Wednesday 25 February 2015

అది గ్రహించనన్నాళ్ళు హిందూ మతానికి నిష్కృతి లేదు.."

మదర్ థెరెస్సా పై మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు.కాని అంత మాత్రం చేత పూర్తిగా ఆమె ని తప్పు పట్టలేము.ఒక్కో మతానికి ఒకో స్వరూపం ఉంటుంది.ఒక అర్ధం ఉంటుంది.లోకం పట్ల అది నెరవేర్చవలసిన కర్తవ్యం ఉంటుంది.ఎవరి ఇంట్లోనుంచి వాళ్ళు చూస్తే మరో ఇల్లు అదోలా కనిపిస్తుంది.కొన్నేళ్ళ క్రితం బైబిల్ ని అసలు ఏమున్నదో తెలుసుకోవాలనే ఆసక్తి కొద్ది చదివాను.చాలా నెమ్మెదిగా ఒక ఆసక్తి తో మాత్రమే చదివాను. చాలా కొత్త ద్వారాలు తెరుచుకున్నట్లు అనిపించింది. ఒక గొప్ప ఆర్గనైజేషన్ స్పిరిట్ ని మనిషిలో నింపే భావజాలం దానిలో అలుముకుని ఉన్నది.పైకి శాంతి సందేశం లా ఉన్నప్పటికి అంతర్లీనంగా పోరాట స్వభావం ని నింపుతుంది.ముఖ్యంగా అపోస్తలులు పాల్ వంటివారు ఎలాంటి ఎదురీతల్ని ఈది ..దానిని ఎలాంటి భావ యుక్తమైన మాటల్లో చెబుతారంటే రోమాంచితమవుతుంది.

అసలు ఆత్మల్ని సంపాదించడమే బైబిల్ లో చెప్పిన అసలు విషయం.ఇక్కడ దాని అర్ధం అన్య మార్గాలనుంచి మనుషులని ఇవతలకి చేర్చడమే.అది ఆ గ్రంధం నమ్మిన వారికి శిరోధార్యమే తప్ప ఇంకోలా ఎలా కనబడుతుంది.దానికి కోసం సేవ అనే మార్గాన్ని ఎన్నుకోవడం వారికి తప్పు కాదు.పంట విస్తారంగా ఉంది గాని కోసే పనివాళ్ళు బహుకొద్దిగా ఉన్నారని చెప్పబడుతుంది ఓ చోట.అసలు ఏ ప్రతిఫలం లేకుండా ఏ మనిషి అయినా ఏ పని ఎందు  చేస్తాడు. ప్రేమ యోగం అనేది బైబిల్ లో ప్రయోగించబడింది.అయితే హిందూ మతం చాలా ప్రాచీన కాలం లోనే ఈ స్వరూపాలన్నిటినీ అర్ధం చేసుకున్నది.అంటే దాని అర్ధం.. పై పై పూజలు పునస్కారాలు చేసి అదే భారతీయ ధర్మం అని ప్రవచించే వారిగురించి నే చెప్పడం లేదు.భారతీయ ధర్మం యొక్క శాపం దాని ప్రాచీనతే...అంతు తెలియని ప్రాచీనత..దాన్ని ఎలాగైనా మార్చి మార్చి అర్ధాలు చెప్పుకునే అవకాశం ఉండటమే..!అక్కడే వచ్చింది తంటా..!

అందుకనే సేవ అనే భావాన్ని ఆధునిక కాలం లో భారతీయ ధర్మం లోకి రామకృష్ణ మిషన్ ద్వారా ప్రవేశపెట్టారు స్వామి వివేకానంద.తోటి సాధువులు సైతం ఆయన్ని ఈ విషయం లో విమర్శించారు..ఆత్మ జ్ఞానాన్ని అందిస్తే చాలు గదా...మనిషికి భౌతిక పరమైన సేవ అందించవలసిన అవసరం ఏముంది అని ప్రశ్నించినప్పుడు....ఆయన ఇలా అన్నారు "ఎంతో సాధన కలిగిన ఒక రుషి  కి ఏర్పాటు చేసే నియమాల్ని మనం సాధారణ మనిషి కి ఆపాదించి అలా చేయాలని ఆశిస్తాం..అది సరి కాదు...అక్కడే పొరబాటు జరుగుతున్నది.అందుకే రామకృష్ణుడు మళ్ళీ అవతరించింది.. !ఒక అంత్య కులజుని తో భోజనం చేయడానికి మీకు అహం అడ్డు వస్తుంది..అదే అతను ఒక ఇంగ్లిష్ పేరు పెట్టుకొని మతం మారి వస్తే మటుకు నీవు అతడిని ఆహ్వానిస్తావు.నీ మతం వారిని తృణీకరిస్తే వారు అతడినిపూజారి గానే   చేశారు.అలాంటప్పుడు నీ మతం లో అతను ఎందుకుండాలి.వారు మతం మారుతున్నది ధనం కోసం కాదు తమ ఆత్మ గౌరవం కోసం.అది గ్రహించనన్నాళ్ళు హిందూ మతానికి నిష్కృతి లేదు.."

1 comment: