Monday, 16 April 2018

నా పేరు శివ (నవల) Post no:35

నా పేరు శివ (నవల) Post no:35

" నేను నీతో రెండు విషయాలు చెప్పాలి.ఒకటి చాలా ముఖ్యమైనది.రెండవది సాధారణమైనది.ఏది ముందు చెప్పమంటావు..." రాం ప్రశ్నించాడు.

" నీ ఇష్టం"

"సరే..ముందు ముఖ్యమైనదే చెప్తాను.మన కాలేజ్ పరిధి లో ఉన్న పోలీస్ అధికారి నీ గురించి అడిగాడు.నిన్ను కలిసి మాట్లాడాలి అన్నాడు.ఓ రెండు రోజుల క్రితం చెప్పిన సంగతి ఇది "

"ఏమి పని నాతో..నాతో మాట్లాడేది ఏముంటుంది"

" ఆ వివరాలు అతను చెప్పలేదు.నీ ఆరోగ్యం బాలేదని చెన్నై ఆసుపత్రి లో ఉన్నావని నేను తెలిపాను.బాగయిన తర్వాత నిన్ను ఓసారి కలవమన్నాడు"

"సరే..కలుస్తాను "

"ఆ..ఇంకొకటి...అప్పుడు ..నాకు ఓ అమ్మాయి పరిచయం అయిందని..ఒక వింత టైప్ అని చెప్పా.." నవ్వుతూ అన్నాడు రాం.

"నాకు గుర్తు రావడం లేదు"

" అదే డేటింగ్ సైట్..లో"

""సారీ మేన్..ఈ ట్రీట్మెంట్ వల్ల కొద్దిగా సమస్య ఉందిలే..గుర్తు రావట్లేదు"

"నేను చెబుతా.కంగారు పడకు.నేను ఒక అమ్మాయి లా అకౌంట్ ఓపెన్ చేసి ఆన్ లైన్ లో మరో వ్యక్తి తో పరిచయం చేసుకోవడం..ఆ అమ్మాయి తర్వాత నాకు ఝలక్ ఇవ్వడం.."

"ఆ..ఆ..గుర్తుకు వస్తోంది" నవ్వుతూ అన్నాను.

" మొత్తానికి అనేక మలుపులు తిరిగి కధ సుఖాంత మయింది.. నా ప్రియురాలిగా మారిపోయింది "
"చాలా సంతోషం...చెన్నై అమ్మాయేగా.."

"అవును"

" పేరు"

"అనూష"

"బాగుంది"

"ఆ..ఇంకోటి..."చెప్పాడు రాం.బాత్ రూం నుంచి స్మోకింగ్ ముగించి బయటకి వచ్చాము.

"చెప్పు.."

"ఇంకెప్పుడూ ఆ గంజాయి జోలికి వెళ్ళకు...నిన్ను పాడు చేసింది "

"ఇక మీదట వెళ్ళను.."నాకిలా అవుతుందని ఏ మాత్రం అవగాహన ఉన్నా దీని జోలికే వెళ్ళేవాణ్ణి కాను.

"నువు నమ్మవు.నేను పూర్తి గా మానేశాను ఆ అలవాటుని.దాన్ని తీసుకోవడం వల్ల ఏదో గొప్ప మేధోశక్తి వస్తుందనే భ్రమ లో నుంచి బయటపట్టాను.ఆ వల లో నేనూ పడి నిన్నూ లాగాను.దానికి సారీ.."

"నిన్ను క్షమించాను డ్యూడ్ ..అదేం ఫీలవ్వకు"

ఇంతలో మా అమ్మానాన్నలు లోపలికి వచ్చారు.

"వరుణ్..ఇప్పుడు ఎలా ఉన్నది" మా అమ్మ అడిగింది.

"ఫరవాలేదు మాం.రాం కి థాంక్స్ చెప్పాలి" అన్నాను.

" బ్రేక్ ఫాస్ట్ చేశావు గదా" అడిగాడు నాన్న.

"అయింది డాడ్.."

" ఇందాకనే డాక్టర్ తో మాట్లాడాము.అయిదు రోజుల్లో డిస్చార్జ్ చేస్తాను అన్నారు" నాన్న వివరించాడు.  
  "ఓహో..అయితే ఆ తర్వాత నేను తిరుచ్చి కి తిరిగి వెళిపోతాను" చెప్పాను.

"అయితే డాక్టర్ గారు..ఈ ఒక్క సంవత్సరం ఇంటి వద్దనే ఉండమంటున్నారు.ఒక వేళ కాలేజ్ కి వెళ్ళగలిగినా చదువు కి సంబందించిన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి..అర్ధం చేసుకోవడం లో ఇంకా అలా.." అమ్మ వివరించింది.

" ఏంటి మాం..తొమ్మిది నెలలు ఇంటివద్దనే ఉండాలా" నిరాశ గా స్పందించాను.

"చెన్నై లో ఉన్న గుళ్ళు అన్నీ దర్శించుకుందాము.అందరం కలిసి ఉన్నట్టూ ఉంటుంది.నీ ఆరోగ్యానికీ గాని దైవాన్ని దర్శించుకోవడం లో గాని ఒక స్వాంత్వన ఏర్పడుతుంది.." చెప్పింది అమ్మ.
" ఆనందం గా ఉండు మిత్రమా.ఇదొక వెకేషన్ లా అనుకో.ఫైనల్ ఇయర్ కి ప్రిపేర్ అవుతున్నా అనుకో.." రాం అనునయించాడు.

" ఇది ఓ సమస్య లా అనుకోకు వరుణ్..మేమంతా ఉన్నాంగా.." నాన్న మాట అది.

" సరే..ఓ రిలాక్స్ లా ఫీలవుతా చెన్నై లో ఉంటూ.." అన్నాను చివరకి.

" చాలా చక్కగా చెప్పావ్.." నాన్న ఆభినందించాడు నన్ను.అంత లో డాక్టర్ వచ్చాడు.

" హాయిగా నే ఉంది గదా వరుణ్.." డాక్టర్ ప్రశ్నించాడు.

" బాగానే ఉంది.అయితే తలనొప్పి మాత్రం అనిపిస్తోంది.ఆలోచించడానికి గాని మాట్లాడాడానికి గాని ఓపిక ఉండడం లేదు " చెప్పాను.

"తాత్కాలికంగా అలా ఉంటుంది.నిన్న ECT రెండు సిటింగ్స్ అయినాయి గదా ..బలమైన డోస్.అలా అనిపిస్తుంది.నిన్ను డిస్చార్జ్ చేసే రోజుకల్లా అంతా సర్దుకుంటుంది.మామూలు గా అయిపోతుంది.ఓ రెండు నెలల్లో నువు మొత్తం గా ఈ సమస్య నుంచి కోలుకుంటావు" డాక్టర్ చెప్పాడు.

" ECT అంటే ఏమిటి సార్" అడిగాను.

" ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపి అని..నీ విషయం లో ఆ ట్రీట్మెంట్ జరిగింది"

" నా జబ్బు కి ఏమైనా పేరు ఉందా"

" లేకేం..ప్రతి దానికి ఓ పేరు ఉంటుంది.."

"ఏమిటి అది"

" షిజోఫ్రెనియా " డాక్టర్ చెప్పాడు.

" దీని లక్షణాలు ఏమిటి"

" అర్ధం లేని మాటలు మాట్లాడటం..లేని మనుషులు ఉన్నట్లు కనబడటం...లేని శబ్దాలు వినబడటం..ఇలా .."

" అలా నాకు  జరిగిందా" ప్రశ్నించాను.

"గతం గురించి ఆలోచించకు.నీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చాము.రోజు చక్కగా మందులు వేసుకో.ఆనందం గా ఉండు.అంతా నయమవుతుంది.నేను గ్యారంటీ ఇస్తున్నాను.." చెప్పాడు డాక్టర్.

ఇక నేను ఏమీ అడగదలుచుకోలేదు.రాం చెప్పింది నిజం.ఇలాంటిది మళ్ళీ రాకుండా నా జాఫ్రత్త నేను తీసుకోవాలి.గతం ని మర్చిపోవడమే మేలు.

" థాంక్స్ డాక్టర్.." చెప్పాడు నాన్న ఆయనకి.

" ఆ దేవుడికే చెప్పాలి ఆ మాట.ఆ..అన్నట్టు ఒక ముఖ్యమైన మాట...వరుణ్..! " డాక్టర్ నాకేసి తిరిగి చెప్పాడు.

" ఏమిటి అది"

"ఎట్టి పరిస్థితి లోనూ నువు ఆల్కాహాల్ గాని ఆ మత్తు పదార్థం గంజాయి గాని వాడకూడదు.."

అక్టోబర్ 18,2013

నేను డిస్చార్జ్ అయి ఇంటికి వచ్చేశాను.ఆ చివరి అయిదు రోజులు పది ECT సిటింగ్స్ అయ్యాయి.ట్రీట్మెంట్ అయిన కొన్ని రోజుల తర్వాత కూడా నా మతిమరుపు కొనసాగింది.పొద్దున తిన్న పదార్థం ఏమిటో గుర్తుండేది కాదు.క్రమేణా ట్రీట్మెంట్ పాళ్ళు తగ్గుతూ వచ్చింది.రెండు వారాలకి ఓ సిటింగ్ ఉండేది.ఇంకో పది సిటింగ్స్ తర్వాత మామూలు జీవితం లోకి ప్రవేశిస్తాను.ఒక కొత్త జీవితం లోకి. (సశేషం) 

No comments:

Post a Comment