Monday 6 April 2015

జీవితం గణితశాస్త్రం కాదు



మల్లి మస్తాన్ బాబు ...ఎందుకని చనిపోయిన తర్వాతనే ఎక్కువమంది తెలుగు వారికి తెలిశాడు.తెల్లారి లేస్తే సవాలక్ష ఎన్నో పనికిరాని విషయాలు,ఎక్కడో ఏ దేశం లోనో ఎవరో చేసిన చిన్న సాహసాలు ఇన్స్పిరేషన్ స్టోరీస్ అంటూ మన ముందుకు తెచ్చే మన పత్రికలు ఎందుకని అంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఇంతకు ముందు చూపెట్టలేకపోయినవి..?

172 రోజుల్లో 7 ఖండాల్లోని ఎత్తైన పర్వాతాలు ఎక్కి రికార్డు సాధించిన ఆయన ప్రతి పర్వాతాన్ని ఎక్కడానికి ఒక్కో వారం ఎన్నుకోవడం యాదృచ్చికం గా జరిగిందా లేక అనుకునేనా అనిపించింది.ఉదాహరణకి అంటార్కిటికా ఖండం లోని విన్సన్ మాన్సిఫ్ (4897 mtrs) ని గురు వారం నాడు,దక్షిణ అమెరికా లోని అకాంకగువా (6962)  ని శుక్ర వారం రోజున,ఆఫ్రికా లోని కిలిమంజారో (5895) ని బుధ వారం రోజున,ఆస్ట్రేలియా లో కొస్యుజ్కొ (2228) ని శనివారం రోజున,ఆసియా లో ఎవరెస్ట్ (8850) ని ఆదివారం రోజున ,యూరప్ లోని ఎల్బ్రస్ (5642) ని మంగళవారం రోజున ,ఉత్తర అమెరికా లోని డెనాలి (6194) ని సోమ వారం రోజున అధిరోహించారు.మస్తాన్ బాబు గార్కి కూడ కొన్ని నమ్మకాలు ఉన్నట్లు అనిపిస్తున్నది.ఆయన మరణించిన చోట భగవద్గీత,ఒక జప మాల ఇంకొన్ని వస్తువులతో పాటు దొరికాయి.    

పర్వతారోహణ జీవితం తో చెలగాటమే,ముఖ్యంగా గ్రూప్ లు గా కాకుండా ఒంటరిగా వెళ్ళడం మరీ ప్రమాదం.ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా ఉన్నట్లుండి మారే వాతావరణ మార్పులు ఊహించలేనటువంటివి.అయినా సరే..ముందుకు సాగడానికే నిశ్చయించుకునే వారి అభిరుచిని తెగువను అభినందించవలసిందే.Give every man his due అనే బ్రిటిష్ సామెత వెనుక చాలా బరువు ఉంది.చరిత్ర నేర్పిన పాఠాలు ఉన్నాయి.

ఏ మనిషి అయినా పోవలసిందే ,ఎవరూ శాశ్వతం కాదు.కాని ఒక లక్ష్యం కోసం వెళుతూ ప్రాణాలు కోల్పోవడమే అత్యుత్తమమైన గౌరవం మన శరీరానికి..అది ఏదైనా కావచ్చును.. !జీవితం గణితశాస్త్రం కాదు పరిష్కరించడానికి,అది ఒక మార్మికతకి సంబందించిన విషయం ..దాన్ని తెలుసుకోవాలంటే చచ్చినట్లు జీవించవలసిందే..అన్న ఫ్రెంచ్ తత్వవేత్త  గాబ్రియల్ మార్సెల్  గారి మాటల్ని ఈ సందర్భగా ఉటంకిస్తూ..  !! 

1 comment:

  1. భారత దేశం గర్వించదగ్గ సాహస వీరుడు మల్లి మస్తాన్ బాబు గారికి నివాళులు.

    ReplyDelete