి ఇంకా అనేక దేశ విదేశ సినిమా పోటీలకి ఈ చిత్రాన్ని అధికారికం గా ఎంపిక చేశారు. దానికి అన్ని విధాలా అర్హత కలిగినది ఈ చిత్రం.సినిమా అంతా ఒక దీవి లో జరుగుతూంటుంది.అండమాన్ దీవుల్లో ఉన్న నీల్ అనే 40 చ.కి.మీ. ఉండే దీవి లో సినిమా సాగుతుంది.ఏ పాత్రకి పేరు ఉండదు. కాని ఆ విషయం మనకి సినిమా చివరిదాకా ఎక్కడా తట్టదు.
ఒక చిన్న దీవిలో 60 ఏళ్ళ వృద్ధుడు. తను రకరకాల కళాకృతులు తయారు చేసి దగ్గర లో ఉన్న పట్టణానికి మోటారు బోట్ లో వెళ్ళి అమ్మి మళ్ళీ తిరిగివెళ్ళిపోతుంటాడు.దీన్ని కనిపెట్టిన ఓ దొంగ ఆ బోట్ కదిలేసమయానికి దాంట్లోకి ఎక్కి చాకు చూపించి డబ్బులు ఇవ్వమని బెదిరిస్తాడు. ఆ ముసలివాడు చిన్నగా నవ్వుతూ నీకు ఈత వచ్చా అని అంటూనే ఆ బోట్ ని సముద్రం లోకి పోనిస్తాడు.
ఈ దొంగ కి ఈత రాదు బోట్ నడపడం రాదు.తత్తరపడేలోగా సముద్రం లోకి దూరం గా వెళ్ళిపోతారు.కాసేపు ప్రయాణించి ఓ చిన్న దీవి కి చేరుకుంటారు.అక్కడ ఓ చిన్న కాటేజ్ ఉంటుంది,దాంట్లో ఓ చిన్న పిల్లాడు,ఓ యువకుడు ,ఓ యువతి ఉంటారు.ఎవరిపని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు.ఈ దొంగ పారిపోవాలని ప్రయత్నించినా వీలుపడదు.ఆ దీవి లో వారి జీవనం విచిత్రం గా అనిపిస్తుంది.
జీవితాన్ని ఇంత అర్ధవంతం గా జీవించవచ్చా అనిపిస్తుంది.ప్రకృతి ని పాడుచేఅకుండానే దానితో కలిసి జీవించడం కనబడుతుంది.అన్నట్టు ఆ ముసలాయనకి మంచి లైబ్రరీ ఉంటుంది.తోట ఉంటుంది.ఇంట్లో నుంచి చూస్తే సముద్రం ఉంటుంది.అంతే కాదు కొన్నిసార్లు మోటార్ బైక్ వేసుకుని ఎక్కడికో వెళుతుంటాదు ముసలాయన.ఈ దొంగ కి ఆసక్తి పెరుగుతుంది.కాని ఆ పెద్దాయన ఒక సమయం వచ్చినప్పుడు ఆ దొంగ ని ఆ చోటకి తీసుకువెళతాడు. అతను నిర్ఘాంతపోతాడు. అక్కడ ఏమి ఉన్నదీ తెలియాలంటే సినిమా చూస్తేనే బాగుంటుంది.
సముద్రం పక్కనే వేసిన చిన్న కాటేజ్ లు లాంటివి తప్పా పెద్ద ఖర్చు ఏమీ లేదు. కాని ఎప్పుడూ సముద్రం పక్కనే ఆ అందమైన లోకేషన్ లలో జరిగే సన్నివేశాలు మనసు ని ఎక్కడికో తీసుకుపోతాయి. డైలాగ్స్ చాలా తక్కువ.కాని ప్రతి సీను మనసు లో ముద్ర పడిపోతుంది.సినిమా ని ఆస్వాదించే కళాత్మక హృదయులు తప్పక చూడాలి.డా.బిజూ దర్శకత్వం బావుంది.నెడుముడి వేణు,ఇంద్రజిత్,అమలా పాల్ లాంటి వారు ఉన్నారు.ఈ సినిమా ప్రైం వీడియో లో ఉంది.ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి.వీలయితే చూడవచ్చును.
No comments:
Post a Comment