Showing posts with label DREAMS. Show all posts
Showing posts with label DREAMS. Show all posts

Thursday 18 August 2022

ఇన్నాళ్ళకి ఓ కలని మాటల్లో బంధించగలిగాను

 తెల్లవారుఝామున అనగా బహుశా, నాలుగున్నర అయిదు మధ్యలో అనుకుంటా ఒక కల వచ్చింది.అసలు ఏవైనా కలలు వచ్చినా తెల్లారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుందాం అనుకుంటే ఎందుకో నాకు అసలు గుర్తుకు రావు.మరుపు కమ్మేస్తుంది.కల వెలిసిపోయిన తరవాత...ఆ ...ఇదేగా గుర్తుండదా అనిపిస్తుంది...తీరా జ్ఞాపకం తెచ్చుకోబోతే షరా మామూలే. అది కాస్తా మసకబారి మస్తిష్కం నుంచి తుర్రుమంటుంది.ఇది చాలు ...మన మనసు మన ఆధీనం లో ఎప్పుడూ అలా ఉండదు అనడానికి.

అయితే ఈసారి మాత్రం అలాకాదు. సాలిడ్ గా గుర్తుంది.కనుక ఓ బ్లాగ్ పోస్ట్ రాయాలనిపించింది.కల కి మొదలు చాలా స్పీడ్ గా ఉంటుంది.పరిచయాలు అవీ ఏవీ ఉండవల్లే ఉంది. మరి అది ...ఒక రోడ్డు...ఎర్రటి తారు రోడ్డు.అలాగని మరీ రక్తపు రంగు లో లేదు.ఒక సాధారణ రోడ్డు...ఆ రోడ్డు ని అక్కడక్కడ ఎవరో చెక్కేశారు. కనక దాని కింద నల్లని రోడ్డు కనబడుతోంది.అదేంటబ్బా ...విచిత్రం గా ఉంది రోడ్డు అనుకుంటున్నాను.

దారికి రెండు వైపులా పెద్ద చెట్లు.చల్లటి గాలి.చల్లటి నీడ.నిశ్శబ్దం గా ఉంది.పడుకున్న శరీరం సైతం చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నది.అలా చూస్తుండగా నేను ఎక్కిన ఏదో వాహనం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది.అరే అనిపించి... నడుచుకుంటూ వస్తున్నాను. ఏదో వేరే రాష్ట్రం లో అడుగుపెట్టినట్లు అనిపించింది.ఒక గ్రామం లా ఉంది.ఎటు చూసినా పచ్చని చెట్లు.కొబ్బరి చెట్లు ఇంకా ఇతర చెట్లు ఎత్తుగా కనిపిస్తున్నాయి.వాటి సందుల్లోంచి చూస్తే ఒక పొడవాటి,ఎత్తైన తెల్లని భవనం అగుపిస్తోంది.అరే ఇక్కడ ...ఇలాంటి భవనమా..అనుకుంటూండగా మరో దృశ్యం కనిపించింది.

పాతకాలపు గురుకులం లా ఉన్న ఓ కుటీరం ...దాంట్లోని బెంచీలన్నీ కొత్తగా నిగనిగలాడుతున్నాయి.అన్నీ చెక్కవే.దగ్గరకి వెళ్ళి చూస్తున్నాను.అంతలోనే  ఇస్కాన్ వారి తరహా లో ధోతీ లో ఉన్న ఓ పెద్ద మనిషి రాగా,నా గురించి చెబుతుండగా ...సరేసరే మీ ఇష్టం చూడండి అన్నాడాయన.అంతలోనే కొంతమంది స్త్రీలు ఆరేడుగురు బిలబిలమని వచ్చారు.పైనున్న మెట్ల మీదినుంచి.ఏదో మాటాడుతున్నారు గాని అర్థం కావడం లేదు.వాళ్ళ చీరె కట్టు సౌరాష్ట్ర ప్రాంతం లా అనిపించింది.ఆ తర్వాత ఆ మనుషులంతా కనబడలేదు.

ఎటూ చూసినా పచ్చని ప్రకృతి.మనసుకి హాయిగా అనిపించసాగింది.అలా అలా ... తెలివి వచ్చింది. ఈసారి ఎలాగైనా ఈ కల గుర్తుపెట్టుకోవాలని కొన్ని సంకేతపదాలు పెట్టుకున్నాను.విచిత్రం గా ఈసారి కలమాత్రం మరుపు రాలేదు. రోజంతా హాయిగా అనిపించింది.ఆ గ్రామం పదే పదే కళ్ళముందే కనిపిస్తోంది.అది ఎక్కడుందో ...తెలిస్తే బాగుండును.వెళ్ళాలని మనసు లో ఓ కుతూహలం.కొన్ని కలలు అంతే...!ఎన్ని మాయాజాలాలో ఈ దేహం లో...నిజం కంటే నిజం అనిపిస్తుంది ఒక్కో కల.