"మృతనగరం లో" ఇది ఒక తెలుగు నవల.రాసిన వారు చిత్రకొండ గంగాధర్. ఈ పేరు ఎక్కడో ఎప్పుడో విని ఉంటారు.నేనూ అంతే.అయితే ఈ పుస్తకం ఈ నెల 25 వ తారీఖున నా చేతికి వచ్చింది,ఓ సాహితీ మిత్రుని ద్వారా.విచిత్రం గా జనవరి 25 నే రచయిత పుట్టినరోజు కూడా.ముందు మాటల వల్ల అది తెలిసింది.
37 ఏళ్ళ ప్రాయం లోనే తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నో నగరాల్లో చిన్నా చితకా శ్రామిక వృత్తుల్ని స్వీకరించి,ఓ వేపు పనిచేసుకుంటూనే మరో వేపు ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్నాడు.కవితలు రాసుకున్నాడు.ఓ నవల కూడా.ఈ పుస్తకం అదే.తను పుట్టింది శ్రీకాకుళం జిల్లా లోని బొడ్డపాడు అనే గ్రామం లో.జీవితాన్ని ఎంతో కొంత సాఫీ గానే లాగించగల పొలం పుట్రా ఉన్నప్పటికీ ఎందుకనో ఒకలాంటి జిప్సీ జీవితాన్ని ఎంచుకున్నాడు.
అసామాన్య మేధోకృషి చేస్తూ ఓ సామాన్యుడి గా జీవించాడు.ఒక్కొక్కరి జీవితం విచిత్రమైన మలుపు ఎందుకు తీసుకుంటుందో దానికి గల కారణాలు ఏమిటో మనం ఊహించడం కష్టం.ఈ నవల చదివాను.చదివిన తర్వాత రెండు మాటలు రాయాలనిపించింది.Eccentric,enigmatic and apocalyptic రచన గా అనిపించింది.చదువరి కి వెంటనే అర్ధం కాదు,తాను ఎక్కడైనా దారి తప్పానా అన్న యోచన కలిగి..ఇంకొంత ముందుకు పోగానే ఏదో దారి దొరికింది లే అనిపిస్తుంది.ఇకారస్ అనేవాడు ప్రధాన పాత్ర.గ్రీకు పురాణాల్లో ఈ పాత్ర తగులుతుంది. తండ్రి చెప్పిన మాట వినకుండా సూర్యుడికి చేరువ వెళ్ళి రెక్కలు కరిగిపోయి కిందపడి చనిపోతాడు.
ఇంకో పాత్ర ఎడ్వర్డ్ ...వీళ్ళిద్దరూ మనుషులంతా అంతమై పోయిన ఓ నగరం లో జీవిస్తుంటారు.అదీ దారు శిల్పాల్లో.మధ్య లో స్టోకర్ అనే పాత్ర వస్తుంది.పికాసో బొమ్మ లాగా సాగుతుంది కథ.రచయిత తనలోని ఎన్నో కలగాపులగమైన భావాల్ని ఓ చోట కుప్ప పోసినట్లుగా అనిపించింది.రచయిత చనిపోయిన తర్వాత ఇది ప్రచురించారు కనుక మనం తనని లీల మాత్రం గా నైనా అడగలేము.ఎవరికి వారు చదువుకుంటే ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధం కావచ్చునేమో.
గంగాధర్ ఇంటిపేరు చిత్రకొండ.ఇదేమిటబ్బా ఒరిస్సా లో మల్కాన్ గిరి జిల్లా లో ఇదే పేరు తో ఓ ఊరు ఉంది గదా అనిపించింది. ఈ రచయిత ఆ ఊరి లో కూడా కొంత కాలం ఉన్నట్లు దాని మీద ప్రేమ తో ఆ పేరు పెట్టుకున్నట్లు తర్వాత తెలిసింది. ఆ విధం గా ఆ ఊరికి ఓ ప్రత్యేకత సమకూరింది.మనిషి మనసు అన్నిటికంటే విచిత్రమైనది.అది ఎప్పుడు ఎందుకు ఏ కారణాల చేత ఎలా ప్రతిస్పందిస్తుందో ఎవరమూ ఊహించలేము.చిత్రకొండ గంగాధర్ గారి నవల చదివి అతని భావప్రంచం లో మీరూ పాలుపంచుకోవాలంటే చిరునామా ఇది..! పల్లవి పబ్లికేషన్స్,ఫోన్ :98661 15655, 89856 08936
----- మూర్తి కెవివిఎస్
No comments:
Post a Comment