ఆ రెండు చెట్లు (కథ)
నేను బస్సులో నుంచి ఇవతల ఉన్న కిటికీ గుండా చూడగానే, బండారిగూడెం అనే గ్రామం కనబడింది. అంటే ఆ బోర్డ్ కనబడింది. నిజానికి ఆ గ్రామం కొద్దిగా లోపలికి ఉంటుంది. గ్రామం లో ఉన్న ఇళ్ళు లీలగా,ఆ మధ్య లో ఉన్న తాడి చెట్లు సందుల్లోనుంచి కనబడుతుంటాయి. ఒకప్పుడు చెట్లు చాలా దట్టంగా ఉండేవి. ఎన్ని రకాల చెట్లో ఉండేవి. కానీ ఈ పాతికేళ్ళలో పచ్చదనం బాగా తరిగిపోయింది. జ్ఞాపకాలు ఒక్కసారిగా ముంచెత్తాయి.
రమారమి పాతికేళ్ళ క్రితం ఈ గ్రామం లోనే తనకి సెకండరీ గ్రేడ్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది.జాయిన్ అవడానికి ఎంతో ఉత్సాహంతో,ఉద్వేగం తో వచ్చాడు. వస్తూంటే దారికి ఇరువైపులా వాయిలు పొదలు,మోదుగు పూల చెట్లు,తంగేడు పొదలు పరుచుకున్నట్లుగా ఉండేవి. వాటి నుంచి ఒక ప్రత్యేకమైన సువాసన గుబాళించేది.దాన్ని ఇదీ అని చెప్పలేము.అవి అనుభవం అయితేనే తెలుస్తుంది.ఏ కొద్దిగా వాన పడినా పైనుంచి ఎక్కడినుంచో గుట్టల లోనుంచి వరద నీరు వచ్చి మా బడికి ఉన్న బాటని నింపేసేది.
అప్పుడు మేము ప్యాంట్లు మోకాళ్ళదాకా లాక్కొని వరద దాటి బడికి వెళ్ళేవాళ్ళం. "ఎందుకు సార్...ఇంత వాన ల్లో బడికి రావడం...ఈ రోజుకి ఆగితే పోయేది గదా" అనేవాళ్ళు ఊరి లో ఉండే పెద్దలు. "మాకు ప్రభుత్వం ఇస్తున్న జీతం కి ఎంతో కొంత న్యాయం చేయాలి గదా...ఈపాటి వానావరదలకే జడిస్తే ఎలా...ఈ మాత్రం ఉద్యోగం రాక ఎంతమంది అలమటిస్తున్నారో తెలుసా మిత్రమా" అనేవాళ్ళం. వాళ్ళు కూడా మాతో ఎంతో మంచిగా ఉండేవాళ్ళు.సరే...మనం ఎంత చేసినా ఎప్పుడూ అసూయ పడే బ్యాచ్ కూడా ఊళ్ళో ఎలాగూ ఉంటుంది.కాకపోతే వాళ్ళూ మంచిగానే నటిస్తూ అవకాశం వచ్చినప్పుడు తమ నిజరూపాల్ని చూపిస్తారు.
వానాకాలం పరిస్థితి ఆ విధంగా ఉంటే ,ఎండాకాలం ఇంకోలా ఉండేది.ముఖ్యంగా ఒంటిపూట బడులు మొదలైనపుడు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం బస్ స్టాప్ కి వచ్చేవాళ్ళం ఇంటికి వెళ్ళడానికి..! బస్ స్టాప్ అంటే అక్కడ ఓ పెద్ద నేరేడు చెట్టు ఉండేది రోడ్డుకి పక్కన. దాని కిందనే నిల్చోవాలి బస్ కోసం.అదే మా బస్ స్టాప్,అంతే..! ఐతే మాత్రం ఏం...ఆ ఎండాకాలం లో ఎంత చల్లగా ఉండేదని దానికింద..!అప్పుడప్పుడు లటుకు లటుకు మని కిందపడే ఆ నేరేడు పళ్ళు. వాటిని ఏరుకుని బ్యాగ్ లో వేసుకునేవాళ్ళం. మాది ప్రాథమికోన్నత పాఠశాల ,కాబట్టి ఏడవ తరగతి దాకా ఉండేది.ఇద్దరం పర్మినెంట్ ఉపాధ్యాయులం, మిగతా ముగ్గురు వలంటీర్లు ఉండేవారు.
ఒక సోమవారం బస్సు దిగాము. లోనికి వెళ్ళబోతూ రోడ్డు వారగా చూస్తే అక్కడ అంతా బోడిగా ఉంది. ఆ నేరేడు చెట్టు లేదు.ఎవరో గాని మొదలంటా నరికేశారు. అరే..అంత పెద్ద నేరేడు చెట్టుని ఒక్క రోజు లో ఎలా నరికేశారబ్బా అని నిర్ఘాంతపోయాను. అయినా అంత పెద్ద పచ్చని చెట్టు ని ఎలా నరకాలనిపించింది.మనుషులేనా వాళ్ళు..? ఊళ్ళోకి వచ్చిన తర్వాత పిల్లల్ని వాకబు చేస్తే ఏమో సార్ మాకు తెలియదు అన్నారు.బళ్ళోకి అప్పుడప్పుడు ఏదో పని మీద వచ్చే యువకులు ఇద్దరు కలిసినపుడు అడిగాను. వాళ్ళూ చెప్పలేకపోయారు.అయితే ఏదో నిజం దాస్తున్నట్లుగా అనిపించాయి వాళ్ళ ముఖాల్ని పరిశీలిస్తే..!
బంగారం లాంటి నేరేడు చెట్టు ని నరికేశారు గదా...ఇపుడు బస్సు కోసం వెయిట్ చేయడానికి దేనికింద నిలబడాలి. రోడ్డు కి అవతల వేపున పది మీటర్ల దూరం లో ఓ కానుగ చెట్టు కనిపించింది. ప్రాణం లేచి వచ్చింది. బడి అయిపొయిన తర్వాత అక్కడే బస్సు కోసం నిరీక్షిస్తూ ఉండేవాళ్ళం. కానుగ చెట్టు గాలి మంచిదని పెద్దవాళ్ళు చెబుతుంటారు. ఇపుడు రెండూ కలిసి వచ్చాయి. అలా ఓ వారం రోజుల పాటు ఆ చెట్టు కిందనే నిల్చునేవాళ్ళం. విచిత్రం గా ఏం జరిగిందో ఏమో ,మళ్ళీ ఓ ఆదివారం పూట ఆ కానుగ చెట్టు ని ఎవరో నరికేశారు.
మతిపోయింది. ఎవరబ్బా ఈ అదృశ్య వృక్ష హంతకులు..? అయినా మేము నిలబడి ఉన్న చెట్ల నే పనిగట్టుకొని నరకడం ఏమిటి..?దీంట్లో ఏదో కుట్ర కోణం ఉంది అనిపించింది. మేము కావాలని ఇక్కడ ఎవరికి ఏ హానీ చేయలేదు.కాని ఎందుకని పనిగట్టుకుని ఇలా చేస్తున్నారు అనిపించింది. అంటే మేము ఇక్కడ చెట్టు నీడ లేక బాధపడాలని వాళ్ళ ఉద్దేశ్యం అన్నమాట.ఎంత కౄరమైన మనుషులు ఉన్నారు ఈ లోకం లో...!మనం ఏ హానీ చేయకపోయినా ,మనకి కీడు తలపెట్టే మనుషులు..! వాళ్ళెవరో తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది.
మా దగ్గరే పనిచేసే ఓ విద్యా వలంటీర్ స్థానికం గా ఉంటాడు. విషయాన్ని అతనికి వివరించి ఆ అదృశ్య వ్యక్తుల్ని ఎలాగోలా కనిపెట్టమని చెప్పాము.కొన్నిరోజుల తర్వాత తను కనుగొన్న ఆ రహస్యం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. ఆ చెట్ల ని కొట్టింది స్థానిక నివాసులైన ఇద్దరు యువకులే కాని దాని వెనకాల ఉన్న శక్తి మాత్రం ఎవరో కాదు గతం లో ఇక్కడ పనిచేసి వేరే మండలం లో ఉద్యోగం వెలగబెడుతున్న ఓ ఉపాధ్యాయుడే. దానికీ ఓ కారణం ఉంది.పేరు కి అతను టీచర్ అయినా ,ఓ పొలిటీషియన్ లా ఫీలవుతూ కొంతమంది రాజకీయుల తో రాసుకుపూసుకు తిరుగుతుంటాడు.ఏనాడు నోరు తెరిచి పాఠం చెప్పడు,యూనియన్ పనులు అంటూ తిరుగుతుంటాడు.
తను ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్కూల్ కి మంచి పేరు వస్తుండడం తో తట్టుకోలేక ఇక్కడ ఉన్న తన గూఢచారుల ద్వారా ఈ పనికిమాలిన పనులు చేయిస్తున్నాడు.ఇక లాభం లేదనుకుని ఊరి లోకి పోయి లోతుగా వాకబు చేస్తే, ఆ పొలిటికల్ టీచర్ ఇక్కడ చేసిన వెధవ పనులన్నీ బయటబడ్డాయి. దాంట్లో చిన్నపిల్లల్ని తడిమిన అసహ్యమైన ఉదంతాలు సైతం ఉన్నాయి. ఈసారి గనక వాడు మన పైన ఏమైన దుష్టప్రయోగాలు చేస్తే ఆ పేరెంట్స్ ద్వారానే బుద్ధి జెప్పిద్దాం అనుకున్నాం. ఈలోగా ఓ వార్త ని పేపర్ల లో చదివి అవాక్కయ్యాము. అతగాడు స్కూటర్ మీద వెళుతూ ,ముందు వచ్చే లారీ ని తప్పించబోయి అక్కడ రోడ్డు పక్కనే ఉన్న రెండు చెట్లని ఢీకొట్టి అపస్మారకస్థితి లో పడిపోతే ఎవరో ఆసుపత్రి లో చేర్చారని..!
----- మూర్తి కెవివిఎస్
దుష్ట మనస్తత్వం కలవారిని ప్రకృతి ఎదో ఒక రూపంలో శిక్షిస్తుంది అండీ. వాయిలు చెట్లు అనే మాట చాలాకాలం తర్వాత విన్నాను . వేసవి ప్రారంభంలో నేరేడు కాయలు రావండి ..తొలకరి తర్వాత జూలై నెలలో వస్తాయని నాకు తెలిసిన విషయం . ఇప్పుడంటే మార్చిలోనే వస్తున్నాయి అనుకోండి :)
ReplyDelete