Wednesday, 5 April 2017

వొట్టి బండ (కధ)

 వొట్టి బండ (కధ)
-మూర్తి కెవివిఎస్

ఆ రోజున రమేష్ బడి కి వచ్చాడా అని చెప్పి చూశాడు శ్రీనివాస్.రమేష్ అంటే ఎవరో వి.ఐ.పి.కాదు,ఆ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదివే ఒక కుర్రాడు.ఇక శ్రీనివాస్ ఆ బళ్ళో ఇంగ్లీష్ మేష్టారు.ఆ..వచ్చాడు,పక్క రూం కి వెళుతున్నట్లు గా పోతూ ఓ కన్ను వేశాడు ..మొత్తానికి కనిపించాడు.నీలం రంగు చొక్కా.రెండవ వరస లో..!తరవాతి పీరియడ్ శ్రీనివాస్ దే. వాడికేసి  చూడటానికే అదోలా అనిపిస్తోంది.ఇక క్లాస్ కి ఎలా పోవాలి.మనసు మూలిగింది.అయినా తప్పదు తన పని తాను చేయాలి గదా అనుకున్నాడు శ్రీనివాస్ .ఇలాంటి పరిస్థితి తనకి ఎప్పుడూ రాలేదు.అయినా నిండా పదిహేనేళ్ళు లేని వాడికి నువ్వు భయపడేది ఏమిటి...మరో వేపు తల ఎత్తుతున్న ఆత్మ విశ్వాసం.

అవును ఇంతకీ ఆ విద్యార్థి కి ఈ ఉపాధ్యాయుడు భయపడడం ఏమిటి అనుకుంటున్నారా..?అది నిజం చెప్పాలంటే భయం అని కూడా చెప్పడానికి లేదు.ఒక బెరుకు అనవచ్చును.పొరబాటు చేసి మళ్ళీ అలా ఎందుకు చేశానా అనుకున్నప్పుడు హృదయం మూలిగే ఒక మూలుగు అది.మొహం చెల్లని తనం అంటారే అలాంటిది.ఇంత ఎందుకు...అసలేమిటి జరిగింది అనిగదా మీకు అనిపిస్తున్నది.సరే..దానికే వస్తున్నా..కొంచెం వెనక్కి వెళదాము.ఎంతో వెనక్కి కాదు.నిన్నటి రోజు కి వెళదాము.లేనిదే మనకి పూర్తి గా బోధపడదు మరి అసలు విషయం.

అది నరసా పురం అని ఓ గ్రామం,ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.చక్కని రిజల్ట్ రావడం,మంచి స్టాఫ్ ఉండడం వల్ల ఫ్రీ గానే చక్కని పబ్లిసిటీ వచ్చింది.ఆహ్లాదకరమైన వాతావరణం...సరిపడా భవనాల వసతి ఉండటం,దానిమీదట ఇంగ్లీష్ మీడియం సైతం ఉండటం వల్ల అక్కడ సీటు కోసం మంచి పోటీ యే ఉంటుంది.మనం పేపర్ ల లో   రకరకాల నెగిటివ్ వార్తలు సర్కార్ బడుల గురించి చదివి మొత్తం అన్నీ అలాగే ఉన్నాయి అనుకుంటాము గాని ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి కాని పని గట్టుకొని గోరంత ని కొండత గా చెప్పుకునే పబ్లిసిటీ ఎత్తులు వీరికి ఉండవు..అంత అవసం ఏముంది లే అని కూడా కావచ్చును.

ఆ చుట్టు పక్కల ఉన్న రమారమి పదిహేను గ్రామాల నుంచి పిల్లలు వచ్చి చదువుకుంటూంటారు.సమీపం లోని గ్రామాల పిల్లలు సైకిళ్ళ మీద వస్తుంటారు.కొంత మంది నడుచుకుంటూ వస్తుంటారు.ఏదో ఒక కబుర్లు చెప్పుకుంటూ ఖుషీ గా ఉదయానే స్కూలు కి చేరుకుంటారు.అప్పటికి కొన్ని సార్లు తాళాలు తీయరు.అది వారికి సంతోషం కలిగించేదే.పుస్తకాలు ఏ వేప చెట్టు కిందనో,కానుగ చెట్టు కిందనో పెట్టేసి ఆటల్లో మునిగిపోతారు.అయితే రోడ్డు మీదికి వచ్చే ది తక్కువ.పర్ణశాల కి వెళ్ళే రోడ్డు కావడం మూలాన ట్రాఫిక్ బాగా నే ఉంటుంది.కనక గేట్లు వేసి కొంతమది పిల్లలు కాపలాగా ఉంటారు.అది క్రమశిక్షణ లో ఓ భాగం.

ఏదైనా మనకి దగ్గరగా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు.బాల్యం అటువంటిదే.ఆ దశ దాటినతర్వాతనే దాని విలువ తెలుస్తుంది.అందునా ఆడుతూ పాడుతూ చక్కగా విద్య ని పొందే వీలున్న ఈ పాఠశాలలో...చక్కని ప్రకృతి లో గడిపే ఈ వీలు ఎంతమందికి ఉంటుంది.తమ జీవితాల్లో ముందుకి వెళ్ళిన తర్వాత అర్ధం అవుతుంది ఎటువంటి చదువుల బడి ఒడి లో తాము గడిపింది.ఇక్కడ చదివి ఎన్నో ఉన్నత స్థానాలకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు.అది ఇక్కడ ఉన్న వట వృక్షాలని అడిగితే కధలుగా చెబుతాయి.కాని వాటికి నోళ్ళు లేవు గదా..!!

ఆ రోజు సోమ వారం.పిల్లలంతా నూతన ఉత్సాహం తో ఉన్నారు..క్లాస్ లో.సరే..ఉద్యోగులు విషయం కొంచెం వేరు గా  ఉండవచ్చునేమో.హాయి అయిన రోజుని దాటి వచ్చినందుకు.అసలు ఏది శాశ్వతం మన పిచ్చి  గాని..! ప్రతిదాన్ని దాటుకుంటూ అలా పోవలసిందే." మొదటి పీరియడ్ ,ఎయిత్ ఏ సెక్షన్ కి వెళ్ళండి ఈ రోజు..క్లాస్ టీచర్ సెలవు పెట్టారు " అని హెడ్ మాష్టర్ గారు చెప్పడం తో శ్రీనివాస్ కి వెళ్ళక తప్పింది కాదు.

" గుడ్ మార్నింగ్ సార్ "  లోపలికి వెళ్ళగానే పిల్లలంతా ఉమ్మడిగా అరిచారు.

" గుడ్ మార్నింగ్ "

హాజరు తీసుకోవడం అయింది.ఇది ఎక్స్ ట్రా పీరియడ్ కదా.జనరల్ టాపిక్ ఏదైనా చెప్పాలనిపించింది.

" పిల్లలూ...స్వచ్ భారత్ గురించి మీకు తెలిసింది చెప్పండి " అన్నాడు శ్రీనివాస్. అడగటమే తరువాయి మొదటి బెంచ్ లో ఉన్న విష్ణు వెంటనే లేచి దాని ప్రాధాన్యతని వివరించసాగాడు.ఎంత వివరంగా చెప్పాడు అనిపించింది.

" నువు రోజు పేపర్ చదువుతావా ..చాలా బాగా చెప్పావురా అబ్బాయ్.." అన్నాడు శ్రీనివాస్ .

" సార్....రెండు మూడు పేపర్లు చదువుతా ఇంకా పుస్తకాలు అవీ కూడా చదువుతాను.నేను ఆరవ  తరగతి లో ఉన్నప్పుడు మా తాతయ్య ఒకసారి లైబ్రరీ కి తీసుకెళ్ళి చూపించి ఇక్కడ ఏవీ చదువుకున్నా ఉచితం గా చదువుకోవచ్చు..మంచి నాలెడ్జ్ వస్తుంది అని చెప్పాడు..అప్పటి నుంచి వదలకుండా వెళుతూనే ఉన్నాను.చదువుతుంటే బోలెడు విషయాలు కూడా తెలుస్తుంటాయి సార్" అని వివరించాడు విష్ణు.

" వెరీ గుడ్..మంచి పని చేస్తున్నావు...పనికిమాలిన టివి  సీరియల్స్ కి అతుక్కుపోకుండా అలా లైబ్రరీ కి వెళ్ళడం చాలా మంచిది.పిల్లలూ ఈ విషయం లో అందరూ మన విష్ణు ని ఆదర్శం గా తీసుకొండి..సరేనా..?"

" సరే..సార్" మూకుమ్మడిగా అన్నారు పిల్లలు.

చూడనట్టే నటిస్తూ రెండో బెంచ్ చివరి లో కూర్చున్న ఒకడి ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు శ్రీనివాస్.వాడు మాత్రం దేనికి పెద్ద గా స్పందించడం లేదు.పిల్లలు చెప్పే దానికి గాని,టీచర్ చెప్పేదానికి గాని.ఏమిటి వాడికి ఆ ఉదాసీనత.వేలెడు  లేని వాడికి అంత పొగరా ..?  అహం దెబ్బ తిన్నది.ఆ పిల్లవాని కళ్ళ లోకి అదే ఇది గా కాసేపు చూశాడు.వాడి కళ్ళ లో భయమూ లేదు.పశ్చాత్తాపమూ లేదు.ఇంకా చిర్రెత్తుకు వచ్చింది.ఏమిటి ఆ నిర్భయత.

" ఒరేయ్ ..లే..ఏమిటి నీ పేరు.." చూసి ఇక ఉగ్గబట్టలేక గదమాయించాడు శ్రీనివాస్.

" రమేష్ సార్" నిర్లిప్తంగా అన్నాడు వాడు.వాడు కోపంగా అన్నాడో ,మామూలు గానే అన్నాడో తెలియలేదు.సహనం నశించింది.

" నువు వింటున్నావా..క్లాస్ లో చెప్పుతున్నది..చెప్పు రా ఇందాక విష్ణు చెప్పిన పాయింట్స్ కొన్ని చెప్పు" శ్రీనివాస్ రెట్టించి అడిగాడు.

" విన లేదు..సార్ ,నేను చెప్పలేను.." డైరెక్ట్ గా చెప్పాడు వాడు.ఎంత ధైర్యం వీడికి ..కోపం నషాళానికి అంటింది.

" అరే ..ఇటు రారా.."

దగ్గరకి వచ్చాడు రమేష్. లాగి గూబ మీద ఒక్కటి ఇచ్చాడు శ్రీనివాస్.రమేష్ గది మూలకి పోయి పడ్డాడు.మెల్లిగా లేచాడు వాడు..కంటి లో నీటి చుక్క లేదు.వీడు ఏదో వింత రకం  పిల్లాడి లా ఉన్నాడే అనిపించింది శ్రీనివాస్ కి.తన సర్వీస్ లో ఇలాంటి విధ్యార్థి ని చూడటం ఇదే తొలిసారి.క్లాస్ నుంచి బయటకి వచ్చేశాడు బెల్ అవడం తో.ఇంటర్వెల్ సమయం లో విష్ణు ని పిలిచి అడిగాడు శ్రీనివాస్.

" ఏమిట్రా..ఆ రమేష్ వొట్టి బండ లాగా ఉన్నాడేంటి రా " అని.

" అప్పుడప్పుడు వాడు అంతే సార్.పొద్దుట పూట వాళ్ళ అమ్మ వచ్చింది గదా ..ఇక అంతే సార్ ఆ రోజంత"

" కొద్ది గా వివరంగా చెప్పు ..వాళ్ళ అమ్మ రావడం ఏమిటి ..దేనికి.."

" అంటే...వీళ్ళమ్మ నాన్న లకి గొడవ లయి వాళ్ళమ్మ  వేరే ఆయన్ని చేసుకొని వెళ్ళిపోయింది సార్. ఎప్పుడైనా రమేష్ ని చూడటానికి ఆమె  బడికి  వస్తే ..అది గాని వాళ్ళ నాన్న కి తెలిసిది అనుకో వీడిని కొడతాడు సార్..ఎందుకు మాట్లాడావని..!స్కూల్ దగ్గర కూడా ఓ సారి పెద్ద గొడవ అయింది సార్..అప్పుడు మీరు ఈ బడికి రాకముందు సార్.." వాడికి తోచిన భాష లో వాడు చెప్పుకు పోతున్నాడు.

ఇక మిగిలింది అంతా తాను ఊహించగలడు.ఎటువంటి  దెబ్బలు ..ఆ పసి మనసు లో తగిలినవి...!చెప్పలేని వెతలు అవి.జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసే కవుకు దెబ్బలవి.తాను ఎంత పొరబాటు చేశాడో ..గుర్తు వచ్చి వెంటనే ఆ కుర్రవానికి సారీ చెప్పాలని అనిపించిది ఆ మేష్టారు కి.కాని అతని వయసు ఎంత ..నేను సారీ చెపితే అతని తోటి పిల్లలు ఏమనుకుంటారు.లేదు ..ఇవాళ కాదు రేపు ..రేపు అతడిని పిలిచి ఏదో రకంగా ఊరడిస్తాను.ఆ విధంగా పాప ప్రక్షాళన చేసుకుంటాను అనుకున్నాడు. - మూర్తి కెవివిఎస్

No comments:

Post a Comment