Saturday 18 April 2015

అయన్ ర్యాండ్ రాసిన The Fountainhead గురించి మన వాళ్ళు చాలా మంది..!

అయన్ ర్యాండ్ రాసిన The Fountainhead గురించి మన వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూలలో వాటిల్లో ఉటంకిస్తూ ఉంటారు గదా..!ఏదో ఆ హీరో Howard Roark గురించో ఇంకో పాత్ర Dominique గురించో  ,Toohey గురించో రెండు ముక్కలు చెబుతుంటారే గాని ఇంకా లోపలకి దిగి ఎవరైనా చెబుతారేమో,రాస్తారేమో అని చూస్తుంటా..నా ఎదురుచూపు అలానే మిగిలిపోయింది.నేను పలు కారణాల వల్ల పూర్తిగా  చదవలేకపోయిన నవలల్లో అది ఒకటి.మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ఏదైతే పూర్తిగా చదువుతానో దాన్నే నేను చదివిన పుస్తకంగా లెక్క వేసుకుంటాను.

650 పేజీలు పైబడిన దీన్ని చదవాలని ఎన్ని సార్లు కూర్చున్నా ప్రతి పేజీ నా సహనాన్నే పరీక్షించింది.చిత్రణ చాలా డల్ గా సాగుతుంది.చాలా సార్లు ఊసుపోక చెప్పే కబుర్లు పుంఖానుపుంఖాలుగా గుప్పిస్తున్నట్లు అనిపించేది.ప్రాచీన నిర్మాణ శాస్త్రం గురించి ఇంకా ఇప్పటి పధతుల గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది.మన హీరో Howard తన దారిలోనే తప్ప ఇంకో దారిలో ఆలోచించడానికి ఇష్టపడడు.దానికి ఆ శైలికి Objectivism అనే మాట స్థిరపడిపోయింది.కొన్ని సార్లు తమ కాలేజీ లో డీన్ తో కూడా వాదం వేసుకుంటాడు.ప్రాచీన గ్రీక్ నిర్మాణం Partheon గురించి వచ్చినప్పుడు ..ప్రతివాళ్ళు అదే రీతిలో ఆ Columns అవీ ఎందుకనీ ఈరోజుకి మన బిల్డింగ్ లు కట్టేప్పుడు కాపీ కొట్టాలి.నిజానికి అవి చెక్క తో చేసిన కొన్ని నిర్మాణాల పగుళ్ళు కనబడకుండా ఉండాలని అలా కట్టారు.బాగా గమనిస్తే అది తెలుస్తుంది.దేని అవసరాన్ని బట్టి దాని నిర్మాణం ఉండాలి.ఏ మనిషి నూరు శతం ఇంకో మనిషిలా ఎలా ఉండడో అలాగే  ఏ గృహం కట్టినా దాని కోసమే అన్నట్టు  ఉండాలి అని మన హీరో అంటాడు..!

అట్లాంటి కొన్ని  సన్నివేశాలు మాత్రం బాగున్నవి అనిపిస్తుంది.కాని ఇదే రీతి లా మన దేశం లో ఉండటం సాధ్యమా అంటే సాధ్యమే.కాని అతనికి సంసార బాధ్యతలు లేని వాడై ఉండాలి.చాలా వాటిని ఇష్టం లేకపోయినా ఎందుకు చేస్తాం మనం..మన మీద ఆధార పడిన బంధాల్ని ,బాధ్యతల్ని నెరవేర్చడానికి.ఏ కష్టం లేకుండా సాధ్యమైనంత తక్కువ కుదుపులతో జీవితం సాగించడానికి..!

ఒక్క క్షణం ఒక వెరైటీ కోసం ఆలోచించండి...మన కుమారులని ఏ ఫారిన్ కో పంపే బాధ్యత మనది కాదు.రెక్కలు వచ్చినాక వాళ్ళే పనిచేస్తూ వాళ్ళు చదువుకుంటారు.అలాగే అమ్మాయి పెళ్ళిళ్ళకి ఆ తర్వాత వారికి ఇవ్వడానికి  కోట్లు కూడబెట్టే అవసరం లేదనుకోండి....ఎవరూ ఎవరిపైనా ఆధారపడకూడదు(ఒక్క అంగవికలాంగులు,పరమ వృద్దులు తప్ప) ..అనే భావం పెరిగిన అలాంటి సమాజం లో మనిషి లోని స్వేచ్చా విహంగాలు ఇంకా పైకి ఎగురుతాయి.అన్ని శాస్త్రాల్ని ఇంకా అనురక్తి తో నేర్చుకుంటాడు..పరిశోధిస్తాడు..ఎన్నో అంచులు దాటుతాడు.ఏది ఇష్టమైతే దాన్ని మనసా వాచా కర్మణా చేస్తాడు.

మనకు జన్మతహ వచ్చే అనేక నైపుణ్యాలు పెళ్ళి తో సగం మూలబడితే ,పిల్లలు పుట్టినాక ధనం సంపాదించక తప్పని స్థితి లో మిగతావి మూలబడతాయి.అయినా కూడదీసుకుని ఏవో చేస్తూనే ఉండే మన దేశీయులు నిజంగా త్యగధనులు చాలా దేశాల వాళ్ళతో పోల్చితే..!   

1 comment:

  1. నేను కూడా కొంత చదివిన తరువాత ఆపేసాను , మళ్ళి మొదలు పెట్టాలి .
    కాకపోతే , అందులో హీరో కి అమ్మ నాన్న లు ఉండరు , బాధ్యతలు లాంటివి ఏమి ఉండవు .
    వాడిష్టమోచ్చినట్టు ఉంటాడు . ఇలా బాధ్యతలు లేకుండా హ్యాపీ గా ఎన్ని రోజులైనా ఉండొచ్చు . డబ్బు అనే మాట కి దూరంగా ఉంటె ఆ జీవితం అసాధ్యం కాదు .
    కొన్ని చోట్ల మూస పద్దతి లో కాకుండా కొత్తగా ఎలా అలోచిన్చగలమో చెప్తుంది . ఇది నా జీవితం అనుకునే వాళ్లకి ఇంకా బాగా నచ్చుతుంది .
    వెనక బోలెడంత బరువు ఉండి , తేన్చుకోలేని స్థితి లో ఉన్నవాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదు .

    ReplyDelete